top of page
Writer's pictureSriswamypoornananda.org

|| యతో వాచో నివర్తంతే || - 13

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


శ్రీ రాఖాడీ బాబా, పూర్ణానంద స్వామి వారి అనుగ్రహం తో, రాఖాడీ బాబా వారి పాదుకలు తీసుకొని, కలవై నుండి పంచభూత లింగాలలో, అగ్ని లింగం కొలువు తీరిన అరుణాచలంకి పయనమయ్యాము. బాబా వారి పాదుకలు లభించిన తరువాత, రాజు గారు కంచి నుండి కలవై కి చేరుకున్నారు. రాఖాడీ బాబా వారు పాదుకల రూపం లో అనుగ్రహం ఎలా ఇచ్చారో రాజు గారికి వివరించగా, వారు కూడా ఎంతో సంతోష పడ్డారు.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)

 

అరుణాచలంకి మేము కార్తీక మాసం లో వెళ్ళటం వలన, అక్కడ ఇసకేస్తే రాలనంత జనం ఉన్నారు.ఉండటానికి కూడా వసతిగా లేదు.శ్రీ స్వామి వారు మమ్మల్ని అక్కడ శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమానికి తీసుకు వెళ్లారు. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం సమీపం లో శేషాద్రి స్వామి వారి ఆశ్రమం ఉంటుంది. శ్రీ శేషాద్రి స్వామి వారు 1929 లో సమాధి అయ్యారు. వారి అధిష్టానానికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు, శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది.అక్కడ నిత్య పూజలు చేసే పూజారి, స్వామి వారి రాకతో ఎంతో ఆనంద పడ్డారు. శ్రీ శేషాద్రి స్వామి వారి అధిష్టాన మందిరానికి సమీపంలో ఒక గది లో ఈ పూజారి నివాసం ఉన్నారు. శ్రీ స్వామి వారిని, వారి గది లో ఉండవలసిందిగా ఆ పూజారి కోరారు. అందుకు స్వామి వారు కూడా సమ్మతించారు. అయితే ఆ పూజారి కొంత అస్వస్థతగా ఉన్నారని తెలుసుకున్న స్వామి వారు, వారిని విశ్రాంతి తీసుకోమని చెప్పి, అధిష్టాన మందిరం వద్ద నన్ను పూజారిగా ఉండమని చెప్పారు. అలా మూడు రోజులు పాటు శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆజ్ఞ తో శ్రీ శేషాద్రి స్వామి వద్ద వారి ఒక పూజారి గా సేవలందించే అవకాశం నాకు లభించింది.ఈ మూడు రోజులు శ్రీ స్వామి వారు ఆ పూజారికి ఎన్నో సపరియాలు చేశారు.ఆ పూజారి కోలుకున్నాక, మేము శ్రీ స్వామి వారితో కలిసి అరుణాచల గిరి ప్రదక్షిణం చేసాము. గిరి ప్రదక్షిణం లో భాగం గా, అక్కడున్న దేవాలయాలన్నీ సందర్శించాము.మేము వెళ్ళిన ప్రతి దేవాలయంలో శ్రీ స్వామి వారిని ఎంతో గౌరవ మర్యాదలతో స్వాగతించారు. కొన్ని చోట్ల స్వామి వారికి పూల మాలలు వేసి, హారతులిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా శ్రీ స్వామి వారి వైభవాన్ని చూసి మాకు ఎంతో సంతోషమేసింది.మేము అక్కడ సందర్శించిన దేవాలయాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి శ్రీ అబితకుచలాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి సన్నిధానం, శ్రీ రమణాశ్రమం. అరుణాచలంలో శ్రీ స్వామి వారి అనుగ్రహంతో ఎన్నో గొప్ప అనుభూతులు పొంది, అటు నుండి అరుణాచలానికి సమీపంలో ఉన్న తపోవనం అనే ఒక ఆశ్రమానికి శ్రీ స్వామి వారు మమ్మల్ని తీసుకు వెళ్లారు.


