top of page

|| యతో వాచో నివర్తంతే || - 14

Writer: Sriswamypoornananda.orgSriswamypoornananda.org

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


తపోవనం లో గురువారం శ్రీ స్వామి వారితో కలిసి బయలుదేరిన మేము, అటు నుండి అరుణాచలానికి సమీపంలో పూండి అనే చిన్న ఊరికి వెళ్ళాము.పూండి లో అప్పట్లో ఒక మహాత్ములు కొలువు తీరారు.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)

 

వారి పేరు, ఇతర వివరాలు ఎవరికీ తెలియవు. వారిని అందరు పూండి స్వామి అని పిలిచేవారు. 1962వ సంవత్సరం దాక ఎన్నో ప్రాంతాలలో సంచరించిన శ్రీ పూండి స్వామి వారు, 1962 లో పూండి కి వచ్చి, ఒక ఇంటి ముందు గట్టు మీద కుర్చుని సమాధి స్థితిలో కి వెళ్లారు. వారికి ఆకలి, దప్పికలు, దేహ చింత, నిద్ర వంటివి ఉండేవి కావు.వారి భక్తులు వారికి ఏమైనా తినిపిస్తే తినేవారు, కూర్చో పెడితే కూర్చునే వారు, ఎవరైనా వారితో సంభాషణ చేస్తే తప్ప, వారంతట వారుగా ఎవరితో మాట్లాడేవారు కూడా కాదు. అటు వంటి ఒక గొప్ప మహాత్ముల వద్దకు శ్రీ స్వామి వారు మమ్మల్ని తీసుకువెళ్లారు. శ్రీ పూర్ణానంద స్వామి వారు, శ్రీ పూండి స్వామి వారి సమీపానికి చేరగానే, శ్రీ పూండి స్వామి వారు, కళ్ళు తెరిచి శ్రీ స్వామి వారిని చూశారు.వారిద్దరి మధ్య కొంత మౌన సంభాషణ జరిగింది. కొంత సమయం అక్కడ గడిపాక, పూండి నుండి బయలుదేరి అరుణాచలానికి చేరుకున్నాము.


