top of page

|| యతో వాచో నివర్తంతే || - 10

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


మహాత్ముల చరిత్రలు ఎంతో అద్భుతంగా, అసాధారణంగా ఉంటాయి. వారి జీవితంలో ప్రతి ఘట్టం జ్ఞాన బోధ చేస్తుంది,వారు వేసే ప్రతి అడుగు పదిమందికి మార్గదర్శకంగా ఉంటుంది. అటువంటి మహాత్ముల జీవిత చరిత్రలు ఎన్ని సార్లు చదివినా, చదివిన ప్రతిసారీ కొత్తగా ఏదో ఒక విషయం మనకు బోధ పడేలా చేస్తుంది, వారి మహిమలు ఎంత స్మరించుకున్నా ఆనంద దాయకంగానే ఉంటుంది కానీ తనివి తీరదు.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 


అటు వంటి మహాత్ములు శ్రీ పూర్ణానంద స్వామి వారు, 1969లో హఠకేశ్వరానికి వచ్చిన కొన్ని రోజులకే, వారి అనుగ్రహం వల్ల నాతో పాటూ కొంత మంది వారి సన్నిధికి చేరాము.శ్రీ స్వామి వారి యొక్క మహిమల్ని ప్రత్యక్షంగా చూసిన మాకు, వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. అసలు వారు ఎక్కడ జన్మించారు? వారి తల్లితండ్రులెవరు? వారి గురువుగారు ఎవరు? వారు ఏం చదువుకున్నారు? ఇలా వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని, మా అందరికీ ఉండేది. కానీ వారిని ఇవన్నీ అడిగే ధైర్యం మా ఎవ్వరికీ లేదు. ఎప్పుడన్నా వారు కొంచెం చనువు ఇచ్చినప్పుడు, కొన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేవాళ్ళం.లేదా, మా ఆసక్తిని గమనించి, స్వామి వారు, వారంతట వారే కొన్ని విషయాలు స్వయంగా మాతో చెప్పారు.వారు 1939వ సంవత్సరంలో మధురై పట్టణం లో పుట్టారు. వారి పూర్వ నామధేయం శ్రీ కామేశ్వరన్. వారి తల్లిగారి పేరు శ్రీ పర్వతవర్ధని గారు, తండ్రిగారు శ్రీ సుబ్రమణ్యశాస్త్రి గారు. వారి విద్యాభ్యాసం అంతా సాత్తూర్ అనే ఒక చిన్న ఊరిలో పూర్తి చేసుకున్నారు. వారిదొక గొప్ప జ్ఞాన సంపన్న కుటుంబమని, వారి తండ్రిగారైన శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి గారే వారి ప్రథమ గురువులని, ఇంకా వారి బాల్యం లో జరిగిన ఎన్నో మహిమల గురించి, గొప్ప సంఘటనల గురించి వారు స్వయంగా మాతో చెప్పారు.

