top of page

|| యతో వాచో నివర్తంతే || - 15

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ

శ్రీ పూర్ణానంద స్వామి వారి అనుగ్రహంతో తమిళనాడు యాత్రలో, ఎన్నో గొప్ప క్షేత్రాలు సందర్శించటంతో పాటు, ఎందరో మహానుభావులను దర్శించుకోవటం జరిగింది. మేము వెళ్ళిన ప్రతి క్షేత్రం, పీఠం, ఆశ్రమంలో శ్రీ స్వామి వారిని అసాధారణమైన గౌరవ మర్యాదలతో స్వాగతించటం, శ్రీ స్వామి వారి యొక్క స్థితికి నిదర్శనం. సాక్షాత్తు ఈ సృష్టిని నడిపించే పరమాత్ముడు ఒక కౌపీనధారిగా, మాతోనే ఉంటూ, మాకెటువంటి లోటు తెలియకుండా, మా బాగోగులు చూసుకుంటూ, వారి చరిత్రను కళ్ళకు కట్టినట్టు మాకు చూపిస్తూనే, మా ప్రశ్నలకు, వాదనలకు వారు ఎంతో ఓపికతో మా స్ధాయికి దిగి, అనుభవరూపం లో జ్ఞానబోధ చేసారు. శ్రీ పూర్ణానంద స్వామి వారి స్థితిని గ్రహించిన ఎందరో మహాత్ములు, యోగులు, సిద్ధ పురుషులు శ్రీ స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూశారు. అటువంటి వారెందరో, వారి ఆశ్రమంలోనే శ్రీ స్వామి వారు ఉంటే బావుంటుందని శ్రీ స్వామి వారికి విన్నవించుకున్నారు. అటు వంటి ఎన్నో సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూసాను. కానీ శ్రీ స్వామి వారు అటువంటి విన్నపాలన్నిటిని సున్నితంగా తిరస్కరించి, అటు వంటి వైభవాలకి దూరంగా,ఎంతో నిరాడంబరంగా, సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)

 

ఇటువంటి పూర్ణపురుషులు ఈ భూమి మీద అవతరించేందుకు ఒక మహా యజ్ఞమే జరిగింది. మధురై లో నివాసం ఉంటున్న పుణ్య దంపతులు, జ్ఞానులైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పర్వతవర్ధిని గారు ఒక కారణ జన్ముని కోసం కామేశ్వర కామేశ్వరి మహాయజ్ఞం చేశారు. ఒక సంవత్సరం పాటు సాగిన ఈ యాగం ఎంతో కష్టతరమైనది, ఖర్చుతో కూడుకున్నది. ఈ యాగం శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారి గురువులైన శ్రీ నీలకంఠ దీక్షితులువారు, పర్వతవర్ధిని గారి తండ్రిగారైన త్రికాలజ్ఞాని శ్రీ భారతీ స్వామి వారి ఆర్ధ్వర్యం లో జరిగింది. ఇటువంటి యాగం ఒకటి జరుగుతుందని తెలుసుకొని దేశం నలుమూలలనుండి ఎందరో మహానుభావులు ఈ యాగం చూసేందుకు మధురైకి తరలి వచ్చారు. అలా పుత్రకామేష్టి యాగం ఫలించి, ఎందరో మహానుభావులు, మహాత్ములు సంకల్పం నెరవేరి, 1939, నవంబర్ 1వ తేదీన ఈ భూమి మీద ఒక పూర్ణపురుషులు అవతరించారు. వారే శ్రీ పూర్ణానంద స్వామి వారు. వారి పూర్వ నామధేయం శ్రీ కామేశ్వరన్.

