top of page

|| యతో వాచో నివర్తంతే || - 17

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ గురు చరిత్రకు ఉన్న విశిష్టత మాటల్లో వర్ణించలేనిది. గురువు గురించి మనకు ఒక చిన్న ఆలోచన రావాలన్న దానికెంతో అనుగ్రహం కావాలి.ఎంతో మహిమాన్వితమైనటువంటి గురు స్మరణ లౌకికమైన దుఃఖాలను దూరం చేసి అలౌకికమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. గురువుని మించిన తత్త్వం, గురువుని మించిన తపస్సు , గురువుని మించిన జ్ఞానము ఈ సృష్టిలోనే లేవు. పూర్ణానంద స్వరూపులైన శ్రీ స్వామి వారిని దర్శించుకోవాలన్నా, వారి సన్నిధి దొరకాలన్నా, అందుకు ఎన్నో జన్మల పుణ్యఫలం కావలి. వారి రూపము, నామము, స్మరణ, సన్నిధి ఇచ్చే ఆనందము, ధైర్యము అనిర్వచనీయము. అటువంటి శ్రీ గురువులు శ్రీ పూర్ణానంద స్వామి వారి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం లో శ్రీ స్వామి వారితో పాటు నేను, రాజుగారు తిరుచందూర్ నుండి బయలుదేరి కల్లిడైకురిచ్చికి చేరుకున్నాము.అప్పటికే మేము ఎన్నో గొప్ప అనుభవాలు, అనుభూతులు శ్రీ స్వామి వారి దయవలన పొందకలిగాము.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

శ్రీ స్వామి వారు, వారి తండ్రి గారైన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు ఆదేశించినా విధముగా కుటుంబ బాధ్యతలను స్వీకరించి, ఆ బాధ్యతలను ఎంతో గొప్పగా నిర్వర్తించి, వారి కుటుంబాన్ని స్థిరపరిచారు. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శ్రీ స్వామివారికి వారి తండ్రి, ప్రథమగురువులు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని చేరుకునే లక్ష్యంగా తపో బాటను ఎంచుకున్నారు.

మార్గ మధ్యలో ఒక విష్ణు దేవాలయానికి శ్రీ స్వామి వారు మమ్మల్ని తీసుకువెళ్లారు. శ్రీ స్వామి వారు తపస్సు కి వెళ్ళే దారి లో ఈ దేవాలయం వద్ద అలసి విశ్రాంతి తీసుకున్నారని, ఆ ఆలయ పూజారి శ్రీ స్వామి వారికి చేసిన సపరియల గురించి శ్రీ స్వామి వారు మాకు వివరించారు. కల్లిడైకురిచ్చిలో శ్రీ నీలకంఠ దీక్షితులు గారి పూర్వీకుల అదిష్టానాల వద్దకు శ్రీ స్వామి వారు మమ్మల్ని తీసుకువెళ్లారు.శ్రీ స్వామి వారు నడుచుకుంటూ వెళ్తుంటే, వారి వేగాన్ని అందుకోవడం చాల కష్టం.ఎంత దూరమైనా వారు మెరుపు వేగం తో నడుచుకుంటూ వెళ్లిపోగలరు.అప్పటికే నిరంతరంగా కొన్ని వారల పాటు ప్రయాణం లో ఉండటం వలన నాకు,రాజు గారికి కొంత అలసట మొదలయ్యింది.అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఎంతో భారంగా అనిపించింది. మాకు ఏ లోటు రాకుండా చూస్కుంటూ, మమ్మల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉంటూ, మా కన్నా ఎక్కువ శ్రమ తీసుకున్న శ్రీ స్వామి వారు మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

