ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ
శ్రీ స్వామి వారి అనుగ్రహంతో, గురుమాతని సాత్తూర్ లో దర్శించుకొని, అటు నుండి కొన్ని క్షేత్రాలు సందర్శించుకుంటూ, శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆరు క్షేత్రాలలో(ఆరుపడై వీడు) ఒకటైన తిరుచందూర్ కి బయలుదేరాము. సముద్ర తీరం లో ఉన్న ఈ పురాతనమైన దేవాలయంలో శ్రీ సుబ్రమణ్య స్వామి గురు స్వరూపంగా కొలువు తీరారు. శ్రీ పూర్ణానంద స్వామి వారి చరిత్ర లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ విషయాలు శ్రీ స్వామి వారు ఎన్నో సార్లు భక్తులందరికి వివరించారు.
- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)
1961వ సంవత్సరం డిసెంబర్ నెలలో శ్రీ స్వామి వారి తండ్రి గారు, ప్రథమ గురువులైన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు ఒక రోజు శ్రీ స్వామి వారిని కల్లిడైకురిచ్చికి వెళ్లి అక్కడ కొన్ని ముఖ్యమైన మంత్ర శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు తీసుకురమ్మని పంపించారు . సాత్తూర్ నుండి కల్లిడైకురిచ్చికి వెళ్లిన శ్రీ స్వామి వారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పిన పుస్తకాలు తీసుకొని, నీలకంఠ దీక్షితులు గారి ఇంటి నుండి బయలుదేరే సమయానికి శ్రీ స్వామి వారు ఉన్నట్టుండి అకారణంగా నెత్తురు కక్కోవటంతో నీలకంఠ దీక్షితులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది శ్రీ స్వామి వారిని వాళ్ళ ఇంట్లోనే కొన్ని రోజులు ఉండి విశ్రాంతి తీసుకోవలసిందిగా బలవంతం చేసి ఆపేసారు. శ్రీ స్వామి వారు, వారి ఆరోగ్యానికి ఏమి కాలేదు అని, వారి నాన్నగారికి సాత్తూర్ లో ఏదో జరిగింది అని, వెంటనే సాత్తూర్ కి బయలుదేరాలి అని శ్రీ స్వామి వారు ఎంత వారించినా, శ్రీ స్వామి వారి మాట ఎవరు వినకుండా వారిని వారం రోజులు పాటు కల్లిడైకురిచ్చికిలోనే ఆపేసారు. వారం తర్వాత శ్రీ స్వామి వారు కల్లిడైకురిచ్చి నుండి బయలుదేరి సాత్తూర్ చేరుకున్నారు. కాని అప్పటికే శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నిర్యాణం చెంది కొన్ని రోజులు గడిచిపోయాయి. శ్రీ స్వామి వారి అంతఃప్రాణమైన ప్రథమ గురువులు, తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆఖరి దర్శనం కూడా శ్రీ స్వామి వారికి లభించలేదు. వారి గురుదేవులు ఇక లేరు అనే బాధ శ్రీ స్వామి వారిని ఎంతగానో కలిచివేసి, తీవ్రమైన వైరాగ్యంతో దేహాన్ని వదిలేద్దామనుకున్న సమయంలో, శ్రీ స్వామి వారికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అప్పచెప్పిన కుటుంబ బాధ్యతలు స్ఫురించాయి. అలా 1962 నుండి కుటుంబాన్ని పోషించేందుకు శ్రీ స్వామి వారు ఎన్నో ఉద్యోగాలు కూడా చేసారు. అనంత కోటి బ్రహ్మాండాలను పాలించే