శ్రీ రమేష్ జైన్ గారు పంచకున్న అనుభూతులు
1995వ సంవత్సరంలో సద్గురు శ్రీ శ్రీ శ్రీ పూర్ణానంద స్వామి వారిని మొదటిసారిగా మేము దర్శించుకున్నాము. నాకు మొదటి గురువులైన శ్రీ రాజేంద్ర బ్రహ్మచారులు వారి ద్వారానే నాకు శ్రీ స్వామి వారిని దర్శించుకునే అవకాశం కలిగింది. శ్రీ స్వామి వారి ముఖ్య శిష్యులలో ఒకరైన శ్రీ పీ. గోపాల కృష్ణ(PAO) గారి ఇంట్లో శ్రీ స్వామి వారిని నేను దర్శించుకున్నాను. ఆ రోజు అక్కడ ఉన్న శ్రీ స్వామి వారి శిష్యులతో వారు ఆధ్యాత్మిక పరమైన కొన్ని విషయాలను చెప్తుండగా అవి వినే భాగ్యం నాకు కలిగింది. అలా శ్రీ స్వామి వారిని దర్శించుకున్న మొదటి రోజే శ్రీ స్వామి వారి అనుగ్రహం చేత ఆత్మసాక్షాత్కారం వైపుగా నా ప్రయాణం మొదలయ్యింది.
శ్రీ స్వామి వారి సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరికి, తెలియని ఆనందానుభూతి కలగటమే కాక, కేవలం శ్రీ స్వామి వారి దృష్టికి పాత్రులైన ప్రతి జీవి ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఓనమాలు కూడా తెలియని నా జీవితానికి శ్రీ స్వామి వారు అలా మొదటి దర్శనంలోనే ఆధ్యాత్మిక బీజాలను నాటారు. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన, సంక్లిష్టమైన విషయాలను కూడా శ్రీ స్వామి వారు ఒక సామాన్యుడికి, పామరుడుకి అర్ధమయ్యే రీతిలో అనుభవ పూర్వకంగా బోధించేవారు. ఒకసారి మండుటెండా కాలంలో శ్రీ పి.గోపాల కృష్ణ గారి ఇంట్లో నేను, నా భార్య శ్రీ స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్ళాము. ఆ రోజు శ్రీ స్వామి వారితో కొంత ఏకాంత సమయం గడిపే భాగ్యం మాకు కలిగింది. ఆధ్యాత్మిక పరమైన ఎన్నో గొప్ప విషయాలను శ్రీ స్వామి వారు మాతో పంచుకున్నారు. వారు ఆ రోజు మాతో చెప్పిన విషయాలను గ్రహించే స్థితి, స్థాయి మాకు లేకపోయినప్పటికీ, మేము మాటల్లో వర్ణించలేనటువంటి ఆనందాన్ని ఆ రోజున పొందాము. అలా సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి శ్రీ స్వామి వారు ఆ విషయాలను మాతో పంచుకోవటం మొదలు పెట్టారు. ఆ తరువాతి రెండు గంటలలో మేము వేరే లోకానికి వెళ్ళమేమో అనిపించేంత దివ్యానుభూతిని పొందాము. ఎండా కాలం కావటం వలన ఆ రోజు వ్రిష్ణోగ్రత దదాపుగా నలభై డిగ్రీల పైనే ఉంది. శ్రీ స్వామి వారు మాట్లాడటం మొదలుపెట్టాక వాతావరణం ఉన్నట్టుండి ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయి, ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఎండకు బదులు చల్లటి గాలులతో జల్లులు మొదలయ్యాయి. ఆ తరువాతి కొన్ని గంటలు అక్కడ కుండపోతగా వాన కురిసింది. ఆ రోజు కురిసిన అకాల వర్షం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక సిద్ధ పురుషుడు ప్రపంచానికి అతీతమైన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రకృతి కూడా పరవశించి, ఆ విషయాలను తెలుసుకొనేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుంది అని శ్రీ స్వామి వారు మాతో ఆ రోజు వాతావరణంలో సంభవించిన పెనుమార్పు గురించి వివరించారు. ఆ రోజు జరిగిన ఆ దివ్య సంఘటనను మేము ఎప్పటికి మరచిపోలేము.
