top of page
Writer's pictureSriswamypoornananda.org

|| యతో వాచో నివర్తంతే || - 18

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


శ్రీ స్వామి వారి తపోస్థానంకి వెళ్లే దారిలో, అగస్త్యర్ జలపాతాలను సమీపించిన సమయానికి, దాదాపు నెలకు పైగా ప్రయాణం చేయటం వలన, నా కాలుకి నెత్తురు గడ్డ లేచి నడిచేందుకు ఎంతో ఇబ్బంది పడ్డాను. నా ఇబ్బందిని గమనించిన శ్రీ స్వామి వారు, అటుగా వెళ్తున్న ఒక చెంచు అతనితో తమిళంలో ఎదో మాట్లాడారు. అతను సమీపంలో ఉన్న చెట్ల నుండి ఆకులు కొన్ని కోసి, వాటితో ఒక పసరులా చేసి నా కాలుకి ఆ పసరు మందుతో కట్టు కట్టాడు. ఆ కట్టు కట్టిన కొద్ది సమయానికే నాకు ఎంతో ఉపశమనం కలిగింది.బాణతీర్థ జలపాతాల సమీపం లో ఉన్న వరుణ గుహకు శ్రీ స్వామి వారు మమ్మల్ని తీసుకువెళ్లారు. ఇదే గుహలో శ్రీ స్వామి వారు శ్రీ రాఖాడీ బాబా వారిని మొదటి సారి కలిసారు.


- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

శ్రీ స్వామి వారి తండ్రి గారు-ప్రథమ గురువులు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నిర్యాణం చెందాక, శ్రీ స్వామి వారు తీవ్రమైన వేదనకు లోనయ్యారు.ఆ తీవ్రమైన వేదన, వైరాగ్యం గా మారి, వారి తండ్రి గారిని చేరుకోవాలనే బలమైన సంకల్పంతో వారు తపోబాటను ఎంచుకున్నారు.అందుకు బాణతీర్థ జలపాతానికి సమీపం లో ఉన్న వరుణ గుహను ఎంచుకున్నారు. దేహత్యాగానికి సిద్ధమవుతున్న శ్రీ స్వామి వారి తపో సంకల్పానికి, ప్రకృతి కూడా చెలించింది. వన్య ప్రాణులు శ్రీ స్వామి వారి సన్నిధిని ఆశ్రయించి శ్రీ స్వామి వారికి ఆహారాన్ని సమకూర్చే ప్రయత్నం చేశాయి. పోతిగై అరణ్యం మీదుగా ప్రవహించే తామ్రవరుణి నది వరదై ప్రవహించి శ్రీ స్వామి వారి పాదాలను స్పర్శించింది. 26 రోజుల పాటు శ్రీ స్వామి వారు చేసిన కఠోరమైన తపస్సు నిత్యానంద భగవాన్ సన్నిది సమీపంలో ఉన్న నింబోలిలో నివాసులైన శ్రీ ఓంకారానంద స్వామి వారిని కదిలించింది. సాక్షాత్తు ఆ జగన్మాత కబురు పంపిందేమో అన్నట్టుగా, శ్రీ ఓంకారానంద స్వామి వారు, వారి తల్లిని కడసారిగా దర్శించుకోవాలని ఆలోచనతో మహారాష్ట్ర నుండి బయలుదేరేలా చేసింది. శ్రీ బాబా వారి స్వగ్రామమైన కలవై కి వారు చేరుకునేటప్పటికే, బాబాగారి తల్లి నిర్యాణం చెందారు. శ్రీ స్వామివారికి తండ్రి ఆఖరి దర్శన భాగ్యం లభించని విధంగానే, బాబా వారికి తల్లి ఆఖరి దర్శనం లభించలేదు. కలవై నుండి పలనీకి వెళ్లి, అక్కడ తలనీలాలు సమర్పించుకున్న పిమ్మట, శ్రీ బాబా వారు పాపనాశనంకి పయనమయ్యారు. పాపనాశనంలో ఒక మండపంలో నిద్ర చేసిన శ్రీ బాబా వారు అగస్త్యర్ జలపాతం, సురుముత్తయ్యనార్ గుడి, ఆ పరిసర ప్రాంతాల విశిష్టత గురించి ఇద్దరు సాధువులూ మాట్లాడుకోవటం విని, మరుసటి రోజు సూర్యోదయానికి ముందే, అగస్త్యర్ జలపాతాల వైపు శ్రీ బాబా వారు పయనమారంభించారు. అప్పర్ డ్యాం వద్ద నివసిస్తున్న ఒక పోస్ట్ మాస్టర్ కి బాబావారు గురుతుల్యులు. బాబా వారు నింబోలిలో ఉన్న రోజుల్లో, ఈ పోస్ట్ మాస్టర్ బాబా వారిని తరచూ వచ్చి దర్శించుకునేవారు. ఈ పోస్ట్ మాస్టర్ బాబావారి కోసం సురుముత్తయ్యనార్ దేవాలయానికి సమీపంలో ఒక చిన్న కుటీరాన్ని కూడా ఏర్పరిచారు. బాబా వారితో ఆ పోస్ట్ మాస్టర్ మాటల సందర్భం లో అరణ్యంలో నివాసముంటూ వరుణ గుహలో కఠోరమైన తపస్సు గావిస్తున్న యుక్త వయసు బ్రాహ్మణుని(శ్రీ స్వామివారు) గురించి చెప్పగా, బాబా వారు హుటాహుటిన వరుణ గుహకు పయనమయ్యారు. బాణతీర్థ జలపాత సమీపాన ఉన్న ఈ వరుణ గుహ ఎంతో పురాతనమైనది.అక్కడికి చేరుకునే మార్గము కూడా అంత సులువైనది కాదు. అప్పటికే శ్రీ స్వామి వారు 26 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా వరుణ గుహలో తపస్సులో ఉన్నారు. 27వ రోజున, సూర్యాస్తమయ సమయానికి శ్రీ ఓంకారానంద స్వామి వారు వరుణ గుహలోకి ప్రవేశించారు. బాహ్య ప్రపంచాన్ని మరచి, అంతర్ముఖులై సమాధి స్థితి లోకి వెళ్లిన శ్రీ స్వామి వారు, బాబా వారి రాకతో బాహ్యముఖులయ్యారు. శ్రీ ఓంకారానంద స్వామి వారి రూపం లో శ్రీ స్వామి వారి తండ్రిగారు స్వయంగా వచ్చి, వారిని బాహ్యముఖులను చేసారనే భావన శ్రీ స్వామి వారికి కలిగింది. శ్రీ ఓంకారానంద స్వామివారే వారి గురువులని, శ్రీ స్వామి వారికి రెప్పపాటులోనే స్ఫురించి, శ్రీ బాబా వారు, స్వామి వారు వేరు కాదనే భావన శ్రీ స్వామి వారికి కలిగింది.

