top of page

|| యతో వాచో నివర్తంతే || - 21

Writer's picture: Sriswamypoornananda.orgSriswamypoornananda.org

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ

శ్రీ పూర్ణానంద స్వామి వారి సన్నిధి ప్రాప్తించటమనేది సామాన్యమైన విషయం కాదు.శ్రీ స్వామి వారి అనుగ్రహం,ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శ్రీ స్వామి వారి సన్నిధికి మనం చేరుకోలేము.అవన్నీ ఉన్నప్పటికీ, వారిని దర్శన భాగ్యం కలగాలన్నా, వారు మనపై అనుగ్రహం కురిపించాలన్న, అందుకు ఒక బలమైన కారణమే కావలి! శ్రీ స్వామి వారి సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మొదటి దర్శనం వెనక ఎంతో కొంత ఆసక్తికరమైన కథ, కారణం ఉంటుంది. శ్రీ స్వామివారికి అత్యంత సన్నిహితంగా శిష్యులలో ఒకరైన శ్రీ కే.బి.వి.జి కృష్ణ మూర్తి గారు(కే బి వి జి) కూడా అటు వంటి ఒక బలమైన కారణం వల్లనే మొదటిసారిగా శ్రీ స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

నేను శ్రీశైలం ప్రాజెక్ట్ లో చేరకముందు, మా సొంత ఊరైన గుంటూరు లో ఉన్న రోజుల నుండే కే.బి.వి.జి కృష్ణ మూర్తిగారి తో నాకు పరిచయం ఉంది. మా ఇద్దరి స్నేహం ఎంతో ప్రత్యేకమైనది.ఒక స్నేహితుడి కన్నా కూడా ఆయన మా ఇంట్లో వ్యక్తి అని చెప్పొచ్చు నేను ఉద్యోగం లో చేరకముందు నాకు షార్ట్ హ్యాండ్, టైపు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు నాకు కే.బి.వి.జి గారు ఎంతో సహాయం చేసారు. అయితే వృత్తి రీత్యా నేను శ్రీశైలంకి వచ్చేయగా, ఆయన హైదరాబాద్ BHELకి వెళ్ళిపోయారు.మేము ఎంత దూరంగా ఉన్నా కష్టసుఖాలలో ఒకరికొరకం అండగా ఉండేవాళ్ళము. BHEL లో పెద్ద ఉద్యోగం లో ఉన్న కే.బి.వి.జి గారికి 1969వ సంవత్సరం లో అనుకోకుండా ఒక పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యులు కూడా వారికి కొన్ని నెలల ఆయుర్దానమే మిగిలి ఉందని తేల్చి చెప్పేశారు. ఆయనకు అప్పటికే వివాహమయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఉన్న పరిస్థితిని వివరిస్తూ కే.బి.వి.జి గారు నిస్సహాయ స్థితిలో నాకొక ఉత్తరం రాశారు. అప్పటికే నేను శ్రీ స్వామి వారి దర్శనం చేసుకున్నాను. కే.బి.వి.జి గారి పరిస్థితి గురించి శ్రీ స్వామి వారికి చెప్పగా, శ్రీ స్వామిగారు నన్ను హైదరాబాద్ కి వెళ్లి కే.బి.వి.జి గారిని హఠకేశ్వరంకి తీసుకురమ్మని చెప్పారు.నేను హైదరాబాద్ వెళ్ళిన సమయానికి అక్కడ తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉండటం వలన హైదరాబాద్ అంతా గొడవలుగా ఉంది. వాటన్నిటి మధ్యలో శ్రీ స్వామి వారిని తలుచుకుంటూ ఒక పెద్ద సాహసమే చేసి, నేను కే.బి.వి.జి గారు క్షేమంగా హఠకేశ్వరానికి చేరుకున్నాము. శ్రీ స్వామి వారు ఏ క్షణమైనా కే.బి.వి.జి గారిని పిలుస్తారు అని, ఆయన్ని హఠకేశ్వర స్వామి దేవాలయంలో పెట్టి నేను మా ఇంటికి వెళ్లాను. అలా మూడు రోజుల పాటు కే.బి.వి.జిగారు హఠకేశ్వర స్వామి దేవాలయంలోనే ఉన్నారు కానీ, శ్రీ స్వామి వారి నుండి ఇంకా పిలుపు రాలేదు. కొంత నిస్పృహకు లోనైనా కే బి వి జి గారు, శ్రీ స్వామి వారి దర్శనం ఇచ్చేందుకు సుముఖంగా లేరనుకొని మరుసటి రోజు హైదరాబాద్ కి తిరుగు పయనమయ్యేందుకు నిర్ణయించుకున్నారు. మూడో రోజు సాయంత్రం కే.బి.వి.జి గారిని తీసుకురమ్మని శ్రీ స్వామి వారు నాకు కబురు చేశారు. సూర్యాస్తమయ సమయంలో కే.బి.వి.జిగారు శ్రీ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. శ్రీ స్వామి వారు కే.బి.వి.జి గారికి కొన్ని వేపాకులు ఇచ్చి, అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ వాటిని తినమని చెప్పారు. శ్రీ స్వామి వారు చెప్పిన విధముగానే కే.బి.వి.జి గారు చేశారు. ఆరోగ్యం కుదుట పడుతుంది అని, ధైర్యంగా ఉండమని శ్రీ స్వామి వారు కే.బి.వి.జిగారికి అభయమిచ్చారు.