శ్రీ స్వామి వారు మధురై లో 7 కడల్ వీధి లో జన్మించారు. శ్రీ స్వామి వారి తాతగారైన భారతి స్వామి వారు పీఠాధిపత్యం వహించిన బ్రహ్మానంద స్వామి వారి మఠం కూడా మధురైలోనే ఉంది. శ్రీ భారతీ స్వామి వారిది ఒక అద్భుతమైన చరిత్ర. వారి పూర్వ నామధేయం శ్రీ శంకర్ నారాయణన్. వారు శ్రీవిల్లిపుత్తూర్ లో జన్మించారు. చిన్న వయసులోనే వీరు మధురై లో శ్రీ బ్రహ్మానంద స్వామి వారి సన్నిధికి చేరారు. శ్రీ బ్రహ్మానంద స్వామి వారిని గురువుగా భావించుకున్న శ్రీ భారతీ స్వామి వారు, అదే మఠం లో వంటశాల లో ఎన్నో సంవత్సరాలు సేవ చేసుకున్నారు. శ్రీ భారతీ స్వామి వారి వివాహం కూడా శ్రీ బ్రహ్మానంద స్వామి వారే స్వయంగా చేసి, ఈ వివాహం వలన లోకకల్యాణం జరగబోతుంది అని చెప్పారు. గురుసేవ తప్ప మరో ప్రపంచం తెలియని భారతి స్వామి వారిని, శ్రీ బ్రహ్మానంద స్వామి వారు, వారి తదనంతరం పీఠాన్ని అధిష్టించవలసిందిగా ఆదేశించారు. రాత్రికి రాత్రే శ్రీ బ్రహ్మానంద స్వామి వారు, వారి జ్ఞానాన్ని, శక్తులని యన దీక్ష అనే యోగ ప్రక్రియ ద్వారా శ్రీ భారతి స్వామి వారికి ధారపోశారు. శ్రీ బ్రహ్మానంద స్వామి వారు బ్రహ్మైక్యం పొందాక, ఆ మఠం లో ఉన్న ఎందరో పండితులు, శ్రీ భారతీ స్వామి వారి అర్హతపై ఎన్నో అనుమానాలు పెట్టుకున్నారు. శ్రీ భారతీ స్వామి వారి అర్హత, పాండిత్యాలను ప్రశ్నిస్తూ, కొన్ని రోజుల పాటు దేశ నలుమూలల నుండి ఎందరో వేద పండితులు శ్రీ భారతీ స్వామి వారితో చర్చాగోష్టిలో పాలుపంచుకున్నారు. శ్రీ భారతీ స్వామి వారి పాండిత్యాన్ని, జ్ఞానాన్ని చూసి వారందరు నివ్వెరపోయారు. శ్రీ భారతీ స్వామి వారు ఒక త్రికాల జ్ఞానీ అని, శ్రీ బ్రహ్మానంద స్వామి గారి తదనంతరం ఆ పీఠాన్ని అధిష్టించేందుకు కావలసిన అన్ని అర్హతలు శ్రీ భారతీ స్వామి వారికే ఉన్నాయని వారందరు గ్రహించి, వారి అజ్ఞానాన్ని మన్నించమని శ్రీ భారతి స్వామి వారిని వేడుకున్నారు.

శ్రీరంగం లో శ్రీరంగనాథస్వామి దేవాలయ సందర్శనం పూర్తి చేసుకున్న తరువాత, శ్రీ స్వామి వారు నన్ను, రాజు గారిని మధురై కి తీసుకు వెళ్లారు. 7 కడల్ వీధిలో శ్రీ స్వామి వారు జన్మించిన వారి ఇంటికి, బ్రహ్మానంద స్వామి వారి మఠానికి శ్రీ స్వామి వారే స్వయంగా మమ్మల్ని తీసుకువెళ్లారు. శ్రీ స్వామి వారు మనకు చెప్పే ప్రతి విషయం మనకు కళ్ళకు కట్టినట్టు గా కనిపిస్తుంది. శ్రీ కామేశ్వర, కామేశ్వరి మహా యజ్ఞం గురించి, భారతి స్వామి వారి కథ మాతో చెప్తుంటే ఆ విషయాలన్నీ అప్పుడే, మా ముందే జరిగిన భావం మాకు కలిగింది. మధురై మీనాక్షి అమ్మ వారి దేవాలయ విశిష్టత గురించి శ్రీ స్వామి వారు మాతో చెప్పి, దేవాలయం అంత మాకు దగ్గరుండి చూపించారు. లా మధురై లో ఎన్నో గొప్ప అనుభూతులు పొంది, అటు నుండి సాత్తూర్ కి బయలుదేరాము. శ్రీ స్వామి వారి బాల్యం మధురై కి సమీపం లో ఉన్న సాత్తూర్ అనే చిన్న ఊరిలో గడిచింది.


శ్రీ స్వామి వారు సాత్తూర్ లో చదువుకున్న పాఠశాలకి శ్రీ స్వామి వారు మమ్మల్ని తీసుకువెళ్లి చూపించారు. శ్రీ స్వామి వారి తల్లి, గురుమాతా పర్వతవర్ధని గారు అదే ఊరిలో ఉంటున్నట్టు శ్రీ స్వామి వారు మాకు చెప్పారు. వారిని కూడా దర్శించుకుందామని శ్రీ స్వామి వారిని అడగగా, శ్రీ స్వామి వారు, వారి ఇంటి చిరునామా, ఇతర వివరాలు నాకు ఇచ్చి, నన్ను వెళ్లి చూసి రమ్మని చెప్పి, వారు రైల్వే స్టేషన్ కి వెళ్లిపోయారు. శ్రీ స్వామి వారు ఇచ్చిన చిరునామా ని ఆధారం చేసుకొని వెళ్లగా, అక్కడ శ్రీ స్వామి వారి అన్న గారైన శ్రీ శంకర్ నారాయణ గారు నివాసం ఉంటున్నారు. నన్ను శ్రీ స్వామి వారు పంపించారని, గురుమాతా దర్శనం కోసం వచ్చానని వారితో చెప్పాను. వారు నన్ను గురు మాత వద్దకు తీసుకువెళ్లారు.

