top of page

|| యతో వాచో నివర్తంతే || - 12

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ

శ్రీ రాఖాడీబాబాగా పిలవబడే శ్రీ ఓంకారానంద స్వామి వారి గురించి శ్రీ స్వామి వారు ఎన్నో విషయాలు చెప్పారు. వారు సాక్షాత్తు శివ స్వరూపులని, ఏకాంతతను ఇష్టపడేవారని, జనం మధ్యలో ఉండటానికి వారు సుముఖంగా ఉండేవారు కారని, గుప్తంగా ఉత్తర భారత దేశంలో ఇప్పటికీ ఉన్నారని చెప్పారు. అటు వంటి ఒక గొప్ప మహాత్ముని జన్మస్థానానికి శ్రీ స్వామి వారితో కలిసి చేరుకున్నాను. అక్కడ బాబా వారి కుటుంబ సభ్యులని శ్రీ స్వామి వారు ఎంతో ఆత్మీయంగా పలకరించి, వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. రాఖాడీబాబా వారిది చాలా పేద కుటుంబం. రోజూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ వారి మనుగడ సాగించుకుంటారు. స్వామి వారు బాబా వారి ఇంటి సమీపం లో ఒక మండపం వద్దకు తీసుకువెళ్లారు. ఆ మండపం లో ఒక శివ లింగం ప్రతిష్ట చేసి ఉంది. ఆ మండపం దుమ్ము కొట్టుకుపోయి ఉండటం చూసి, స్వామి వారు చింతించి, ఆ మండపం వెనుక కథను నాతో చెప్పారు.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)

 

శ్రీ పూర్ణానంద స్వామి వారు 1965వ సంవత్సరం లో శ్రీ రాఖాడీబాబా వారిని కలుసుకున్నారు. బాణతీర్థ జలపాత సమీపంలో ఉన్న వరుణ గుహలో స్వామి వారు 26 రోజులు పాటు నిద్రాహారాలు మానేసి కఠోర తపస్సు చేసారు. ఆ తపస్సు వరుణ గుహకు, శ్రీ రాఖాడీబాబా వారి ఆగమనానికి ఆహ్వానం పలికింది. అలా 1965 నుండి 1968 మధ్యలో శ్రీ రాఖాడీబాబా గారితో కలిసి, శ్రీ స్వామి వారు దక్షిణ భారత దేశంలో సంచరించారు. అందులో భాగంగా, ఒక రోజు వారిద్దరూ కలవైకి చేరుకున్నారు. రాఖాడీబాబా వారు, వారి కుటుంబ సభ్యులను శ్రీ స్వామి వారికి పరిచయం చేసి, అక్కడ ఉండేవారికి పగలంతా పంటపొలాలలో కష్టపడి పని చేయటమే సరిపోతుందని, సాయంత్రం ఇంటికి చేరాక, కొంతైనా దైవ చింతన ఉంటే బావుంటుంది అని, అందుకోసం అక్కడ ఒక చిన్న మండపంలా ఏదైనా ఏర్పాటు చేయాలనీ, శ్రీ స్వామి వారితో అన్నారు. శ్రీ స్వామి వారు, వారి గురు సంకల్పాన్ని నెరవేర్చేందుకు, అక్కడ మండపం నిర్మాణానికి అవసరమైన డబ్బులు ఏర్పరిచే బాధ్యత తీసుకున్నారు. డబ్బులు సమీకరించే పనిలో కలవై నుండి బయలుదేరి వెళ్ళిన శ్రీ స్వామి వారికీ, వారు వెళ్ళిన ప్రతి ఊరిలో, శ్రీ స్వామి వారి రూపానికి మంత్ర ముగ్దులై, ఎందరో డబ్బులు, కానుకలు సమర్పించుకున్నారు. మండపం నిర్మాణానికి అవసరమైన డబ్బులు సమకూరాక, శ్రీ స్వామి వారు కలవైకి తిరిగి చేరుకున్నారు. శ్రీ స్వామి వారు వెనక్కి తిరిగొచ్చేలోపల, బాబా వారు కలవై లోనే ఉంటూ, ఒక నిత్యాగ్నిని వెలిగించి, అందులో నుండి వచ్చిన విభూతితో ఒక శివ లింగాన్ని తయారు చేసారు. మండప నిర్మాణాంతరం, ఆ శివ లింగాన్ని, బాబా వారు, శ్రీ స్వామి వారు కలిసి స్వయంగా ఆ మండపం లో ప్రతిష్టించారు. ఇద్దరు సిద్ధపురుషులు కలిసి ఏక కాలం లో ప్రాణ ప్రతిష్ట చేసిన ఆ శివ లింగం ఎంతో అరుదైనది, అపురూపమైనది.