శ్రీ స్వామి వారు అభయమిచ్చిన విధముగానే, కే.బి.వి.జి గారు హైదరాబాద్ కి తిరిగి వెళ్ళిన కొన్నాళ్లకే ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది అని, శ్రీ స్వామి వారి అనుగ్రహం వల్లనే తనకు పునర్జన్మ లభించింది అని, ఈ జీవితమంతా శ్రీ స్వామి వారి సేవలో గడపాలనుకుంటున్నాను అని కే.బి.వి.జి గారు నెల తర్వాత నాకు ఉత్తరం రాసారు. అలా శ్రీ స్వామి వారి మీద కే.బి.వి.జి గారికి పరిపూర్ణమైన విశ్వాసం కలిగింది. అదే సమయంలో నేను శ్రీ స్వామి వారితో తమిళనాడు యాత్రకు వెళ్ళటం, గురుమాత, గురుపాదుకలతో తిరిగి శ్రీశైలం రావటం, నాకు ప్రమోషన్ రావటం జరిగింది.


శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆజ్ఞ తో నేను ప్రమోషన్ తీసుకొని పోచంపాడుకి బయలుదేరేందుకు సిద్ధమయ్యాను. ఇది ఇలా ఉండగా శ్రీ స్వామి వారితో పాటు హఠకేశ్వరంలో ఉంటున్న రమణ బాబా కొంత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో శ్రీ స్వామి వారు రమణ బాబాకి ఎన్నో సపరియలు చేసారు. వారికి సత్వరంగా శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని శ్రీ స్వామి వారు నన్ను ఆదేశించారు. BHELలో నా స్నేహితుడు శ్రీ కే.బి.వి.జి కృష్ణ మూర్తి గారు ఉద్యోగం చేస్తుండటంతో, సహాయంగా వారు ఉంటారు కదా అని రమణ బాబాను హైదరాబాద్ కు తీసుకువెళ్లేందుకు నిర్ణయించుకున్నాను. అందుకు శ్రీ స్వామి వారు కూడా అంగీకరించి, రమణ బాబాని కారులో హైదరాబాద్ కి తీసుకువెళ్ళమని నాతో అన్నారు.అయితే గురుమాత నేత్ర ద్రుష్టి సమస్యకి కూడా హైదరాబాద్లో కంటి ఆసుపత్రిలో చూపిద్దాము అని కే.బి.వి.జి గారు నాతో అనటంతో శ్రీ స్వామివారి అనుమతితో గురుమాత, రమణ బాబాను తీసుకొని నేను హైదరాబాద్ BHEL లో ఉంటున్నకే.బి.వి.జి గారి ఇంటికి చేరుకున్నాను.


