top of page
Writer's pictureSriswamypoornananda.org

|| యతో వాచో నివర్తంతే || - 22

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


శ్రీ పూర్ణానంద స్వామి వారి దయ వలన గురుమాత ఆరోగ్యం కుదుట పడటంతో పాటు,వారి నేత్ర ద్రుష్టి కూడా బావుండటంతో గురుమాత వారి పనులు వారు చేసుకోకలిగే స్థితికి వచ్చారు. శ్రీ స్వామి వారు కూడా గురుమాతతో కలిసి BHELలో నా స్నేహితుడు శ్రీ కే.బి.వి.జి కృష్ణ మూర్తి గారి ఇంట్లో నివాసితులై ఉన్నారు. BHELలో శ్రీ స్వామి వారిని దర్శించుకున్న వారెందరో శ్రీ స్వామి వారికి భక్తులయ్యారు. నేను నిజామాబాదు సమీపం లో ఉన్న పోచంపాడు ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాను. గోదావరి నది పై కట్టబడిన ఈ ప్రాజెక్టు అప్పట్లో నిర్మాణ దశలో ఉంది.శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలానే, పోచంపాడులో కూడా ప్రాజెక్ట్ లో పని చేసే వాళ్ళ కోసం ఒక కాలనీని ఏర్పాటు చేశారు. గోదావరి నది తీరానికి సమీపాన ఉన్న ఈ కాలనీలో కూడా ఒక రామాలయం ఉంది. శ్రీ స్వామి వారిని స్మరించుకుంటూ, వీలున్నప్పుడల్లా హైదరాబాద్ వెళ్లి శ్రీ స్వామి వారి దర్శనం చేసుకుంటూ నేను నా జీవితాన్ని గడుపుతున్నాను.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

పోచంపాడులో మా ఎదురు ఇంట్లో సుబ్బారావు గారు అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు. వారికి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. వారు ఒక రోజు మా ఇంటికి వచ్చి, నాకు రుద్రంతో పాటు పంచ సూక్తాలు నేర్పిస్తాను అని అన్నారు. మొదట నేను అంత ఆసక్తి కనపరచకపోయినా,తర్వాత వారి మాటను కాదనటం ఎందుకు అని వారి వద్ద పంచసూక్తాలు, రుద్రాభిషేకం వంటివి నేర్చుకున్నాను. సుబ్బారావుగారి తండ్రి గారు గొప్ప శైవోపాసకులు. వారి పేరు గోపాల రావు గారు. నేను సుబ్బారావు గారి వద్ద పంచసూక్తాలు నేర్చుకుంటున్నా సమయంలో, గోపాలరావుగారు పోచంపాడు కి వచ్చారు. వారు నిత్యం అనుష్ఠానం చేసే శివలింగానికి మహాలింగార్చన చేస్తే బావుంటుంది అని మాతో అన్నారు.అయితే ఆ కార్యక్రమం వాళ్ళ ఇంట్లో చేసేందుకు వెసులుబాటుగా లేకపోవటం చేత, మా ఇంట్లోనే ఆ కార్యక్రమం చేద్దామని నన్ను కోరారు. నాకు కూడా అందుకు ఎంతో సంతోషం అనిపించి, మా ఇంట్లో ఒక గది లో మహాలింగార్చనకి ఏర్పాట్లు చేసాను. అలా ఆ మహాలింగార్చన చాల కాలం ఆ గదిలో జరిగింది. ఆ కార్యక్రమం పూర్తి అయిన కొన్నాళ్లకి, ఒక రోజు నేను మా ఆఫీస్లో ఉన్న సమయం లో, మా ఆఫీస్ ముందు ఒక జీప్ వచ్చి ఆగింది. శ్రీ స్వామివారితో పాటు, గురుమాత ఆ జీప్ లో నుండి దిగారు. వారిని చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే వారిని మా ఇంటికి తీసుకు వెళ్లి, వారికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసాను. మేము మహాలింగార్చన చేసిన గదిలోనే శ్రీ స్వామి వారు గురుమాత నివాసితులయ్యారు.


పోచంపాడు ప్రాజెక్ట్ కాలనీలో ఇలా ఒక కాషాయధారి, జటాధారి ఉన్నారని తెలుసుకొని చాలా మంది శ్రీ స్వామి వారి దర్శనార్ధం మా ఇంటికి వచ్చారు.అలా వచ్చిన వారిలో కొందరు శ్రీ స్వామి వారికి సన్నిహిత భక్తులు కూడా అయ్యారు.అటు వంటి వారిలో శ్రీ కిషన్ రావు గారు, శ్రీ కే.వి.జి కృష్ణ మూర్తి గార్ల కుటుంబాలు ఉన్నాయి. మా ఆఫీస్ లో పనిచేసేవారెందరో ఆ విధముగా మా ఇంట్లో శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. మా ఆఫీస్ లో శ్రీ బాగయ్యగారు అని డివిజినల్ కోర్సు ఆఫీసర్ పని చేస్తూ ఉండేవారు.వారు శ్రీ మెహెర్ బాబా వారి భక్తులు. శ్రీ స్వామి వారి గురించి విని, వారిని దర్శించుకునేందుకు బాగయ్య గారు మా ఇంటికి వచ్చారు. వారికి శ్రీ స్వామి వారు శ్రీ మెహర్ బాబా వారిలా దర్శనం ఇచ్చారు. శ్రీ స్వామి వారిలో శ్రీ మెహెర్ బాబాను దర్శించుకున్న బాగయ్యగారు ఆ రోజు శ్రీ స్వామి వారి పాదాలను పట్టుకొని ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.


