top of page

|| యతో వాచో నివర్తంతే || - 20

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


శ్రీ పూర్ణానంద స్వామి వారి అనుగ్రహం తో తమిళనాడు యాత్ర పూర్తి చేసుకొని, శ్రీ గురుమాత, పరమ గురువు రాఖాడీ బాబా వారి పాదుకలతో శ్రీశైలం చేరుకున్నాము. శ్రీ స్వామి వారు హఠకేశ్వరం కి చేరగా, నేను మాట ఇచ్చిన విధము గానే గురుమాతను నా స్వగృహానికి తీసుకు వెళ్లాను. శ్రీ ఓంకారానంద స్వామి వారి పాదుకలు కూడా మా ఇంట్లో నే పెట్టమని శ్రీ స్వామి వారు చెప్పటంతో గురుపాదుకలు కూడా మా ఇంట్లోనే కొలువు తీరాయి.


- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

గురుమాత మా కుటుంబంలో ఒక సభ్యురాలిలా ఎంతో నిరాడంబరంగా, సాధారణంగా మెలిగేవారు. వారి పనులు వారు చేసుకోవటమే కాకుండా, అందరికి వండిపెట్టడం వారికి ఎంతో ఇష్టం. అయితే మేము గురుమాతను శ్రీశైలంకి తీస్కొచ్చిన్న కొత్తల్లో వారి ఆరోగ్య పరిస్థితి అసలేమీ బాగోలేదు. వారు అసలు నిద్రపోయేవారు కారు. ఎప్పుడు శ్రీ దుర్గా సప్తశతి పారాయణ,కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. వారి ఆహారపు అలవాట్లు, భాష మాకు తెలియకపోవటం వలన వారికేం కావాలో, ఏం తింటారో తెలుసుకోవటం కొంచం కష్టంగా అనిపించేది. నేత్ర ద్రుష్టి సన్నగిల్లటం, వారు అసలు నిద్రపోకపోవటం నన్ను కొంచెం కలవరపెట్టింది. వారి ఆరోగ్యం కుదుట పడాలి అంటే శ్రీ స్వామివారే పరిష్కారం చూపగలరని నాకు తెలుసు. కానీ వారిని మేము చూసుకుంటామని స్వామి వారికి మాట ఇచ్చాము కదా, ఇప్పుడు వారిని గురుమాత గురించి ఎలా వెళ్లి అడగాలి అని ఆలోచించుకొని, మెల్లిగా హఠకేశ్వరానికి చేరుకున్నాను.


నేను హఠకేశ్వరం వెళ్లిన సమయానికి, ఆశ్రమం శ్రీ స్వామివారు ఒక్కరే ఉన్నారు.నేను వారి వద్దకు నెమ్మది గా వెళ్లి నమస్కారం చేసుకొని, వారిని గురుమాత గురించి ఎలా అడగాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఇందులో శ్రీ స్వామి వారి ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగారు. నేను నెమ్మదిగా," స్వామి మా ఇంట్లో మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు, వారి ఆరోగ్యం మెరుగవ్వటానికి మీరే ఎదైనా పరిష్కారం చెప్పాలి అని అడిగాను. నేను గురుమాతా గురించే అడుగుతున్నాను అని శ్రీ స్వామి వారికి తెలుసు. చిరుమందహాసం తో వారు, “సరే దీనికొక పరిహారమార్గం, ఉంది చెప్తాము” అన్నారు. గురుమాతా ఆర్యోగ పరిస్థితి మెరుగవ్వటానికి కలశ పూజ చేయాలి అని, ఆ పూజకు కావలసిన పూజా సామాగ్రి సాయంత్రానికి తీసుకురమ్మని శ్రీ స్వామి వారు అన్నారు. ఒక మట్టి కుండ, కొన్ని ద్రవ్యాల తో పాటు పూజకు కావలసిన మరికొన్ని సామాన్లు నేను కొనుక్కొని సాయంత్రానికి మళ్లీ శ్రీ స్వామి వారి వద్దకు చేరుకున్నాను. సూర్యాస్తమయ సమయానికి శ్రీ స్వామి వారు కలశ పూజను ఆరంభించారు.అప్పటివరకు కలశ పూజ అంటే ఏంటో నాకు తెలియదు.తెల్లవారేదాకా శ్రీ స్వామి వారు పూజ చేస్తూనే ఉన్నారు. తెల్లవారాక శ్రీ స్వామి వారు నన్ను మా తల్లి గారిని తీసుకు రావలసింది గా చెప్పారు.అప్పటికప్పుడు ప్రాజెక్ట్ కాలనీ కి వెళ్లి, స్నానం చేసి గురుమాతను జీప్ లో హఠకేశ్వరం తీసుకువెళ్లాను.