రమణ బాబా గారికి అక్కడొక ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగింది.కే.బి.వి.జిగారు రమణ బాబా గారితోనే ఉంటూ వారికి సపరియాలు చేసారు.నేను ఈ లోపల పోచంపాడు వెళ్లి జాయినింగ్ ఆర్డర్స్ మీద సంతకం చేసి, శ్రీ స్వామి వారిని దర్శించుకునేందుకు మళ్ళా హఠకేశ్వరం వెళ్లాను.గురుమాత శ్రీ స్వామి వారు ఉంటేనే కాంతి వైద్యుడి దగ్గెరికి వస్తాను అని షరతు పెట్టడంతో, శ్రీ స్వామి వారు కూడా నాతో కలిసి హఠకేశ్వరం నుండి హైదేరాబద్ కి వచ్చారు. ముషీరాబాద్ లో అప్పట్లో వెంపటి సూర్య నారాయణ గారు అని ఒక వైద్యులు ఉండేవారు. వారు నెలలో సొగం రోజులు తెనాలి లో, మరో సొగం రోజులు ముషీరాబాద్ లో ఉండేవారు. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో వారు ఎంతో పేరున్న కంటి వైద్యులు. వారి వద్దకు గురుమాతను తీసుకుని నేను, శ్రీ స్వామి వారు, కే.బి.వి.జి గారు వెళ్ళాము. ఆ వైద్యులు శ్రీ స్వామి వారి దర్శన భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషించారు.గురుమాతకు వారు రెండు శస్త్ర చికిత్సలు చేశారు. చికిత్స పూర్తి అయ్యాక గురుమాత, శ్రీ స్వామి వారు, రమణ బాబా వారు కే.బి.వి.జి గారి ఇంట్లోనే ఉన్నారు. రమణ బాబా గారిని మద్రాసు వెళ్లి వారి అమ్మ గారిని కలిసి వారికి నమస్కారం చేసుకొని రమ్మని శ్రీ స్వామి వారు వారిని పంపించేశారు. పరిస్థుతులు అన్ని కుదుట పడటంతో నేను కూడా నెమ్మదిగా పోచంపాడుకు పయనమయ్యాను.శ్రీ స్వామి వారు, గురుమాత BHELలో కే.బి.వి.జి గారి ఇంట్లో ఉన్నారు. కే.బి.వి.జి గారికి అక్కడ స్నేహితుల పరివారం చాలా ఎక్కువ.అలా ఆ సమయంలో కే.బి.వి.జి గారి ఇంట్లో చాలా మంది హైదరాబాద్ వాసులు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. రామ్ మోహన్ రావు గారు, సీతా రామ రాజు గారు వంటి కొందరు ముఖ్యమైన భక్తులు కూడా అదే సంవత్సరంలో కే.బి.వి.జి గారి ఇంట్లో మొదటి సారిగా శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. నేను పోచంపాడులో ఉన్నప్పటికి, నా మనసంతా శ్రీ స్వామివారి మీదనే ఉండేది. శ్రీ స్వామి వారిని స్మరించుకుంటూ, వీలున్నప్పుడు హైదరాబాద్ వెళ్లి శ్రీ స్వామివారిని,గురుమాతని దర్శించుకుంటూ ఉండేవాడిని.


శ్రీ స్వామి వారితో కే.బి.వి.జి గారి కుటుంబం, బి.ర్.కే గారు, 1970
 

********సశేషం********

462 views0 comments

Recent Posts

See All

コメント


bottom of page