శ్రీ స్వామి వారికి, గురుమాతకు రుచికరమైన తమిళ వంటలు వండటం మాకు కొంచం కష్టముగా అనిపించేది. శ్రీ స్వామి వారికి గురుమాతకు, శుచిగా, రుచిగా వంట చేసేందుకు ఎవరైనా తమిళనాడు వాళ్ళని పిలిపిస్తే బావుంటుంది అని నేను ఆలోచన చేసాను. శ్రీ స్వామివారితో నేను తమిళనాడు యాత్రకు వెళ్లిన సమయంలో, కల్లిడైకురిచ్చిలో శ్రీ స్వామి వారి చిన్ననాటి స్నేహితులలో ఒకరిని కలిసిన విషయం నాకు గుర్తొచ్చింది. వారికి శ్రీ స్వామి వారు అంటే ఎనలేని ప్రేమ, గౌరవం కూడా! వారిని పోచంపాడుకి పిలిపిస్తే బావుంటుంది కదా అని, నేను శ్రీ స్వామి వారికి విన్నవించుకున్నాను.శ్రీ స్వామి వారు కూడా అందుకు అంగీకారం తెలిపారు. వెంటనే కల్లిడైకురిచ్చి నుండి శ్రీ స్వామి వారి చిన్ననాటి స్నేహితుడిని పోచంపాడుకు వచ్చి శ్రీ స్వామి వారికి సేవ చేసుకుంటే బావుంటుంది అని అడగగా, అందుకు వారు కూడా సంతోషంగా అంగీకారం తెలిపి వెంటనే పోచంపాడుకి చేరుకున్నారు. అలా ఆ రోజు శ్రీ స్వామి వారి సేవకై పోచంపాడు వచ్చిన వారు మనందరికీ సుపరిచితులైన శ్రీ కృష్ణ శంకర్ గారు. కృష్ణ శంకర్ గారు శ్రీ స్వామి వారికి, గురుమాతకు భోజన ఏర్పాట్లను చూసుకుంటూ చాలా తక్కువ సమయంలోనే మా అందరిలో ఒకరిలా కలిసిపోయారు.


శ్రీ స్వామి వారిని ఒకసారి దర్శించుకున్నాక, వారిని మళ్ళి మళ్ళి చూడాలనే భావన అందరికీ కలిగేది. అలా పోచంపాడు కాలనీ వాసులు తరచూ శ్రీ స్వామి వారిని దర్శించుకునేందుకు మా ఇంటికి వస్తూ ఉండేవారు. వీరు కాకుండా, హఠకేశ్వరంలో శ్రీ స్వామి వారిని దర్శించుకున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ వాసులు, BHELలో కే.బి.వి.జి గారి ఇంట్లో శ్రీ స్వామి వారిని దర్శించుకున్న వారు కూడా శ్రీ స్వామి వారి దర్శనార్ధం పోచంపాడుకు వస్తూ ఉండేవారు. ఒక రోజు హైదరాబాద్ నుండి నా స్నేహితుడు కే.బి.వి.జి పోచంపాడులో నా ఆఫీస్ కి వచ్చారు. చేసే ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను అని, తనకు పునర్జన్మను ఇచ్చిన శ్రీ స్వామి వారి సేవలోనే తన జీవితమంతా గడిపేందుకు నిశ్చయించుకున్నట్టు నాతో అన్నారు. ఆ మాటలు విని నేనెంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎందుకంటే వారిది BHELలో ఎంతో పెద్ద ఉద్యోగం.పైగా వారికి అప్పటికే పెళ్ళయ్యి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.ఉద్యోగం లేకపోతే ఆర్ధికంగా వారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అటువంటి పరిస్థితిలో, శ్రీ స్వామి వారిపై పరిపూర్ణమైన విశ్వాసంతో, రేపటి గురించి ఎటువంటి భయం,సంకోచం లేకుండా, బంగారం లాంటి ఉద్యోగం వదులుకొని, అటువంటి నిర్ణయం తీసుకోవటం అందరికి సాధ్యపడదు. కే.బి.వి.జిగారికి ఆ విధముగా ఎంతో తక్కువ సమయంలోనే శ్రీ స్వామివారి అనుగ్రహం లభించింది.


1969 ఏప్రిల్ నెల నుండి కాల ప్రవాహం మా అందరి జీవితాలను మార్చేసింది.శ్రీ స్వామి వారి భక్త పరివారం చూస్తుండగానే రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఒక సంవత్సర కాలంలోనే శ్రీ స్వామివారి చరణ సన్నిధికి ఎన్నో కుటుంబాలు వచ్చాయి.అలా ఎందరో భక్తుల దివ్య అనుభవాలు నేను దగ్గర నుండి చూసాను.శ్రీ స్వామివారి దివ్య మంగళ స్వరూపం,వారి చరిత్ర, వారి చుట్టూ పెరుగుతున్న పరివారం చూస్తుంటే, వీరు ఏదో గొప్ప కార్యసాధనకు వచ్చిన అవతార పురుషులు అని మా అందరికీ అనిపించింది.


పోచంపాడులో శ్రీ స్వామివారితో కొందరు భక్తులు. 1970.
 

********సశేషం********


509 views1 comment

1 Comment


Sai Mahesh
Jun 29, 2020

Yatho Vachoo Nivarthante-23 va baagam eppudu vastundi admin gaaru?

Like
bottom of page