top of page

|| యతో వాచో నివర్తంతే || - 11

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


మొత్తానికి శ్రీ స్వామి వారితో ప్రాప్తం, అదృష్టం వంటివి ఉండవని వితండవాదం చేసిన కొన్ని గంటలకు, నేను తెచ్చుకున్న డబ్బులతో పాటు, నా రెండు సంచులు పోగొట్టుకొని, స్వామీ వారి మీదనే భారమంతా వేసి, వారి వెంట నడుచుకుంటూ వెళ్లాను.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

వారు తిరువట్టియూర్ లో ఒక పెద్ద దేవాలయం వద్దకు తీసుకు వెళ్లారు. పెద్ద పెద్ద ప్రాకారాలతో ఉన్న ఆ గుడి లో ఒక కోనేరు కూడా ఉంది. హఠకేశ్వరంలో నేను స్వామివారికి చుట్టిన పట్టు ఉత్తరీయం తీసేసి, వారు ఆ కోనేరులో ఈతకు వెళ్లారు. ఎంతో విస్తారంగా ఉన్న ఆ కోనేరు లో, వారు ఒక చోట మునిగేవారు, మరొక చోట తేలే వారు. స్వామి వారు ఆలా కోనేరు లో విన్యాసం చేస్తుంటే, ఎంతో ఆశ్చర్యం తో నేను వారిని చూస్తూ ఉండిపోయాను. స్వామి వారు నన్ను చూసి, కోనేరు లోకి దిగమని సైగ చేసారు. “నాకు ఈత రాదు స్వామి, ఇక్కడ ఉంటాను”, అని, నేను మెట్ల మీద కూర్చున్నాను. కొద్దిసేపటికి వారు కోనేరు నుండి బయటకు వచ్చారు. వారక్కడే ఉంటారు కదా అనుకోని, నా రెండు సంచులు, విడిచిన బట్టలు అక్కడే పెట్టి, నేను కూడా కొన్ని మెట్లు దిగి అక్కడే స్నానం చేసాను. వెనక్కి తిరిగి చూస్తే, స్వామి వారు, రాజు గారు అక్కడ లేరు. నా రెండు సంచులతో పాటు, బట్టలు కూడా కనిపించలేదు. ఆ చుట్టు పక్కలంతా వారి కోసం వెతికాను, కాని వారు కనపడలేదు. ఎవరినైనా అడుగుదామంటే అక్కడి బాష నాకు రాదు. అలా ఒక తుండు గుడ్డ చుట్టుకొని, ఆ గుడి పరిసరాలు మొత్తం స్వామి వారి కోసం గాలించాను. కనిపించిన ప్రతి ఒక్కరిని “స్వామి!” అని సైగ చేస్తూ అడిగినా, నేనేం చెప్తున్నానో ఎవరికీ అర్ధం కాలేదు. చివరికి ' స్వామివారు! ఇలా గడ్డం ఉంటుంది ' అని అభినయిస్తూ అడిగితే ఒకరెవరో ‘స్వామి ఆ!', అనుకుంటూ ఊరవతల ఎవరో కుప్పుస్వామి అని బండి తోలుకునే అతన్ని చూపించారు. అక్కడి నుండి మళ్ళీ ఆ గుడిని వెతుక్కుంటూ వెనక్కి చేరుకున్నాను. సరే! ఇక చేసేదేమి లేక, చేతికున్న మా నాన్నగారి బంగారు ఉంగరం అమ్మి, వచ్చిన డబ్బులతో వెనక్కి