శ్రీ పూండి స్వామి

అరుణాచలం నుండి మా ప్రయాణం ముందుకు సాగించటానికి కావలసినంత డబ్బులు ఇంకా సమకూరలేదు.ఇక్కడి నుండి ప్రయాణం ముందుకు ఎలా సాగుతుంది? ఇప్పుడు శ్రీ స్వామి వారు ఏం చేయబోతున్నారు? అనే ఆలోచనలో పడ్డాను. ఇంతలో తిరుచ్చి లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేసే వారొకరు శ్రీ స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది. కార్తీక మాసం అవ్వటం చేత, వారు అరుణాచలానికి సందర్శనార్థం వచ్చారు.వారు శ్రీ స్వామి వారి వివరాలు అడిగి తెలుసుకొని, వారితో పాటు తిరుచ్చిలో వారి ఇంటికి రావలసిందిగా శ్రీ స్వామి వారిని కోరారు. అంతే కాకుండ తిరుచ్చి వరుకు మా ముగ్గురి ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు వారే చూసుకుంటామని స్వామి వారి తో అన్నారు.అలా ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మా ముగ్గురి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు అన్ని చేసి, వారితో పాటు తిరుచ్చికి తీసుకువెళ్లారు. మన భారత దేశం లో ఉన్న ఎన్నో గొప్ప క్షేత్రాలలో, ఎంతో విశిష్టత, ప్రాచుర్యం, పురాతనమైన దేవాలయాలు ఎక్కువగా తమిళనాడు లో ఉన్నాయి. అటువంటి గొప్ప క్షేత్రాలలో, తిరుచ్చికి సమీపంలో ఉన్న శ్రీరంగంలో, ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఒకటి, తిరుచ్చిలో కొండపై ఉన్న మలైకోట వినాయకుడి గుడి మరొకటి. డబ్బులు లేకుండా ప్రయాణం ముందుకి ఎలా సాగుతుంది, అని మేము ఆలోచనలో పడ్డ తరుణం లో, శ్రీ స్వామి వారి అనుగ్రహం వలన, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వారి ఖర్చులతో మమ్మల్ని తిరుచ్చి తీసుకువెళ్ళి, వారి ఇంట్లో నే మాకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి శ్రీ స్వామి వారు మమ్మల్ని మొదటిగా శ్రీ మలైకోట వినాయకుడి గుడి కి తీసుకువెళ్లారు. కొండ మీద ఉన్న ఈ వినాయకుడి గుడికి గొప్ప చరిత్ర ఉంది .అదే కాకుండా శ్రీ స్వామి వారి బాల్యంలో జరిగిన ఒక సంఘటన ఈ గుడి తోనే ముడి పడి ఉంది. ఆ సంఘటన శ్రీ స్వామి వారు మాకు స్వయంగా చెప్పారు. శ్రీ పూర్ణానంద స్వామి వారికి, వారి తండ్రి గారైన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు ప్రథమ గురువులు. జ్ఞానకోవిదులైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శ్రీ స్వామి వారికి పసి వయసు నుండే ఆధ్యాత్మిక బాట వేసారు.జనన మరణాలకు అతీతంగా ఉండేవాడే అసలైన తండ్రి అని, ఆ తండ్రినే మనమందరం చేరుకోవాలని, శ్రీ స్వామి వారికి బాల్యంలోనే జ్ఞానబోధ చేసారు. శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు, శ్రీ స్వామి వారికి ముఖ్యమైన మంత్రోపదేశాలన్ని కార్తీక పౌర్ణమి రోజే చేశారు. అలా 1949వ సంవత్సరం, కార్తీక పౌర్ణమి రోజున, శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు, శ్రీ స్వామి వారికి గణపతి ఉపదేశం చేశారు. అప్పుడు శ్రీ స్వామి వారి వయసు 10 సంవత్సరాలు. అలా గణపతి సాధన చేస్తున్న సమయంలో శ్రీ స్వామి వారు, కనిపించే ప్రతి ప్రాణి, వస్తువుతో పాటు వారిని కూడా వారు గణపతిగా భావించుకున్నారు.ఆ భావ సాధనతో వారి ప్రపంచమంతా గణపతిమయం అయ్యింది.(శ్రీ పూర్ణానంద స్వామి వారి గురువులైన శ్రీ ఓంకారానంద స్వామి వారికి, శృంగేరి లో వారి ప్రథమ గురువులు ఇదే విధముగా భావ సాధనను ఉపదేశించారని, శ్రీ స్వామి వారు ఎన్నో సందర్భాలలో అన్నారు.) అటువంటి ఒక అతీతమైన స్థితిలో శ్రీ స్వామి వారు 10 సంవత్సరాల వయసులోనే, ఇంటి నుండి వెళ్లిపోయి, మలైకోట వినాయకుడి గుడికి చేరుకున్నారు. నిద్రాహారాలు మరిచిన శ్రీ స్వామివారు, అక్కడ ఒక మండపంలో అంతర్ముఖులై కూర్చుకొని ఉన్నారు. ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బాలుడ్ని చూసి, ఆ దేవాలయానికి వచ్చిన భక్తులందరు,వీరి వద్దనే నిలిచిపోయారు.ఆ భక్తులలో శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారికి సుపరిచితులైన వారొకరు, శ్రీ స్వామి వారిని గుర్తుపట్టి, సాత్తూర్లో శ్రీ స్వామి వారి ఇంటికి వారిని చేర్చి, శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారికి, జరిగినదంతా వివరించారు. అతి చిన్న వయసులోనే అటువంటి ఒక గొప్ప స్థితికి చేరుకున్న శ్రీ స్వామివారితో, శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు, రానున్న కాలంలో, అందరికి, అన్నిటికి దూరంగా వెళ్లి, తపస్సు చేసుకునే రోజు వస్తుందని, అప్పటిదాకా శ్రీ స్వామి వారు కుటుంబంతోనే ఉంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు. అలా, తండ్రి మాటకి కట్టుబడి, శ్రీ స్వామి వారు, వారి కుటుంబ బాధ్యతలు చిన్న వయసులోనే స్వీకరించారు. అటువంటి ఒక గొప్ప సంఘటన జరిగిన ఈ మలైకోట వినాయకుడి దేవాలయాన్ని శ్రీ స్వామి వారితో సందర్శించి, మరుసటి రోజున, అటు నుండి తిరుచికి సమీపం లో ఉన్న శ్రీరంగంకి వెళ్ళాము.


 

********సశేషం********

Comments


               Sri Swamy Poornananda Ashram

                          P-4, Contractors Colony, Srisailam Dam East,

                      Kurnool District-518 102.  Phone :  9494561339

Picture1.png
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page