top of page

|| యతో వాచో నివర్తంతే || - 19

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


శ్రీ పూర్ణానంద స్వామి వారి దయతో, గురు చరిత్ర తెలుసుకోవాలని మేము శ్రీశైలం నుండి మొదలు పెట్టిన మా యాత్ర ముగించుకొని మేము తిరుగుపయనం అయ్యాము. గురుమాతను మాతో తీసుకువెళ్లేందుకు శ్రీ స్వామి వారు అనుమతి ఇవ్వటం తో, శ్రీ స్వామి వారి తపోస్థానం నుండి ముందుగా సాత్తూర్ కి చేరుకున్నాము. సాత్తూర్ లో శ్రీ స్వామి వారి అన్నగారు శ్రీ శంకర్ నారాయణన్ గారి ఇంట్లో గురుమాత ఉన్నారు. శ్రీ స్వామి వారు నన్నే శంకర్ నారాయణన్ గారి ఇంటికి వెళ్లి రమ్మని చెప్పి, వారు రాజు గారితో పాటు రైల్వే స్టేషన్ లోనే ఉండిపోయారు. శ్రీ శంకర్ నారాయణన్ గారికి విషయం అంత వివరించి, గురుమాతని మాతో తీసుకు వెళ్లేందుకు అనుమతి కోరాను. అందుకు వారు కూడా సుముఖత వ్యక్తం చేసి, గురుమాత అంగీకారం తో వారిని తీసుకువెళ్లొచ్చని అన్నారు. గురుమాత కి నమస్కారం చేసుకొని, వారు అనుమతిస్తే, వారిని నాతో శ్రీశైలం తీసుకువెళ్లాలనుకుంటున్నాను అని వారిని కోరగా, వారు అంగీకారం తెలిపి నాతో పాటూ కట్టు బట్టలతో బయలుదేరారు.అలా శ్రీ శంకర్ నారాయణన్ గారి ఇంటి నుండి ఒక జట్కా బండి లో నేను గురుమాత రైల్వే స్టేషన్ కి బయలుదేరాము.


- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

రైల్వే స్టేషన్కి చేరుకున్న సమయానికి, శ్రీ స్వామి వారు మా కోసం రైల్వే స్టేషన్ లో ఎదురుచూస్తున్నారు. శ్రీ స్వామి వారు గురుమాత సమీపానికి చేరగా, గురుమాతకు నేత్ర దృష్టి సన్నగిల్లటం వల్లనో ఏమో, వారు శ్రీ స్వామి వారిని గుర్తుపట్టలేదు. శ్రీ స్వామి వారు ఎవరో కాషాయధారి అనుకోని, శ్రీ స్వామి వారికి నమస్కారం చేయబోయారు. శ్రీ స్వామి వారు గురుమాతను ఆపి, “అమ్మ”, అని పిలవగా గురుమాతకు ఈ కాషాయధారి వారి కన్నా బిడ్డ కామేశ్వరన్ అని గుర్తుపట్టారు.తల్లి ప్రేమకు ఎంతటి మహనీయులైన పసివారే అన్నట్లు, శ్రీ స్వామివారితో ఎన్నో సంవత్సరాల ఎడబాటు ముగియటంతో, గురుమాత ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందంలో శ్రీ స్వామి వారిని పట్టుకొని గురుమాత ఎంతగానో విలపించారు. సాత్తూర్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ అపురూపమైన దృశ్యం చూసిన నాకు, రాజు గారికి కళ్ళు చెమర్చాయి.


సాత్తూర్ నుండి బయలుదేరిన మేము, మధురైలో రైలు దిగాము.అక్కడ ఒక సత్రం లో గది తీసుకుని ఆ పూట అక్కడే బస చేసాము. శ్రీ స్వామి వారు గురుమాతకు స్వయంగా కొత్త వస్త్రాలు కట్టి, మా ప్రయాణానికి గురుమాతను సిద్ధం చేసారు. మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్ లో ఉన్న సమయం లో ఆ రోజు ఉదయం నుండి నన్ను ఏమి తినవద్దని శ్రీ స్వామి వారు చెప్పారు. శ్రీ స్వామి వారు చెప్పారు కదా అని వారిని బదులు అడగకుండా నేను ఉదయం నుండి ఏమీ తినకుండా అలానే ఉన్నాను. మధ్యాహ్నం సమయానికి ఆ స్టేషన్ లో గారెల వాసన వస్తుండటం తో, శ్రీ స్వామి వారు, వేడి గా గారెలు వేస్తునట్లున్నారు, అందరికి గారెలు తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించారు. స్టేషన్ లో ఒక మూలన వేడి వేడి గా వేస్తున్న గారెలు కొని తీసుకువెళ్లాను. శ్రీ స్వామి వారు ఒక గారిలో చిన్న ముక్క తిని, ఇవాళ మీ నాన్న గారి మాసికం. మీ ఇంట్లో మీ అన్నతమ్ములు చేయవలసిన కార్యక్రమం ఇప్పుడే పూర్తి చేశారు అన్నారు. వెంటనే ఆ వెయిటింగ్ రూమ్ లోనే శ్రీ స్వామి వారి పాదాలు కడిగి,వారికి నమస్కారం చేసుకున్నాను. కార్యక్రమం చాలా బాగా జరిగింది అని, మా నాన్న గారు ముక్తి పొందారు అని శ్రీ స్వామి వారు అన్నారు. గురుసన్నిధి లో పితృకర్మలు చేయటం వలన, పితృదేవతలకు ముక్తి లభిస్తుంది అని గురుచరిత్ర లో చెప్పబడింది. అలా పితృదేవతల కర్మలకు ఉండే ప్రాముఖ్యతను గురించి శ్రీ స్వామి వారు ఈ సంఘటన ద్వారా మనకు తెలియచేసారు.