వెళదాం అనుకొని, ఎందుకైనా మంచిదని ఇంకోసారి గుడిలోకి వెళ్ళాను. ఆ గుడిలో ఒక పెద్ద మండపం వద్ద ఒక పెద్ద Q లైన్ చుసాను. ఏమైందా అని అటు వెళ్లి చుస్తే,స్వామి వారు అక్కడ ఆ మండపంలో కూర్చుని ఉన్నారు. వారిని దర్శనం చేసుకునేందుకు జనమంతా Q కట్టారు. హమ్మయ్య! స్వామి వారు కనిపించారు అని వారి దగ్గెరికి వెళ్ళబోతే, ఆ జనం లో నుండి ఒకరు నన్ను మెడపట్టుకుని Q లో రమ్మని గెంటేసారు. ఇదంతా గమనిస్తూ కూడా స్వామివారు మౌనంగా ఉన్నారు. అందరూ వెళ్ళిపోయాక స్వామివారి వద్దకు వెళ్లి నా బ్యాగులు ఎక్కడున్నాయని వెతుకున్నాను. ఇంతలో అక్కడికొచ్చిన జనం సమర్పించుకున్న దక్షిణ నా కంటపడింది. నాకు ఆ డబ్బు మీద ఆశ వచ్చింది. స్వామివారు నన్ను చూసి, "స్నానం అయ్యిందా?", అన్నారు." అయింది స్వామి.నా సంచులు ఏవి?", అని అడిగాను. వారు "మాకేం తెలుసు?", అన్నారు. అంటే స్వామివారు స్నానం చేసి గుడిలోకి వెళ్ళటం ఎవరో దొంగ చూసి నా సంచులు కొట్టేశాడు. స్వామి వారు, "పోతే పోయాయి, వాటితో పాటు నీ ప్రారబ్ధం కూడా పోయింది. ఈ డబ్బులతో, రోడ్డు చివరున్న షాప్ లో రెండు లుంగీలు కొనుక్కో. రోడ్డు మీద ఇడ్లీలు తిని, నాకొక Bun,tea తీసుకు రా!", అని అక్కడ పోగైన డబ్బులోంచి కొంత తీసి ఇచ్చారు.అలా ఒక పూట తిరువట్టియూర్ లో గడిపిన తదుపరి అక్కడి నుండి బయలుదేరి మద్రాసు చేరుకున్నాము. వారితో నా ప్రయాణంలో ప్రతి సంఘటన, ప్రతి క్షణం ఎంతో విలువైనది, వెల కట్టలేనిది. మన అహంకారం, తర్కం, జ్ఞానానికి అతీతంగా గురు కృప ఉంటుంది. నేను తెచ్చుకున్న డబ్బులు, వస్తువులు పోగొట్టుకున్నాకే ఆ విషయం నాకు అర్ధమయింది. డబ్బులు పోయాయనే బాధే కానీ, స్వామి వారు మాకు ఆ యాత్ర లో ఎంతో జ్ఞానం అనుభవాల ద్వారా ఇచ్చారు. ఒక కౌపీనదారి చేతిలో ఒక రూపాయి లేకుండా, వారితో పాటు మా ఇద్దర్నీ వెంటపెట్టుకొని, మా ఇద్దరికీ ఎటు వంటి లోటూ రాకుండా, వారి కోసం ఎవరైనా ఒక ఫలమో, కొంత డబ్బో ఇచ్చినా అవి మా ఇద్దరి కోసమే స్వామి వారు వెచ్చించారు కాని, వారికోసమని వారు ఏదీ అట్టిపెట్టుకోలేదు. శ్రీ స్వామి వారిని నమ్ముకొని, వారి మార్గాన్ని అనుసరించిన వారి పై స్వామి వారికుండే వాత్సల్యానికి ఇదొక నిదర్శనం.