కల్లిడైకురిచ్చి నుండి బయలుదేరిన మేము, ముందు టెంకాశి వెళ్ళాము.అక్కడ శ్రీ స్వామి వారి అతిముఖ్యమైన భక్తులు శ్రీ దొరైరాజు గారి ఇంటికి శ్రీ స్వామి వారు మమ్మల్ని తీసుకువెళ్లారు. దొరైరాజుగారు శ్రీ స్వామి వారు తపోస్థనం లో ఉన్న రోజుల్లో, బానతీర్థం కి సమీపాన ఉన్న కారియర్ అనే చిన్న ఊరిలో ఉండేవారు. శ్రీ స్వామి వారు తపోస్తానం లో ఉన్న రోజులలో, దొరైరాజు గారు స్వామి వారికి ఎంతో సేవ చేసుకున్నారని, వారి కుటుంబం శ్రీ రాఖాడీబాబా వారి దర్శనం కూడా చేసుకున్నారని, కారియర్ లో దొరైరాజు గారి ఇంటికి బాబా వారు, స్వామి వారు తరచూ వచ్చి వెళ్తూ ఉండేవారని, శ్రీ స్వామి వారు మాకు చెప్తూ, శ్రీ దొరై రాజు గారు శ్రీ స్వామి వారికి, బాబా వారికి చేసిన సేవని ఎంతగానో కొనియాడారు. వారి ఇంట్లో రెండు రోజులు గడిపిన తర్వాత శ్రీ స్వామి వారు మమ్మల్ని మరల అంబాసముద్రం మీదగా పాపనాశనం అనే ఊరికి తీసుకు వెళ్లారు.


శ్రీ బాబా, శ్రీ స్వామి వార్లతో శ్రీ దొరైరాజు గారు

అంబాసముద్రం నుండి పాపనాశనంకి శ్రీ స్వామి వారితో కలిసి నేను, రాజు గారు నడకబాట పెట్టాము.అప్పటికే సూర్యాస్తమయం అయ్యి కొంచం కొంచంగా చీకటి పడుతూ ఉంది. ఆ రాత్రి చీకటిలో, ఒకవైపు అలసట, మరొకవైపు నిద్ర. శ్రీ స్వామి వారు ముందు నడుచుకుంటూ వెళ్తుండగా, వారి వెనక నేను, నా వెనక రాజుగారు శ్రీ స్వామి వారి వేగాన్ని అందుకోలేక పాపనాశనంకి ఎప్పుడు చేరుకుంటామా అని ఆశగా చుస్తూ వెళ్ళాము.

అంతటి అలసటతో, శ్రీ స్వామి వారు, “Now we have to cross the river”, అన్నారు. ఆ అలసట లో నది దాటడం అంటే ఒక పెద్ద పరీక్ష లా అనిపించింది.శ్రీ స్వామి వారికి నమస్కారం చేసుకొని, ఆ చీకటిలో కళ్ళు మూసుకొని, శ్రీ స్వామి వారి భుజం మీద చేయి వేసి నడుచుకుంటూ వెళ్ళసాగాను. రాజు గారు నా వెనక, నా భుజం మీద చేయి వేసి, వారు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చారు. నది ప్రవాహ శబ్దం వినిపిస్తూ ఉండటం తో, నది ఎప్పుడు వస్తుందా! ఆ నది ప్రవాహం ఎలా ఉండబోతుందా అని ఆలోచిస్తూ, కొంత దూరం వెళ్ళేసరికి శ్రీ స్వామి వారు,”Now we have crossed the river”, అన్నారు. నిబడాశ్చర్యం తో కళ్ళు తెరిచి, నా శరీరం అంత తడుముకుని చూసాను, కానీ ఎక్కడా తడి తగలలేదు.వెనక్కి తిరిగి చూస్తే, నదీ ప్రవాహాన్ని దాటి చాలా దూరం ముందుకొచ్చేసి ఉన్నాము. ఈ విచిత్రమేంటి అని నేను ఆలోచన లో పడ్డాను. అప్పుడు శ్రీ స్వామి వారు,అక్కడ నది మీద ఒక చిన్న వారధి ఉందని, ఆ వారధి మీద నుండి మనం నడుచుకుంటు వచ్చామని అన్నారు. ఆ రాత్రి మేము నడుచుకుంటూ వచ్చిన దారి, ఆ వారధి గురించి తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

అలా ఆ నదీ ప్రవాహాన్ని దాటుకొని, అర్ధరాత్రి సమయానికి పాపనాశనం చేరుకున్నాము. పాపనాశనం లో నది తీరాన ఒక దేవాలయం, ఆ దేవాలయానికి సమీపాన ఒక మండపం ఉంది.శ్రీ స్వామి వారు తపస్సులో ఉన్న రోజుల్లో, శ్రీ రాఖాడీ బాబా వారు, అదే మండపంలో నిద్ర చేసి అటు నుండి శ్రీ స్వామి వారి తపోస్తానం వైపు పయనమయ్యారని శ్రీ స్వామి వారు మాతో అన్నారు.