ఆ గుహలో ఒక రాయి కింద చేయి పెట్టి శ్రీ బాబా వారు, శ్రీ స్వామి వారి కోసం అన్నపానీయాలను సృష్టి చేసి ఇచ్చారు. బాబా వారికి సమర్పణ చేయకుండా తినకూడదు అనే సందిగ్దద లో ఉన్న స్వామి వారితో బాబా వారు,


“ఈ సృష్టి లో ఉన్న ప్రతి జీవి ఆకలి తీర్చే సమర్ధత కలిగిన వారు, వారి కొరకు వారు ఆహారాన్ని సృష్టించుకోగలరు, సర్వం తానే అయిన స్థితి లో ఉన్న వారికి,ఆహరం కూడా వారే”

, అని శ్రీ స్వామి వారి సందిగ్దత కు శ్రీ బాబా వారు తెరదింపారు.


“మృత్ర్యువు అనివార్యం, అది తపస్సు లో సంభవించటమే ఉత్తమం. ఇక్కడే ఉంటూ తపస్సును గావించు”

అని శ్రీ స్వామి వారితో చెప్పి, బాబా వారు సురుముత్తయ్యనార్ ఆలయానికి తిరుగుపయనమయ్యారు.

శ్రీ రాఖాడీ బాబా, శ్రీ స్వామి వారు

వరుణ గుహ నుండి మేము తిరుగుపయనమవుతున్న సమయంలో, అప్పర్ డ్యాం వద్ద మాకు ఒక వ్యక్తీ ఎదురయ్యారు. శ్రీ స్వామి వారు ఆ వ్యక్తి ని చూసి, అతనికి 13 రూపాయలు తీసి ఇవ్వమని నాతో అన్నారు. అప్పటికే ఉన్న డబ్బులు అన్ని ఖర్చయ్యి, చేతిలో బొటాబొటీగా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు 13 రూపాయలు ఇస్తే తిరుగు ప్రయాణానికి డబ్బులు సమకూరుతాయో లేదో అనే ఆలోచనతో, డబ్బులు తీసి ఆ వ్యక్తి కి ఇచ్చాను. అందుకు శ్రీ స్వామి వారు ఎంతగానో సంతోషించి, నువ్వు నీ గురువు ఋణం తీర్చావు, నీకు త్వరలో ప్రమోషన్ వస్తుంది అన్నారు. గురువు ఋణం తీర్చటమేంటా, అని శ్రీ స్వామి వారిని వివరం అడిగాను.

పూర్వం శ్రీ స్వామి వారు తపోస్థానంలో ఉన్నప్పుడు, బాబా వారికి భోజన ఏర్పాట్లు చేయటానికి ఒక కొట్టు లో కావాల్సిన సామాన్లు అరువుకు తీసుకున్నారని, మాకు ఎదురైనా ఆ వ్యక్తి, ఆ కొట్టు యజమాని అని, బాబా వారి కోసం చేసిన ఆ అప్పు, ఇప్పుడు ఇలా తీరింది అని శ్రీ స్వామి వారు అన్నారు.

శ్రీ స్వామి వారు నా మీద అనుగ్రహం కురిపించటానికి ఈ 13 రూపాయలు ఒక కారణం మాత్రమే. ఎందుకంటే నేను శ్రీశైలం నుండి తెచ్చుకున్న డబ్బు రైలు లో నే మొత్తం పోగొట్టుకున్నాను.మా ప్రయాణానికి అయిన ఖర్చంతా శ్రీ స్వామి వారే సమకుర్చారు. నేను ఆ కొట్టు యజమాని ఇచ్చిన 13 రూపాయలు కూడా, ప్రయాణం మద్య లో శ్రీ స్వామి వారు నాకిచ్చినవే.ఆలా వారు సమకూర్చి నాకిచ్చిన డబ్బు, నా ద్వారా ఆ కొట్టు యజమానికి ఇప్పించి, అది కారణంగా పెట్టి శ్రీ స్వామి వారు నాపై అనుగ్రహ వర్షం కురిపించారు. కాకపోతే నేను చేస్తున్న ఉద్యోగం లో నాకు రావలసిన ప్రొమోషన్లు అన్ని వచ్చేసాయి.శ్రీ స్వామి వారు ప్రమోషన్ వస్తుంది అంటున్నారు కాని, అందుకు అవకాశం లేదు.కానీ శ్రీ స్వామి వారు ఒక మాట చెప్తే అది జరిగి తీరుతుంది. ఇటువంటి పరిస్థితి లో నాకు ప్రమోషన్ ఎలా వస్తుందా అని, నాకు కూడా కొంత ఉత్కంఠత ఉంది.

అలా శ్రీ స్వామి వారి తపోస్థానం సందర్శించుకుని మా యాత్రను మేము పూర్తి చేసుకున్నాము. ప్రపంచం డబ్బుల వల్లే నడుస్తుంది అని నమ్మే నాకు, ప్రాప్తం ఉంటేనే ఏదైనా వస్తుంది! డబ్బులతో సహా అని, శ్రీ స్వామి వారు అనుభవపూర్వకంగా బోధించారు.ఈ ప్రయాణం లో మేము ఎన్నో క్షేత్రాలు సందర్శించాము, ఎందరో మహాత్ములను చూసాము. శ్రీ స్వామి వారు మాకు ఎటు వంటి లోటు రాకుండా, కంటికి రెప్పలా మమ్మల్ని చూసుకున్నారు. ఈ యాత్రలో శ్రీ స్వామి వారి దయ వలన గురు మాత దర్శన భాగ్యంతో పాటు, శ్రీ రాఖాడీ బాబా వారి పాదుకలు కూడా లభించాయి.గురుమాతను మాతో పాటూ శ్రీశైలానికి తీసుకువెళ్లేందుకు శ్రీ స్వామి వారు అనుమతి ఇవ్వటంతో, మేము శ్రీ స్వామి వారి తపోస్థానం నుండి సాత్తూర్ కి పయనమయ్యాము.


 

********సశేషం********

370 views0 comments

Recent Posts

See All

댓글


bottom of page