శ్రీ స్వామి వారు పూజ చేసిన కలస జలం తో గురుమాత కు అభిషేకం చేశారు. ఆ రోజు శ్రీ స్వామి వారు స్వయంగా వంట చేసి, గురుమాతకు భోజనం వారే తినిపించారు.గురుమాత ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అభయమిచ్చి, శ్రీ స్వామి వారు గురుమాతను మళ్ళి నాతో మా కాలనీకి పంపించారు. ఆ రోజు నుండి గురుమాతా ఆరోగ్యం కొంత మెరుగుపడింది. చాల రోజుల తర్వాత ఆ రాత్రి వారు ఎంతో ప్రశాంతంగా నిద్రపోయారు.


ఇది ఇలా ఉండగా శ్రీ స్వామి వారు తమిళనాడులో అన్నట్లు గానే నాకు ప్రమోషన్ వచ్చింది.అయితే స్టేట్ గవర్నమెంట్ లో నాకు ప్రమోషన్ వచ్చే ఆస్కారమే లేదు.పోచంపాడులో సెంట్రల్ గవర్నమెంట్ వారి అద్వర్యం లో ఒక ప్రాజెక్ట్ మొదలయ్యింది.అందులో డివిజినల్ సుపర్వైజర్ గా నాకు ప్రమోషన్ వచ్చింది.ఆలా శ్రీ స్వామి వారు ప్రమోషన్ వస్తుంది అని అన్న మాట ఈ విధంగా నెరవేరింది.కానీ, శ్రీశైలం, శ్రీ స్వామి వారిని,గురుమాతను వదిలి పోచంపాడు వెళ్లటం నాకు ఇష్టం లేకపోవటం తో ప్రమోషన్ ఆర్డర్స్ తీసుకునేందుకు నిరాకరించానుకానీ మా ఆఫీస్ లో నాతో పాటు పనిచేసే సహ ఉద్యోగులు, స్నేహితులు ఆ ప్రమోషన్ తీసుకుంటే భవిష్యత్తు బావుంటుంది అని ఎంతో వారించారు. నేను మాత్రం మొండిగా ప్రమోషన్ తీసుకునేందుకు నిరాకరించాను. అయితే వీరందరూ ఒక గుంపుగా నాకు సమాచారం ఇవ్వకుండా శ్రీ స్వామి వారి వద్దకు వెళ్లి, జరిగిన విషయమంతా శ్రీ స్వామి వారికి చెప్పారు.


ఇదంతా నాకు తెలియకపోవటం వలన, ఎప్పట్లానే, సాయంత్రం శ్రీ స్వామి వారి దర్శనానికి వెళ్లాను.శ్రీ స్వామి వారు కొంచం కోపం గ ఉన్నట్లు నాకు అనిపించి, భయం భయంగా వారిని సమీపించాను. వారు నన్ను, ఇలా ఖాళీగా తిరగకపోతే కొంచం సేపు కూర్చుని జపం చేసుకోవచ్చు కదా అన్నారు.స్వామి వారు ఆ మాట అనగానే, వెంటనే సమీపం లో ఉన్న కోనేరు లో స్నానం చేసి ఒక తుండుగుడ్డ కట్టుకొని, పంచాగ్ని హోమం కోసం మేము నిర్మాణం చేసిన గట్టు మీద కూర్చున్నాను.ఆ రోజు అమావాస్య అవ్వడంతో సూర్యాస్తమయం అయ్యాక అడవి మొత్తం చీకట్లు కమ్ముకున్నాయి. జంతువులేమైనా మీదకొస్తాయేమో అని కొంచం భయపడుతూనే ఆ గట్టు మీద కూర్చున్నాను.ఇప్పుడు జపం చెయ్యాలంటే నాకు ఏ మంత్రము తెలియదు, జంతువులొస్తాయేమో అని భయం మరో వైపు. గట్టి గా కళ్ళు మూసుకొని “గురుబ్రహ్మ” శ్లోకాన్ని గట్టిగా కేకపెట్టాను.అలా అరవటం వల్ల జంతువులు కూడా దగ్గెరికి రావని నా ఆలోచన. ఆ శ్లోకం పూర్తయే సమయానికి శ్రీ స్వామి వారు ఆశ్రమంలో నుండి బైటికి వచ్చి నా వద్దకు వచ్చారు.నేను కళ్ళు తెరిచి శ్రీ స్వామి వారిని చూస్తూ ఉన్నాను.


శ్రీ స్వామి వారు అప్పడూ నాతో "ఇప్పుడు నువ్వేమన్నావు?" అన్నారు.