అటువంటి మండపం అలా దుమ్ముకొట్టుకుపోవటం చూసి, స్వామివారు నాతో, “ఇది రాఖాడీబాబా వారి సంకల్పంతో నిర్మించబడింది, దీన్ని శుభ్రం చేసి, దీపారాధన చేస్తే, మనకు వారి అనుగ్రహం లభిస్తుంది” అన్నారు. మండపాన్ని శుభ్రపరిచే పనిలో స్వామి వారు, నేను కలవైలో మూడు రోజుల పాటు ఉన్నాము. స్వామివారు సమీపం లో ఒక సుబ్రమణ్య స్వామి వారి దేవాలయం లో నివాసమున్నారు. ఆ మండపం శుభ్రపరిచి, సున్నం కొట్టడం మొదలు పెట్టాక, బాబా వారి కుటుంబ సభ్యులు కూడా నాతో పాటు పని చేయటానికి ముందుకొచ్చారు. మూడోవ రోజు, మొత్తం పని పూర్తయ్యాక, స్వామి వారు మండపంలో శివలింగం వద్ద దీపారాధన చేశారు. శివలింగానికి నమస్కారం చేసుకొని బయటకి వచ్చేటప్పుడు,స్వామి వారి తలకి ఏదో తగలటంతో, వారు పైకి చూసారు. అక్కడ చూరులో భద్రపరిచి ఉన్న ఒక కాగితం పొట్లాన్ని తీసారు. ఆ పొట్లం తెరిచి చూసి, వారి కళ్ళు చెమ్మగిల్లాయి, వారు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు, శ్రీ స్వామి వారిని అలా చూడటం నాకు అదే మొదటిసారి. అందులో తోలు పట్టీలతో ఉన్న చెక్క పావుకోళ్ళు(పాదుకలు) ఉన్నాయి. శ్రీ స్వామి వారు వాటిని నాకు చూపించి,


”ఇవి రాఖాడీబాబా వారి పాదుకలు. ఇంతకు మునుపు వారు కలవై వచ్చినప్పుడు, వాటిని ఇక్కడ విడిచి వెళ్లారు. ఇవాళ మనకి వారి అనుగ్రహం ఈ రూపం లో లభించింది.గురుభావం మా దగ్గెర ఉంటుంది, పాదుకలు నీ దగ్గెర పెట్టు.”

, అని బాబా వారి పాదుకలు నా చేతిలో పెట్టారు.

శ్రీ స్వామి వారికి, వారి గురువుగారి పట్ల గల భావం చూసి నేనెంతో భావోద్వేగానికి లోనయ్యాను. గురుపాదుకలకుండే విశిష్టత, గొప్పతనం ఏంటో ఆ రోజు స్వామి వారి వల్లనే తెలుసుకోకలిగాను. కలవై లో ఆ రోజు రాఖాడీబాబా, శ్రీ పూర్ణానంద స్వామి వార్ల అనుగ్రహం వల్ల మనకు లభించిన బాబా వారి పాదుకలే, ఇవాళ గురు పాదుకా క్షేత్రంగా పిలవబడే, మన ఆశ్రమంలో, బాబా హాలులో కొలువు తీరాయి. అటువంటి గురుపాదుకలను ఎల్లప్పుడూ మనసు లో భావించుకున్న వారు, అలవోకగా అనంత సంసార సాగరాన్ని దాటకలుగుతారు.


|| ప్రాతరే వహి మానసాంతర్, భావయేత్ గురు పాదుకాం ||కళావైలో బాబావారు స్వామి వారు కలిసి నిర్మించిన మండపం

శ్రీ స్వామి వారు, బాబా వారు ప్రతిష్టించిన శివ లింగం

 

********సశేషం********476 views0 comments

댓글


bottom of page