శ్రీ శేషాద్రి స్వామి, అరుణాచలం

తపోవనంలో అప్పట్లో ఒక గొప్ప సిద్ధ పురుషులు కొలువుతీరారు. వారి పేరు శ్రీ జ్ఞానానంద గిరి స్వామి. వారు మూడు వందల సంవత్సరాలు పైబడిన వారిని శ్రీ స్వామి వారు మాతో స్వయంగా చెప్పారు. శ్రీ ఆది శంకరాచార్యులు వారు స్థాపించిన పీఠాలలో ఒకటైన జ్యోషిర్మఠ్ కి వీరు కొంత కాలం పీఠాధిపత్యం వహించి,అటు నుండి దేశమంతా సంచరిస్తూ, తపోవనం లో స్థిరపడ్డారు. 1965వ సంవత్సరం నుండి 1968 సంవత్సరం మధ్యలో శ్రీ రాఖాడీ బాబా వారితో, కొన్ని సందర్భాల్లో ఒక్కరే, శ్రీ పూర్ణానంద స్వామి వారు దక్షిణ భారత దేశంలో సంచరించారు. ఒకానొక పర్వదినమున స్వామివారు ఒక్కరే తపోవనంకి చేరుకున్నారు. ఆ ఊరిలో బిక్షాటనకై వెళ్లిన శ్రీ స్వామి వారిని, ఒక ఇల్లాలు అజ్ఞానంతో కసురుకున్నారు.అంతే కాక, ఆ రోజు ఆ ఊరిలో జనం శ్రీ స్వామి వారి గురించి తెలియక, ఎవరూ బిక్ష ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. పర్వదినం కావుటవలన, శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారి దర్శనార్ధం ఆ ఊరి జనమంతా, వారి ఆశ్రమం బయట బారులు తీరారు. స్వామి వారు కూడా జ్ఞానానందగిరి స్వామి వారి ఆశ్రమ సమీపానికి చేరగా, శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారు, ఒక్కసారిగా వారి సింహాసనం నుండి లేచి,