అలా శ్రీ స్వామి వారితో మా ప్రయాణంలో భాగంగా నేను నా భార్య తరచూ శ్రీశైలం వెళ్తూ ఉండేవాళ్ళము. ఆధ్యాత్మిక మార్గం పట్ల మాకున్న ఆసక్తిని గమనించిన శ్రీ స్వామి వారు, వారితో కొంత సమయం ఏకాంతంగా గడిపే అవకాశాన్ని మాకు కలిపించారు. అలా గోశాలలో, లోపల ప్రాంగణం వరండా లో శ్రీ స్వామి వారితో ఏకాంతంగా సమయం గడిపే అవకాశం మాకు లభించింది. వారి సన్నిధి, వారి నిర్దేశం, వారు చెప్పిన విషయాలు ఎంతో అపురూపమైనవి, వెలకట్టలేనివి.ఎంతో అలవోకగా, అనుభవపూర్వకంగా, జ్ఞానాన్ని ప్రసాదించగల శ్రీ స్వామి వారి సన్నిధిలో, నేను సమాధి స్థితిని పొందకలిగాను. వారి సన్నిధి నుండి మేము మా గదికి వెళ్ళాక శ్రీ స్వామి వారు చెప్పిన విషయాల పట్ల రాత్రంతా నిదిధ్యాసనం చేసి, మరుసటి రోజున శ్రీ స్వామి వారిని దర్శించుకున్నప్పుడు, మా నిరిధ్యాసనం వలన కలిగిన అనుభూతిని శ్రీ స్వామి వారితో పంచుకోగా, వారు అందుకు ఎంతగానో సంతోషించి, మమ్మల్ని అభినందించేవారు. ఒక్కోసారి అలా నిరిధ్యాసనం చేస్తున్న సమయంలో నా తల ఎంతో బరువుగా అనిపించి, కొన్ని గంటల పాటు నేను విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి కూడా చూసాను. శ్రీ స్వామి వారితో ఒక సారి ఈ విషయాన్నీ ప్రస్తావించగా, సాధారణంగా సంకోచ స్థితిలో ఉండే మనసు-బుద్ధి, అలౌకికమైన అనుభూతి పొందినపుడు విస్తరిస్తుంది అని, దాని వలెనే తల బరువుగా అనిపిస్తుంది అని వివరణ ఇచ్చారు.
శ్రీ స్వామి వారిని దర్శించుకున్న అతి తక్కువ కాలంలోనే వారు మాకు ప్రపంచమయ్యారు. రోజులో ఇరవైనాలుగు గంటల పాటు శ్రీ స్వామి వారి స్మరణ, ఆలోచన తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. అది వారి కృప వల్లనే సాధ్యం. ఒకసారి శ్రీ స్వామి వారితో కలిసి వారి తపోస్తానానికి వెళ్లే అవకాశం మాకు లభించింది. అక్కడ శ్రీ స్వామి వారు కారియర్ లోని శ్రీ దొరైస్వామి గారి ఇంటివద్దన ఉన్న కుటీరంలో ఉన్నారు. మాతో పాటు వచ్చిన మిగతా ఇరువై కి పైగా శ్రీ స్వామి వారి శిష్యులు బాణతీర్థ జలపాత సమీపాన శ్రీ స్వామి వారు తపస్సునాచరించిన స్థలాన్ని చూసేందుకు బయలుదేరారు. వారితో శ్రీ స్వామి వారు వెళ్ళటం లేదని మాకు తెలిసి, మేము ఆగిపోగా, శ్రీ స్వామి వారు, అందరితో మీరెందుకు వెళ్లలేదని మమ్మల్ని అడిగారు. అందుకు నేను, "సాక్షాత్తు శివుడే ఇక్కడ ఉండగా ఇంకా మాకు శివలోకంతో పనిలేదు కదా స్వామిజి", అన్నాను. ఆ మాటకి శ్రీ స్వామి వారు ఒక చిరునవ్వు నవ్వి, నన్ను ఎంతో అభినందించారు. శిష్యులందరు బయలుదేరి వెళ్ళాక శ్రీ స్వామి వారు మాతో చాలా సమయం గడిపి, మాకు ఎంతో గొప్ప అనుభూతిని ప్రసాదించారు. ఆ మరుసటి రోజు మేము పొందిన అనుభూతి గురించి శ్రీ స్వామి వారి తపోస్థానానికి వెళ్లిన మిగిలిన శిష్యులతో వివరించగా, వారు ఆ సమయం లో శ్రీ స్వామి వారి సన్నిధి లో లేనందుకు ఎంతగానో చింతించారు.