ఒక సారి శ్రీ పూర్ణానంద స్వామి వారి సన్నిధి చేరాక, మన జీవితం లో ప్రతి చిన్న విషయంలో ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటూనే,మనల్ని ముక్తి మార్గం వైపు నడిపిస్తారు అనటానికి ఇదొక చిన్న ఉదాహరణ. మేము తమిళనాడు కి బయలుదేరక ముందు, సెప్టెంబర్ నెలలో మా నాన్నగారు కాలం చేశారు. అయితే నెల మాసికం గురించి ఈ యాత్రలో పడి నేను మర్చిపోయాను, నాకు సంబందించిన విషయం నేను మర్చిపోయాను కానీ, శ్రీ స్వామి వారు మాత్రం గుర్తుపెట్టుకొని మరీ నా పై, నా కుటుంబంపై వారి అనుగ్రహ వర్షం కురిపించారు.


ఆ రోజు మధురై లో బయలుదేరిన మేము, మార్గమధ్యలో మరొక రైలు మారి ఒంగోలు చేరుకొని, అటు నుండి శ్రీశైలంకి బస్సులో వచ్చాము. శ్రీ స్వామి వారికి తెలియకుండా తమిళనాడు యాత్ర కు వెళ్లి శ్రీ స్వామి వారి చరిత్ర తెలుసుకోవాలన్న మాతో, శ్రీ స్వామి వారు కూడా తమిళనాడు కి వచ్చి, వారి చరిత్ర మా కళ్లకు కట్టినట్టు చెప్తూ, వారు పుట్టి పెరిగి, తపస్సు గావించిన అన్ని ప్రాంతాలకు వారే మమ్మల్ని స్వయంగా తీసుకువెళ్ళి చూపించారు. ఈ యాత్ర లో మేము సందర్శించిన క్షేత్రాల స్థలపురాణాలు శ్రీ స్వామి వారు మాకు స్వయంగా వివరించారు. ఎందరో మహాత్ముల దర్శన భాగ్యం శ్రీ స్వామి వారి దయ వలన మాకు కలిగింది. అటువంటి మహాత్ములు శ్రీ స్వామి వారికి ఇచ్చిన గౌరవ మర్యాదలు, శ్రీ స్వామి వారు పట్ల వారు కురిపించిన ప్రేమ, వాత్సల్యం చూసి మేము ఎంతో ఆశ్చర్యం చెందాము.


ప్రాప్తం ఉంటే ఏమైనా లభిస్తుంది అని, శ్రీ స్వామి వారు అనుభవపూర్వకంగా మాకు ఎంతో జ్ఞానమిచ్చారు.వాటితో పాటుగా గురుమాతకు సేవ చేసుకునే భాగ్యం, వెలకట్టలేని జ్ఞానసంపదను ఇచ్చే శ్రీ స్వామి వారి గురువులైన శ్రీ రాఖాడీబాబా వారి పాదుకలు శ్రీ స్వామి వారు భక్తకోటికి ప్రాప్తింపచేసారు.

ఉన్న డబ్బు పోగొట్టుకొని తమిళనాడులో అడుగుపెట్టిన మేము ఎటువంటి ఇబ్బంది, ఆటంకం లేకుండా, గురుమాత, పరమ గురు పాదుకలతో శ్రీశైలం చేరుకున్నాము.


గురుమాత పర్వతవర్ధిని గారితో శంకర్ నారాయణన్ గారి కుమారులు

 

********సశేషం********


411 views0 comments

Comments


bottom of page