పరమాత్ముడు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే పనిలో, సాధారణ మనిషిలా ఉద్యోగం చేయటం అనేది వింటానికి ఎంతో విడ్డూరంగా ఉండొచ్చు! నిస్సంకల్పులు, కారణ జన్ములు, సిద్ధపురుషులైన శ్రీ స్వామి వారు సంకల్పిస్తే సాక్షాత్తు ధనలక్ష్మి అమ్మవారు, శ్రీ స్వామివారి ముందు ప్రత్యక్షమవ్వాల్సిందే! కానీ శ్రీ స్వామి వారు ఏ రోజు లౌకికమైన విషయాల గురించి ఆలోచించలేదు. పితృవాక్య పరిపాలకులైన శ్రీ స్వామి వారు, వారి తండ్రి గారి మార్గాన్నే అనుసరిస్తూ, ఒక చిన్న ఉద్యోగం చేసి వారి కుటుంబాన్ని పోషించుకున్నారు. వారు పని చేసిన ప్రతి చోటు, శ్రీ స్వామి వారికి గుర్తింపు, గౌరవాలు లభించాయి. అప్పట్లో శ్రీ స్వామి వారు బెంగుళూరు లో ఒక స్పిన్నింగ్ మిల్ లో పని చేసారు. అక్కడి యాజమాన్యం 1963 లోనే శ్రీ స్వామి వారికి ఒక కారుతో పాటు, ఉండేందుకు ఒక పెద్ద ఇంటిని ఏర్పాటు చేసారు. కానీ శ్రీ స్వామి వారు అవన్నీ తిరస్కరించి, వారి బంధువుల ఇంట్లో ఉన్నారు. శ్రీ స్వామి వారికి ప్రావిణ్యం లేని కల అంటూ లేదు.గొప్ప గొప్ప చిత్రకారులని కూడా అబ్బురపరిచే రీతిలో శ్రీ స్వామి వారు బొమ్మలు గీసేవారు. 1962-1965 మధ్యలో శ్రీ స్వామి వారు చేసిన ఉద్యోగాలలో, సైన్ బోర్డ్స్ మిద రాయటం, బొమ్మలు గీయడం, స్టెనోగ్రఫీ వంటివి కూడా ఉన్నాయి. అలా శ్రీ స్వామివారు సంపాదించిన డబ్బులతోనే, ఎంతో వైభవంగా వారి దగ్గర బంధువు, శ్రీమతి చిత్ర గారి వివాహము కూడా చేశారు. శ్రీ సుబ్రమణ్యశాస్త్రి గారి గురువులైన నీలకంఠ దీక్షితులుగారి కుటుంబం కల్లిడైకురిచ్చిలో నివాసముండేవారు. గురుమాతతో నీలకంఠ శ్రీ దీక్షితులుగారి కుటుంబం ఎంతో ప్రేమగా ఉండేవారు. శ్రీ నీలకంఠ దీక్షితులు గారి మనవరాళ్ల సంరక్షణలో గురుమాత కొంత కాలం కల్లిడైకురిచ్చిలో ఉన్నారు. అప్పట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. వారి కుటుంబానికి కూడా శ్రీ స్వామి వారు అండగా ఉంటూ, వాళ్ళు స్థిరపడేందుకు కావాల్సిన సహాయం అందించారు. అదే సమయానికి శ్రీ స్వామి వారి అన్నగారు శంకరనారాయణ గారికి కూడా ఉద్యోగం రావటంతో, వారు గురుమాతని వారితో పాటు సాత్తూర్ కి తీసుకువెళ్లారు. ఆ సమయంలో సర్వీస్ కమిషన్ పరీక్షలో శ్రీ స్వామి వారు ఉత్తీర్ణత సాధించటంతో, ఇంటర్వ్యూ కోసమని తిరుచందూర్ కి వెళ్లారు. ఇంటర్వ్యూ సమయానికి, శ్రీ స్వామి వారు తెచ్చుకున్న డబ్బులతో పాటు, వారి సర్టిఫికెట్స్ కూడా పోవటంతో అక్కడి నుండి వారు కాలి నడకన, తిరుచందూర్ సుబ్రమణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్లి, కొంత సేపు అక్కడే సేద తీరారు. శ్రీ స్వామి వారు అక్కడే ఉన్నారన్న విషయం గ్రహించని ఆలయ అర్చకులు, స్వామి వారు లోపల ఉన్నప్పుడే, గుడి తాళం వేసుకుని వెళ్లిపోయారు. తర్వాత విషయం తెలుసుకున్న శ్రీ స్వామి వారు, ఆ రాత్రి