“శ్లోకం చదివాను స్వామి”, అని మళ్ళి గురుబ్రహ్మ శ్లోకాన్ని చదివాను.


శ్రీ స్వామి వారు ఎంతో అమాయకంగా ఏమి తెలియనట్లు గా, " ఆ శ్లోకానికి అర్థమేంటి”, అని అడిగారు.


నేనేదో పండితుడిలాగ ఆ శ్లోకానికి అర్ధం శ్రీ స్వామి వారితో చెప్పటం మొదలు పెట్టాను.


“గురువే బ్రహ్మ” అని, “గురువే విష్ణు” అని, “గురువే మహేశ్వరుడు” అని అన్నాను.


వెంటనే శ్రీ స్వామి వారు, “మరి ఈ పరబ్రహ్మ ఎవరు?” అని అడిగారు.


నేను కొంతసేపు ఆలోచన చేసి, “మా నాన్న గారు నా చిన్నప్పుడు భాగవతం లో ఒక పద్యం చెప్పారు,

అందులో పరబ్రహ్మ గురించి చెప్పబడింది,


“ఇందు కలడందులేడన్న సందేహము వలదు, చక్రి సర్వోపగతుం డెందెందు వెదికి చూచినా అందందే కలడు”

అంటే పరబ్రహ్మ ఒక చోటే ఉంటాడన్న సందేహమే వద్దు, ఈ సృష్టిలో ప్రతి చోట, ప్రతి వస్తువు, ప్రతి జీవిలో ఉన్నది ఆ పరబ్రహ్మమే, గురువు సాక్షాత్తు అటువంటి పరబ్రహ్మ స్వరూపము స్వామి!”, అన్నాను.


దానికి శ్రీ స్వామి వారు,

“ఓహో! అయితే అన్ని చోట్లా, అందరిలో, అన్ని రూపాలలో, ఈ శ్రీశైలంలో ఉన్న నీ గురువు పోచంపాడు లో ఉండరా?”

, అని నన్ను సూటిగా ప్రశ్నించారు.


ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు! శ్రీ స్వామి వారికి ఎక్కడ దూరమవుతానో అనే బెంగతో నేను ప్రమోషన్ తీసుకోలేదన్న విషయం శ్రీ స్వామి వారు గ్రహించి, నన్ను మాయలో పెట్టి, గురువు సర్వాంతర్యామి అని నా నోటి తోనే చెప్పించారు.


నేను మళ్ళి మాట్లాడేలోపల వారు,”Get out!”,అని అరిచారు. వెంటనే అక్కడ నుండి లేచి పరుగు మీద హఠకేశ్వర స్వామి దేవాలయం వద్దకు చేరుకున్నాను. శ్రీ స్వామి వారు ఇంత చెప్పాక కూడా నేను ప్రమోషన్ తీసుకోకపోతే, వారు ఇంకా ఊరుకోరు అని అర్ధమయ్యి, మరుసటి రోజునే ప్రమోషన్ ఆర్డర్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి డెప్యూటయ్యేందుకు అంగీకారం తెలిపాను.


1969,ఏప్రిల్ నెలలో నేను మొదటి సారి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నాను.వారి సన్నిధిలో కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది.అప్పటిదాకా గురువు, గురుమహత్యం, గురుసన్నిధి వంటి విషయాలపై అవగాహన లేని నాకు, నా తల్లితండ్రులు పుణ్యఫలం చేతనో, నా పూర్వ జన్మ సుకృతం వలనో శ్రీ స్వామి వారి సన్నిధి లో, ఆ సంవత్సరమంతా విలువకట్టలేని అనుభూతులు, అనుభవజ్ఞానంతో పాటు శ్రీ స్వామి వారి దయతో ఎందరో మహాత్ములను కూడా దర్శించుకున్నాను. శ్రీ స్వామివారి సన్నిధి, సేవా భాగ్యం వలన నాకు ప్రమోషన్ రావటమే కాకుండా, మా తండ్రి గారికి శ్రీ స్వామి వారు ముక్తిని ప్రసాదించారు. గురుపాదుకలు, గురుమాతా రాకతో మొదలైన 1970వ సంవత్సరము నన్ను శ్రీశైలంకు దూరం చేసి, పోచంపాడుకు దగ్గెర చేయబోతుంది.


శ్రీ స్వామి వారి తో బి రాధా కృష్ణ మూర్తి గారు
 

********సశేషం********

578 views1 comment

1 comentário


Swamiji Charitra entha chadivina inka chadavali anipistundi, oka post ending ki raagane abba appude aypoyinda inka konchem unte bagundu anipistundi.

Curtir
bottom of page