మద్రాసు లో మేము ఒక హోటల్ గది లో బస చేసాము. కొంత విశ్రాంతి తీసుకున్నాక, స్వామి వారు ఊరిలో వారి బంధువులలో ఒకరిని కలిసేందుకు నన్ను కూడా వెంటపెట్టుకొని వెళ్లారు. వారు స్వామి వారిని చూసి ఎంతో సంతోష పడ్డారు. వారి పేరు వెంకట రామన్ గారు. వారికి స్వామి వారితో ఉన్న అనుబంధం గురించి నాతో పంచుకున్నారు. వెంకట రామన్ గారికి స్వామీ వారు స్వయంగా మంత్రోపదేశం చేసారని, వారి తోబుట్టువు పెళ్లి భాద్యత కూడా స్వామి వారు తీసుకొని, కొంత కాలం ఉద్యోగం చేసి, ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారని చెప్పారు. రెండు రోజులు వెంకట రామన్ గారి ఇంట్లో ఉండి, అటు నుండి హోటల్ గదిలో ఉన్న రాజు గారిని వెంటపెట్టుకొని కంచికి బయలుదేరాము. కంచి లో శివ కంచి, విష్ణు కంచిలో ఉన్న దేవాలయాలకు శ్రీ స్వామి వారు మమ్మల్ని స్వయంగా తీసుకు వెళ్లి, అక్కడి స్థల మహత్యం గురించి వివరించి, అటు నుండి శ్రీ కంచి కామ కోటి పీఠానికి తీసుకువెళ్లారు. అక్కడ పూజ్యులు శ్రీ చంద్ర శేఖర సరస్వతి స్వామి వారిని నేను దర్శించుకున్నాను. వారు శ్రీ పూర్ణానంద స్వామి వారిని చూసి ఎంతో సంతోషించారు. వారిద్దరి మధ్య కొంత మౌన సంభాషణ కూడా జరిగింది. ఆ సమయం లో శ్రీ స్వామి వారు నా కంటికి దివ్య తేజో మూర్తి గా గోచరించారు. లా ఇద్దరు మహాత్ములను ఒకే చోట దర్శిచుకోవటం తో నాకు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగి, తన్మయత్వానికి లోనయ్యాను. ఇదంతా గమనించిన జయేంద్ర సరస్వతి స్వామి వారు పూర్ణానంద స్వామి వారి వివరములు నన్ను అడిగి తెలుసుకున్నారు. మేము అక్కడ నుండి బయల్దేరేలోగా, శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, మేము అక్కడే ఒక పూట ఉంటే బావుంటుంది అని అడిగారు. అందుకు శ్రీ పూర్ణానంద స్వామి వారు కూడా సమ్మతించి, ఒక పూట కంచి పీఠం లో ఉండి, అటు నుండి పరమ గురువులు, శ్రీ ఓంకారానంద స్వామి వారి జన్మస్థానమైన కలవైకి బయలుదేరాము. రాజు గారు కాంచి లో ఉన్న దేవాలయాలను చూసి ఒకింత తన్మయత్వానికి లోనయ్యారు. వారిని నెమ్మది గ అవన్నీ చూసుకొని కలవై కి రావలసింది గా స్వామి వారు వారికి చెప్పారు. కలవై అనే ఊరుకి సమీపం లో అగరం అనే ఒక చిన్న పల్లె లో, ఒక నిరుపేద కుటుంబం లో, శ్రీ ఓంకారానంద స్వామి వారు జన్మించారు. వారి పూర్వ నామధేయం ముని స్వామి. అతి చిన్న వయసులోనే వారు ఇంటి నుండి వెళ్లిపోయి, తపోబాటను ఎంచుకున్నారు. దక్షిణ దేశంతో పాటు, ఉత్తర భారత దేశం లో ఎన్నో క్షేత్రాలు, అరణ్యాలూ సంచరిస్తూ, తపస్సు గావించి, మహారాష్ట్ర లో గణేశపురిలో కొలువు తీరిన శ్రీ నిత్యానంద భగవాన్ ని వారి గురువుగా భావించుకున్నారు. శ్రీ నిత్యానంద భగవాన్, గణేశపురి సమీపంలో నింబోలి అనే ప్రాంతం లో వీరి కోసం ఒక ఆశ్రమం కూడా ఏర్పాటు చేసి, వీరికి శ్రీ ఓంకారానంద అని నామకరణం చేసారు. వీరెక్కడుంటే అక్కడ నిత్యాగ్నిని ఏర్పరుచుకుని, అందులో నుండి వచ్చిన విభూదిని శరీరం పై ధరించేవారు. అలా వారికి రాఖాడీ బాబా అనే పేరు వచ్చింది. రాఖాడీ అంటే మరాఠీలో విభూతి అని అర్ధం.


శ్రీ ఓంకారానంద స్వామి (రాఖాడీ బాబా)

 

********సశేషం********

471 views0 comments

コメント


bottom of page