శ్రీ శైలం, ఓం, ఆనందం, పూర్ణానందం, పొదిగమలై జ్యోతి,

అని అంటూ గంభీరంగా శ్రీ స్వామి వారిని స్వాగతిస్తూ, ఆశ్రమంలో నుండి బైటికి వచ్చారు.శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారి శిష్యులు, భక్తులు, ఊరిలో జనం, ఆ సన్నివేశం చూసి ఎంతో నివ్వెర పోయారు.ఎందుకంటే, శ్రీ జ్ఞానానందగిరి స్వామి వారు అలా ఎవరినీ, ఏ రోజు స్వాగతించటం వారు చూడలేదు. శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారు, పూర్ణానంద స్వామి వారిని ఎంతో ఆప్యాయంగా ఆశ్రమం లోనికి స్వయంగా ఆహ్వానించి, తీసుకువెళ్లారు.అక్కడ శ్రీ స్వామి వారి కోసం ప్రత్యేకంగా ఒక గది, భోజనం ఏర్పాట్లు చేసి,శ్రీ స్వామి వారిని కొంతసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత, అక్కడికొచ్చిన భక్తులకు, ఊరిలో జనాలకు శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం చేసుకోవాల్సిందిగా శ్రీ జ్ఞానానందగిరి స్వామి వారు చెప్పి, వారందరినీ శ్రీ స్వామి వారి వద్దకు పంపారు. ఆ ఉదయం, స్వామి వారిని కసురుకున్న ఇల్లాలు, మరి కొంత మంది ఊర్లో జనం, వారి తప్పును తెలుసుకొని, వారి అజ్ఞానాన్ని మన్నించవలసిందిగా శ్రీ స్వామి వారిని వేడుకున్నారు. శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారు, శ్రీ పూర్ణానంద స్వామి వారిని తపోవనంలో వారివద్దనే ఉండమని అడిగారు. శ్రీ రాఖాడీ బాబా వారి ఆదేశం మేరకే సంచారానికి రావటం జరిగింది అని,అది పూర్తి చేసుకొని, మరల బాబా వారి వద్దకు వెళ్లాలని చెప్పి, స్వామి వారు అక్కడి నుండి బయలుదేరి వచ్చేసారు. ఈ వృత్తాంతం శ్రీ స్వామివారే స్వయంగా మాతో చెప్పారు. ఆ తరువాత మళ్ళి 1969లో శ్రీ స్వామి వారు, నన్ను, రాజుగారిని వెంటపెట్టుకొని తపోవనంకి చేరుకున్నారు.ఈ సారి కూడా అక్కడ ఆశ్రమమంతా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. మేము ఆశ్రమ సమీపానికి చేరేసరికి, శ్రీ జ్ఞానానందగిరి స్వామి వారి సేవకులైన బాలు గారు మా కోసం అక్కడ ఎదురుచూస్తూ ఉన్నారు.మా రాక గురించి జ్ఞానానందగిరి స్వామి వారు ముందే వారితో చెప్పారని, స్వామి వారిని వెంటపెట్టుకొని ఆశ్రమం లోపలకి తీసుకురమ్మన్నారని చెప్పి, స్వామి వారిని, నన్ను, రాజుగారిని వారి ఆశ్రమం లోపలకు తీసుకువెళ్లారు. శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారు, శ్రీ పూర్ణానంద స్వామి వారిని చూసి, శ్రీశైలం, ఓం, ఆనందం, పూర్ణానందం, పొదిగమలై జ్యోతి అంటూ గంభీరమైన కంఠంతో శ్రీ స్వామి వారిని ఆహ్వానించారు.స్వామి వారు జ్ఞానానంద గిరి స్వామి వారి సమీపానికి వెళ్ళాక, వారు, గురువారం, గురువారం, గురుసన్నిధి అన్నారు. వారు ఏమన్నారో నాకు, రాజుగారికి అసలు అర్ధం కాలేదు. దానికర్ధం, మేము గురువారం వరకు వారి ఆశ్రమం లో నే ఉండమని అడుగుతున్నారని శ్రీ స్వామి వారు మాతో అన్నారు. అలా శ్రీ జ్ఞానానందగిరి స్వామి వారి ఆశ్రమంలో మాకు ఒక గది ఏర్పాటు చేసారు. ఉదయం నుండి సాయంత్రం వరకు, ఆశ్రమంలో గడిపి, సూర్యాస్తమయం అయ్యాక, ఎవరికీ తెలియకుండా స్వామి వారు నన్ను ఆశ్రమంలో నుండి బయటకు తీసుకువెళ్లారు. దగ్గరలో ఒక నది తీరానికి వెళ్లి, అక్కడ స్నానం చేసి, దూరంగా ఒక కొండపైకి స్వామివారు,నేను వెళ్ళాము. నిండు చంద్రుడు,పండు వెన్నెల, మంచి కొండగాలి మద్య, శ్రీ స్వామి వారితో గడిపిన ఆ సమయం వెలకట్టలేనిది.వారు రాత్రంతా ఎన్నో విషయాలు నాతో చెప్పారు. వారు చెప్పే విషయాలు అర్ధం చేసుకునే స్థితి నాకు లేకపోయినా,వారు చెప్పే విషయాలు వింటుంటే ఎదో ఆనంద లోకంలో ఉన్న అనుభూతి కలిగింది. రాత్రంతా కొండపై గడిపి, మళ్ళీ సూర్యోదయం అవ్వక ముందే తిరిగి ఆశ్రమానికి వచ్చేసాము. ఈ విధంగా నాలుగు రోజులు, శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారి ఆశ్రమంలో గడిపాక, గురువారం రోజున వారి ఆశ్రమం నుండి బయలుదేరాము.


శ్రీ జ్ఞానానంద గిరి స్వామి
 

********సశేషం********

445 views0 comments

Commentaires


bottom of page