ఓం శ్రీ గురుభ్యో నమః
మా పెద్దలు చేసుకున్న పుణ్యఫలం వలన, మేము చేసుకున్న పూర్వజన్మల పుణ్య కర్మల ఫలంగా శ్రీ పూర్ణానంద స్వామి దర్శన భాగ్యం మాకు పోచంపాడు ప్రాజెక్ట్(శ్రీ రాం ప్రాజెక్ట్) కాలని లో శ్రీ రాధాకృష్ణ మూర్తి గారి ఇంట్లో లభించింది. మా సతీమణి రంగాదేవి మరియు మా సోదరి బాలాత్రిపుర సుందరి ఇద్దరు వినాయక చవితి పండుగ సందర్భంగా తొమ్మిది వినాయకుల దర్శనం చేసుకోవాలని కాలని లో అందరి ఇళ్ళల్లో గణపతి దర్శనం చేసుకుంటూ బి.ఆర్.కె. గారి ఇంటికి వెళ్ళారు.అక్కడ కూడా గణపతిని చూసి "వందనం వందనం" అనే పాట పాడటం జరిగింది.వారింట్లో శ్రీ పూర్ణానంద స్వామిజి వేంచేసి ఉన్న విషయం తెలియదు.పాట పూర్తి అయ్యాక స్వామి వారు వీరిద్దరిని లోపలకి పిలిపించుకున్నారు. అదే మొట్టమొదటి దర్శన భాగ్యం.
- చింతా మురళీ కిషన్ రావు
మీలో ఎవరు పాడింది అని అడగగా,రంగాదేవి "నేనేనండి" అని తెలియజేసింది.
చాలా బావుంది ,ఇంకొకసారి పాడతారా మాకోసం అని స్వామీజీ పాడించుకున్నారు.
అది మొదలు ప్రతి రోజూ సాయంత్రం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం, భజన కీర్తనలు పాడటం ఒక అలవాటుగా మారింది. తర్వాత కొన్ని రోజులకి స్వామీజీ మా ఇంటికి రావడం, వారు శ్రీసుక్తం చదువుతుండగా వారికి అభ్యంగన స్నానం చేయించే భాగ్యం మాకు కలిగింది. ఈ విధంగా స్వామీజీ తో సాన్నిహిత్యం ఎక్కువ అవుతూ వచ్చింది .
పోచంపాడు కాలనీ లో మహిళలు అందరు ఓ బృందంగా యేర్పడి వారానికి మూడు రోజులు ఒక్కొక్కరి ఇంట్లో భజనలు చేసేవారు. అలా ఒకసారి వారందరికి భగవద్గీత పారాయణం నేర్చుకోవాలని సంకల్పం కలిగి, నా శ్రీమతి రంగాదేవిని అడిగారు. నేర్పించడం పూర్తి అయ్యేనాటికి స్వామీజీ పోచంపాడు కి వచ్చారు. ఒక రోజు స్వామి వారిని, భజన కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమం అయ్యాక,ఆ మండలి సభ్యులు గీతా మకరందం అనే బృహత్ గ్రంధం , వెండి కృష్ణుడి ప్రతిమ మరియు బంగారపు ముత్యపు ఉంగరం స్వామీజి హస్తాలనుండి రంగాదేవికి అందింపచేసారు. అలా స్వామివారి చేతులమీదుగా ఆ గ్రంథము, విగ్రహము అందుకొవడం ఎన్నో జన్మల సుకృతం. అప్పుడే స్వామివారు గీతామాత అని రంగాదేవిని సంబోధించారు. అప్పటినుండి స్వామీజీ భక్తులందరు గీతామాతా అనే పేరుతోనే పిలుస్తున్నారు.
స్వామీజీ భువనేశ్వరి యంత్రం లిఖించాలని అనుకున్నాక కాలనీ లో పదిహేను యేళ్ళ వయసు లోపు ఆడపిల్లలని పిలిచి ఒక పళ్ళెం లో పూలు ఉంచి, వాటిని తీసి తన చేతికి ఇవ్వమని అన్నారు. వారిలో మా పెద్ద అమ్మాయి పద్మ కూడా ఉంది. ఐదు పూలు తీసిన వారింట్లో చేయాలని సంకల్పించారో ఏమో,మా అమ్మాయి ఐదు పూలు తీసి స్వామివారి చేతిలో పెట్టడంతో కోటి జన్మల పుణ్యఫలంగా,స్వామివారు మా ఇంట్లో భువనేశ్వరి యంత్రం లిఖించడం జరిగింది.ఆ యంత్ర రచన చేసినన్ని రోజులూ,పొద్దున్నా మధ్యాహ్నం దద్ధోజనం మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. మధ్యలో స్వామీజీ అలవాటుగా కాఫీ కూడా తీసుకునేవారు. యంత్ర రచన పూర్తయ్యేనాటికి పోచంపాడు ప్రాజెక్టు లోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉందటం వల్ల అక్కడికి వచ్చిన నాదస్వరం వింద్యాంసులు,గాయకులు స్వామివారి దర్శనంకై వచ్చి భువనేశ్వరి అమ్మవారి ముందు కచేరీలు చేసేవారు. కాలనిలో ఉన్న స్త్రీలందరు వచ్చి రోజూ స్వామివారి సమక్షంలో, భువనేశ్వరి యంత్రం కి కుంకుమార్చన చేసేవారు.ఈవిధంగా ఆనుకోకుండా అమ్మవారికి ఎంతో వైభవంగా అన్నీ సేవలు జరగడం స్వామివారి కరుణాకటాక్షాలే.
యంత్ర రచన జరిగాక కొంత కాలం వరకు ప్రాజెక్ట్ లో ఆడపిల్ల పుడితే భువన అని భువనేశ్వరీ అని పేరు పెట్టడం అలవాటుగా మారింది.
అదే సమయంలో,వరంగల్ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నశ్రీ పీతాంబరాచారిగారు శ్రీరామనవమి ఉత్సవాల్లో కచేరీకి అని వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుని,అమ్మవారి ముందు తన్మయత్వంతో మోహన రాగంలో 'మోహన రామా’ అనే కీర్తన ఆలపించారు. స్వామీజీ తమకి ఇష్టమైన మోహనరాగం విని ఎంతగానో సంతోషించి వారిని ఆశీర్వదించారు.
ఆ కీర్తన మళ్ళీ ఆ విధంగా పాడలేకపోయానని తర్వాత చాలాసార్లు ఆయన నాతో అన్నారు.
Comentarios