ఆ మండపం వద్ద సేదతీరేందుకు ఆగుదామని, మరల ఉదయాన్నే అక్కడి నుండి ప్రయాణం కొనసాగిద్దామని శ్రీ స్వామి వారు అన్నారు. ఎతైన ప్రదేశంలో ఉన్న ఆ మండపానికి అనుకోని నది ప్రవహిస్తూ ఉంటుంది. మండపంలో నది వైపు నేను, నా పక్కన రాజు గారు, రాజు గారి పక్కన శ్రీ స్వామి వారు పడుకున్నారు.అది చలి కాలం కావటంతో, ఉన్న దుప్పట్లు నేను, రాజు గారు కప్పుకున్నాము.శ్రీ స్వామి వారు మాత్రం కౌపీనం లో నే ఉన్నారు.శ్రీ స్వామి వారికి పాపం చలిగా ఉంటుందేమో అని, నా దుప్పటి వారికి ఇచ్చాను.రాజు గారికి చలి ఎక్కువ అని, శ్రీ స్వామి వారు ఆ దుప్పటి కూడా రాజు గారికి కప్పి, వారు మాత్రం కౌపీనం తోనే పడుకున్నారు.

అలసట తో ఉండటం వలన త్వరగా మేము నిద్రలోకి జారుకున్నాము.నాకు మధ్యలో ఒకసారి మెలుకువ వచ్చి, లేచి చూస్తె, నా పక్కన రాజు గారు లేరు. రాజుగారు ఏమయ్యారా, అని అటు ఇటు వెతకసాగాను. వారెక్కడ కనిపించలేదు. ఇంత రాత్రి వేళ, వీరు ఎటు వెళ్లి ఉంటారా అని ఆలొచిస్తూ,"రాజూ" అని గట్టిగా కేక పెట్టాను. నది లో దూరంగా “స్వామి! స్వామి!”, అని అరుపులు వినిపిస్తున్నాయి. రాజు గారు నది లో కొట్టుకుపోతున్నారని నాకు ధడ మొదలయ్యి శ్రీ స్వామి వారిని నిద్ర లేపాను. స్వామి వారు కళ్ళు తెరిచి చూసి, ఏమయింది అని అడిగారు. రాజు గారు నది లో కొట్టుకుపోతున్నారు, నాకు ఈత రాదు, మీరే వారిని కాపాడాలి అని వేడుకున్నాను. స్వామి వారు నది వైపు చూసి,”He will not die”, అని కళ్ళు మూసుకున్నారు.ఒకవైపు రాజు గారు నదిలో కొట్టుకుపోతుంటే, వీరు, “He will not die”, అంటున్నారేంటని ఆందోళన చెందాను.వీరికేమైనా అయితే, ఇప్పుడు వారి కుటుంబసభ్యులు నన్నే నిలదీస్తారు. ఇక చేసేదేమి లేక, నేనే నది లో కి దిగుదామని ధైర్యం తెచుకుకుంటుంటున్న సమయంలో వెనక నుండి రాజు గారు వచ్చి, నా పక్కనే పడుకున్నారు.ఆకాశం అందంగా ఉంది అని నక్షత్రాలు చూసేందుకు వారు దేవాలయం వద్దకు వెళ్లారని చెప్పారు.అప్పటికే కాస్త వెలుగు రావటం తో నది లో “స్వామి! స్వామి!”, అని అరుస్తున్నది అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు అని నాకు అర్ధమయ్యింది. నేను ఆ రాత్రి పడ్డ మనోవేదన వర్ణనాతీతం. మొత్తానికి రాజు గారికి ఏమీ కాలేదని కొంత ఊపిరి పీల్చుకున్నాను. జరిగిన వృత్తాన్తమంతా పక్కనే ఉండి చూస్తున్న శ్రీ స్వామి వారు మాత్రం నా వంక ముసి ముసి నవ్వులు నవ్వుతూ చూసారు. సూర్యోదయ సమయానికి పాపనాశనం నుండి మా ప్రయాణం కొనసాగించాము.


 

********సశేషం********


376 views0 comments

Comentarios


bottom of page