అలా స్వామి వారు చెప్పిన వారి చిన్ననాటి సంగతులన్నీ నేను రాసుకున్నాను.అంతటి మహిమాన్వితుల గురించి విన్నాక, అసలు ఇదంతా నిజమేనా? అనే ఆలోచన నాకు నిద్రపట్టనివ్వకుండా చేసింది. ఒకసారి వివరంగా వారు చెప్పిన విషయాలన్నీ ప్రత్యక్షంగా చూసి వస్తే ఎలా ఉంటుంది?, అని ఆలోచించుకొని వెంటనే ఉద్యోగానికి ఒక నెలరోజులు సెలవు పెట్టుకొని,ఇంట్లో వాళ్లకి ట్రైనింగ్ కోసం వెళ్తున్నా, అని అబద్ధం చెప్పి తమిళ్ నాడుకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను.అప్పుడు నాతో పాటు నందికొట్కూరు రాజు గారు కూడా వస్తానన్నారు. సరే ఇద్దరం కలసి వెళ్ళొద్దామనుకున్నాము. అప్పట్లో మద్రాస్ వెళ్లాలంటే ఒంగోలు నుండి ఒక పాసెంజర్ రైలు ఉంది. శ్రీశైలం నుండి బెంగుళూరు వెళ్లే బస్సు, ఒంగోలులో ఆగుతుంది.వెళ్ళే ముందు స్వామి వారి దర్శనం చేసుకొని వెళదాం కదా అని, బస్సు కండక్టర్ కి హఠకేశ్వరం దగ్గెర బస్సు ఒక రెండు నిమిషాలు ఆపితే మేమొచ్చి ఎక్కుతామని చెప్పుంచి, స్వామి వారి దగ్గెరికి వెళ్ళాము. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు. మా బస్సు 2 గంటలకు హఠకేశ్వరం దగ్గర ఆగుతుంది. సరే, స్వామి వారికి నమస్కారం చేసుకొని,“ స్వామి మాకు విశాఖపట్నం లో పొలాలున్నాయి, ఇది పంట చేతికొచ్చే సమయము, ఒక నెల రోజులు అటు వెళ్ళొస్తాను”,అని తల దించుకొని నెల వైపు చూస్తూ, వారితో అబద్ధం చెప్పాను. దానికి వారు, “You can go, but there is language problem for you. If you have no objection, I will come as a guide with you”, అన్నారు. అందరికి అబద్ధం చెప్పి నమ్మించాకలిగాను కానీ, వారు మాత్రం నా మనసులో ఏముందో గ్రహించారు. ఇక నాకు కళ్ళనుండి టప టపా కన్నీళ్ళొచ్చాయి. వెంటనే వారికి నమస్కారం చేసుకొని, “స్వామి మీ చరిత్ర గురించి తెలుసుకుందామని వెళ్తున్నాను”, అన్నాను.దానికి వారు ,”No objection, I will come as a guide. I will assist you, thats all!”, అన్నారు.

ఇక మరో మాట లేకుండా వెంటనే వారు కూడా ఉన్నపళంగా అలానే కౌపీనంలో మాతో పాటూ బయలుదేరటానికి సిద్ధపడ్డారు.నేను నా బాగ్ లో ఉన్న ఒక పట్టు ఉత్తరీయం తీసి వారికి చుట్టాను. ఇక స్వామి వారితో పాటు నేను, నందికొట్కూరు రాజుగారు తమిళనాడుకు పయనమయ్యాము. ఒంగోలుకి బస్సు ఎక్కిన దగ్గర నుండి ఏదో మాయ కమ్మినట్టుగా, స్వామి వారితో చనువుగా ఉండటం మొదలుపెట్టాను.వారు కూడా ఏదో స్నేహితులతో ఉన్నట్టు మాతో కలిసిపోయారు. మేము తెచ్చుకున్న సామాన్లు వారు మోస్తున్నామేము దానికి అభ్యంతరం చెప్పలేనంత మాయలో కి వెళ్ళిపోయాము. అలా వారు మాతో అంత సన్నిహితంగా మాట్లాడుతూ, దేనికైనా ప్రాప్తం, అదృష్టం ఉండాలిరా అన్నారు. నాకు ఈ రెండు అసలు అర్ధం కాలేదు. ప్రాప్తం, అదృష్టంలా ఏం లేదు స్వామి, పైసా మే పరమాత్మా, డబ్బుంటే ప్రాప్తం, అదృష్టం వస్తాయి.డబ్బు లేకపోతే ప్రాప్తం, అదృష్టం కూడా ఎం చేయలేవు. కాఫీ తాగాలంటే డబ్బులు కావాలి కదా, డబ్బులు ఇవ్వకుండా కాఫీ అమ్మేవాడు కాఫీ ఇవ్వడు కదా, అని ఏదో పండితుడిలా నేను ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మొదలు పెట్టాను. చివరికి వారు, "Do you want to experience it?", అన్నారు. నేను అలాగే స్వామి అన్నాను. వారు, "Are you prepared for it?", అని అడిగారు. నేను, అందుకే కదా స్వామి మీతో ఇప్పుడొస్తుంది, అన్నాను. నేను నాతో ఆ నెలరోజుల ఖర్చుల కోసం ఒక 700 రూపాయలు తెచ్చుకున్నాను. దారిలో దొంగల బెడద ఉంటుంది కాబట్టి, ఆ డబ్బులు కొంచం కొంచంగా అక్కడక్కడా దాచిపెట్టి ఉంచాను. ఇంతలో ఒక యాచకుడు వచ్చి, “స్వామి!?”, అని స్వామి వారి దగ్గెర యాచించాడు. స్వామి వారు నా వైపు చూసి వాడికి డబ్బులియివ్వమన్నారు. నేను ఒక coin తీసి ఇవ్వబోయాను, స్వామి వారు, coin కాదు, note తీసి ఇవ్వు అని, నా జేబులో చెయ్యి పెట్టి, పై జేబులో ఉన్న మొత్తం తీసి ఆ యాచకుడికి ఇచ్చేసారు. వాడు చాల సంతోషంగా ఆ డబ్బులు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.మేము ఎక్కింది ప్యాసింజర్ రైలు అవ్వటం వలన, అది ప్రతి స్టేషన్ లో ఆగేది, ఆలా వచ్చిన ప్రతి స్టేషన్లో కనిపించిన ప్రతి యాచకుడికి నేను దాచిపెట్టుకున్న మొత్తం 700 రూపాయలు దానమిచ్చేసారు. ఏమి కాదులే, మేమున్నాం కదా, చూసుకుంటాము అన్నారు. ఇప్పుడు నా దగ్గెర చిల్లి గవ్వ కూడా లేదు.