గురుమాత పర్వతవర్ధని గారి గురించి శ్రీ స్వామి వారు ఎన్నో సందర్భాలలో మాతో చెప్పారు. శ్రీ స్వామి వారికి చిన్నప్పుడు జోలపాటగా దుర్గా సప్తశతి శ్లోకాలు పాడేవారని, అన్ని వేళల, అన్ని అవస్థలలో వారు సప్తశతి పారాయణం చేస్తూనే ఉంటారని, ఎంతో అలవోకగా, పామరులకు కూడా అర్థమయ్యే విధముగా గురుమాత ఆధ్యాత్మిక సారాన్ని వివరించగలరని శ్రీ స్వామి చెప్పారు.


గురుమాత పర్వతవర్ధని (మాతాజీ)

అటువంటి ఒక గొప్ప స్థితి లో ఉన్న గురుమాతని శ్రీ స్వామి వారి అనుగ్రహంతో దర్శించుకున్నాను. కానీ వారి ఆరోగ్య పరిస్థితి బాలేకపోవటం నాకెంతో బాధను కలిగించింది. వారి కంటి చూపు పూర్తిగా క్షీణించింది. వారికి నమస్కారం చేసుకొని, శంకర్ నారాయణ గారికి, మళ్ళీ వస్తానని చెప్పి, అక్కడి నుండి బయలుదేరాను. కొంత ఆలోచన చేసాక, నా స్నెహితుడు, స్వామివారి ముఖ్యమైన శిష్యులలో ఒకరైన, శ్రీ కే బీ వీ జీ కృష్ణమూర్తి గారిని అప్పటికప్పుడు ట్రంక్ కాల్ ద్వారా సంప్రదించి, గురుమాత గురించి వివరించి, వారిని శ్రీశైలం తీసుకొద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. తప్పని సరిగా గురుమాతను తీసుకురావాలని, శ్రీ స్వామి వారిని ఎలా అయినా అందుకు ఒప్పించమని కే బీ వీ జీ కృష్ణమూర్తిగారు నాతో అన్నారు. శ్రీ స్వామి వారికి, గురుమాత ఆరొగ్య పరిస్థితి గురించి వివరించాను. గురుమాత శ్రీ స్వామివారితో ఉంటే, స్వామి వారి మహిమలతో వారు వెంటనే కోలుకుంటారు అనే ఆలోచన వచ్చి అదే విషయాన్నీ శ్రీ స్వామి వారికి విన్నవించుకున్నాను. అందుకు శ్రీ స్వామి వారు ముందు అంగీకరించలేదు. వారికి ప్రపంచం మొత్తం మీద సమభావం ఉందని, వారికందరూ ఒకటే అని చెప్పారు.అయితే గురుమాతను శ్రీశైలం తీసుకువెళ్లేందుకు శ్రీ స్వామి వారు అంగీకారం తెలిపితే, వారిని మా సొంత తల్లిలా చూసుకుంటామని, గురుమాతకు సేవ చేసుకునే భాగ్యం మా అందరికీ ప్రసాదించమని శ్రీ స్వామి వారిని వేడుకున్నాను. ఆలా ఎంతో ప్రాధేయపడిన తర్వాత, శ్రీ స్వామివారు అందుకు అంగీకరించారు. యాత్ర పూర్తి చేసుకొని, తిరుగు ప్రయాణం లో గురుమాతను తీసుకువెళదామని శ్రీ స్వామి వారు అన్నారు. అలా సాత్తూర్ లో శ్రీ స్వామి వారి అనుగ్రహంతో గురుమాతను దర్శించుకొని అక్కడి నుండి మా యాత్రను కొనసాగించాము. ఆ సంవత్సరంలో శ్రీ స్వామి వారి దర్శన భాగ్యంతో ఎన్నో అద్భుతమైన సంఘటనలను, అనుభూతులను పొందుతూ, ఎందరో మహాత్ముల దర్శనం కూడా చేసుకోకలిగాను. నా గురువుకి జన్మనిచ్చిన, నా గురుమాతను దర్శించుకోవటం అన్నిటికన్నా అమితమైన ఆనందాన్ని నాకు ప్రసాదించింది.

|| యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


 

********సశేషం********


472 views0 comments

Comments


bottom of page