శ్రీ స్వామి వారికి మా పట్ల ఉన్న అనుగ్రహం వలన, వారు మా ఇంట్లో ఒక పదిహేను రోజుల పాటు బస చేశారు. ఆ పదిహేను రోజులు మర్చిపోలేనివి. తెల్లవారుఝామున శ్రీ స్వామి వారి దర్శనం కోసం వారి గది బైట ప్రతి రోజు మేము దాదాపు రెండు గంటల పాటు ఎదురు చూసేవాళ్ళము. అలా తెల్లవారు ఝామున శ్రీ స్వామి వారిని దర్శించుకున్నాక, వారితో కలిసి కాఫీ తాగే భాగ్యం మాకు కలిగింది. తెల్లవారుఝామున శ్రీ స్వామి వారి దర్శనమంటేనే అది ఎంతో దివ్యమైన అనుభూతి. అలాంటిది వారి సన్నిధి లో, ఆ సమయంలో, వారితో కలిసి కాఫీ తాగటం, అప్పుడు శ్రీ స్వామి వారు మాకు ప్రసాదించిన దివ్యానుభూతి మాటల్లో వర్ణించలేనిది. అందుకే అలంటి సందర్భాలను మేము 'కాఫీ మోక్ష సెషన్స్' అని పిలుచుకునేవాళ్ళము.
శ్రీ స్వామి వారు ఈ ప్రపంచం లో మన అందరి మధ్యనే ఉన్నప్పటికీ, ఒక్కోసారి వారు ఉన్నట్టుండి వేరే స్థితిలోకి వెళ్ళిపోయేవారు. అలా కొన్ని సందర్భాలలో వారు ఉన్న చోటనే చాలా సేపు మౌనం గా కూర్చొని ఉండిపోయేవారు, ఒక్కోసారి ఎన్నో అలౌకికమైన విషయాలను పంచుకునేవారు. శ్రీ స్వామి వారితో మేము ఒకసారి ఏర్కాడ్ లో ఉన్న కాఫీ ప్లాంటేషన్స్ కి వెళ్ళాము, అక్కడ శ్రీ స్వామి వారు ఉన్నట్టుండి ఒక ఇరుకైన రోడ్డు లో, ఒక హోటల్ పక్కన మురికిగా ఉన్న గట్టు పై కూర్చొని ఆధ్యాత్మిక విషయాలను బోధించటం మొదలు పెట్టారు. అసలు కూర్చోటానికే వసతిగా లేని ఆ చోట, శ్రీ స్వామి వారు చాల సేపు కూర్చొని ఎంతో అనర్గళంగా గొప్ప విషయాలను మాతో పంచుకున్నారు. శ్రీ స్వామివారి అనుగ్రహ ప్రవాహానికి కాలం, స్థలం, వసతులు వంటి ప్రాపంచిక విషయాలు అడ్డు కావు. ఆ అనుగ్రహం అన్నిటికి అతీతమైనది. వారి శిష్యులకు ఆధ్యాత్మికంగా మార్గాన్ని ఏర్పరిచేందుకు వారు ఏ చిన్న అవకాశాన్ని విడువలేదు. చివరికి వారి ఆరోగ్య పరిస్థితులు సహకరించని సమయంలో, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ కూడా వారు ఎంతో ఓపికతో, ఎందరికో ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేస్తూ, అందరికి అనుగ్రహాన్ని ప్రసాదించారు.
అలా ఒక సందర్భంలో శ్రీ స్వామి వారు తీవ్ర అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఎంతో అసౌకర్యంతో పాటుగా, భరించలేనెంత బాధ కలిగించే ఆరోగ్య ఇబ్బందులతో, రెండు రోజుల పాటుగా వారు అసలు మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. వారు స్పృహలో లేరని, రెండు రోజులుగా ఆహారము కూడా తీసుకోలేదని వైద్యులు చెప్పారు. మేము శ్రీ స్వామి వారి మంచాన్ని సమీపించగానే వారు ఒక్కసారి కళ్ళు తెరిచి, వారంతట వారే లేచి కూర్చుని ఆధ్యాత్మిక విషయాలను బోధించటం మొదలు పెట్టారు. వారి శరీరమంతా దివ్యంగా వెలిగిపోతూ ఉంది. అలా ఆసుపత్రి లో, అటువంటి పరిస్థితులలో కూడా శ్రీ స్వామి వారు వారి శిష్యుల ఆధ్యాత్మిక పురోగతి గురించే తపించారు. ఆ సంఘటన అక్కడ ఉన్న మాతో పాటు మిగతా అందరికి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగచేసింది.
వారు సాక్షాత్తు నడిచే దేవుడు, పూర్ణ బ్రహ్మ, వారి పేరుకు తగ్గట్టుగానే వారు పూర్ణనందులు. ఇటువంటి అరుదైన గురువులు దొరకటం మన అందరి అదృష్టం.
Kommentare