చివరికి తిరువట్టియూర్ అనే స్టేషన్ కి ముందు ఆ రైలు ఆగింది. స్వామి వారు కంపార్ట్మెంట్ అంతా వాసనగా ఉంది, దిగేద్దాం అంటున్నారు. నేనేమో, మనం టికెట్లు మద్రాస్ వారుకు తీసుకున్నాం స్వామి, అక్కడ దాక వెళ్దాం అంటున్నాను. అలా స్టేషన్ కి ముందే వారు ఆగిఉన్న రైల్లో నుండి కిందకి దూకి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి వెనక రాజు గారు కూడా వెళ్తున్నారు. స్టేషన్ ముందు దిగి నడుచుకుంటూ వెళ్ళటమెందుకని నేను అలా చూస్తూ ఉన్నాను. స్వామి వారు కనీసం వెనక్కి తిరిగి చూడట్లేదు. వారు నన్నొదిలేసి వెళ్ళిపోతారని నాకు కంగారు మొదలయింది. ఇంతలో ఆ రైలు కాస్తా కదిలింది. నా దగ్గెర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. అంతా చూసుకుంటామని అభయమిచ్చిన స్వామి వారు వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు, ఇక చేసేది లేక నేను కూడా నెమ్మదిగా కదులుతున్న రైలు నుండి దిగి, నా సంచులు దింపాల్సిందిగా ఒకరిని అడిగాను. అతను నాలుగు సంచుల్లో రెండు సంచులు నా మీదకి విసిరి, మిగతా రెండు సంచులు కనిపించటం లేదని అన్నాడు. ఇంతలో ఆ రైలు కాస్త వెళ్ళిపోయింది. ఉన్న డబ్బులతో పాటు, రెండు సంచులు కూడా పోగొట్టుకొని, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాను. స్వామి వారి వేగాన్ని అందుకుందామని నేను కూడా ఆ కంకర రాళ్లు మీద వేగంగా నడవటం మొదలు పెట్టాను. ఆ రాళ్లు తగిలి నా చెప్పు తెగిపోయింది. ఆలా చెప్పులు లేకుండా కంకర రాళ్లు మీద నడుచుకుంటూ, రెండు సంచులు, చేతిలో ఉన్న మొత్తం డబ్బులు పోగొట్టుకొని స్వామి వారు వదిలేసి వెళ్ళిపోతారేమో అని కంగారుతో వారి వేగాన్ని అందుకోలేక అవస్థపడుతూ వారి వెంట నడుచుకుంటూ వెళ్లాను.

కొన్ని గంటలకు ముందే ప్రాప్తం, అదృష్టం లాంటివేమీ ఉండవు, డబ్బే ప్రపంచాన్ని నడిపిస్తుంది అని స్వామి వారితో వితండ వాదం చేసిన నాకు, ఇప్పుడు వారి చరిత్ర తో పాటు, ప్రాప్తం, అదృష్టం అంటే ఏంటో కూడా చూపించబోతున్నారు. స్వామి వారికి పరీక్ష పెడదామనుకున్న నాకు, ఇప్పుడు వారు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నారు.

 

********సశేషం********


492 views0 comments

Comments


bottom of page