గుడిలోనే నిద్ర చేసారు. తిరుచందూర్ దేవాలయంలో తెల్లవారు జామున ఆలయ ధ్వజ స్థంభం వద్ద హంస నమస్కారాలు చేసి, గర్భ గుడి తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత ఒక 11 మంది బ్రహ్మచారులకు భోజనం పెట్టి, వారికి శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారు. ముందు రోజు డబ్బులు పోవటం వలన, శ్రీ స్వామి వారు పస్తున ఉన్నారు. తెల్లవారు జామున సముద్ర స్నానం చేసి, సుబ్రమణ్య స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్న శ్రీ స్వామి వారి వద్దకు దేవాలయ ప్రధాన అర్చకులు వచ్చి, ప్రతి రోజు ఈ సమయానికి 11 మంది బ్రహ్మచారులకు భోజనం పెట్టి, వారికి ప్రత్యెక దర్శనం కూడా ఏర్పాటు చేస్తామని, కాని ఇవాళ 10 మంది బ్రహ్మచారులు మాత్రమే ఉన్నారని, ఒకరు తగ్గారని, స్వామి వారికి అభ్యంతరం లేకపోతే వారు 11వ బ్రహ్మచారిగా రావాల్సిందిగా అడగగా, శ్రీ స్వామి వారు అందుకు అంగీకరించారు.భోజనం చేసాక, శ్రీ సుబ్రమణ్య స్వామి వారి దర్శనార్ధం వెళ్లిన శ్రీ స్వామి వారికి, సుబ్రమణ్య స్వామి విగ్రహానికి బదులు, శ్రీ స్వామి వారి ప్రథమ గురువులు, తండ్రి గారైన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు దర్శనం ఇచ్చారు. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ స్వామి వారికి అప్పజెప్పిన కుటుంబ బాధ్యతలు పూర్తయినట్లుగా తల్లి బాద్యత అన్నగారు స్వీకరించి, గురుమాతని సాత్తూర్ కి తీసుకువెళ్ళడం! సర్టిఫికెట్స్ పోవటం! సుబ్రమణ్య శాస్త్రి గారు తిరుచందూర్ దేవాలయ మూల విగ్రహం లో దర్శనం ఇవ్వటం వంటివి జరిగాయి.
ఆ క్షణం నుండి శ్రీ స్వామి వారు సుబ్రమణ్య శాస్త్రి గారిని చేరుకోవాలి, లేదా దేహాన్ని వదిలేయాలనే సంకల్పంతో తిరుచందూర్ నుండి కాలి నడకన కలిదైకురిచికి బయలుదేరారు.కల్లిడైకురిచ్చిలో శ్రీ నీలకంఠ దీక్షితులుగారి తండ్రి, తాతగార్ల అదిష్టానాల వద్ద కొన్ని రోజులు ఏకాంతంగా గడిపి, అటు నుండి అంబాసముద్రం, పాపనాశనం, అగస్త్యర్ జలపాతాల మీదగా పోతిగై శిఖరాగ్రానికి చేరుకున్నారు.వరుణ గుహలో కఠోరమైన తపస్సుకు సంకల్పించారు.
ఇంతటి చరిత్ర కు మూలంగా ఉన్న శ్రీ తిరుచందూర్ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి శ్రీ స్వామి వారు మమ్మల్ని తీసుకువెళ్లి, అక్కడ స్థల పురాణం తో పాటు, స్వామి వారి చరిత్రలో జరిగిన ఈ వృత్తాన్తమంతా మాకు వివరించారు.
ఉత్తమమైన వారు ఏది ఆచరిస్తారో, ప్రపంచమంతా అదే ఆచరిస్తుంది. తల్లితండ్రుల పట్ల భాద్యతగా ఉండటంలో, గురువు వద్ద భక్తి శ్రద్ధలనాచరించటంలో, ఆపదల్లో, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో శ్రీ స్వామి వారికి వారే సాటి. ఒక సాధారణ మనిషిగా శ్రీ స్వామి వారి నడవడిక ఈ ప్రపంచానికే ఆదర్శం.
********సశేషం********
నమో భగవతే పూర్ణానందాయ