top of page

|| యతో వాచో నివర్తంతే || - 23

Writer's picture: Sriswamypoornananda.orgSriswamypoornananda.org

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


గోదావరి నది తీరాన ఉన్న పోచంపాడు ప్రాజెక్ట్ కాలనీలో శ్రీ పూర్ణానంద స్వామి వారు, గురుమాతతో పాటుగా మా ఇంట్లో నివాసితులయ్యారు. శ్రీ స్వామి వారికి చాల తక్కువ సమయంలోనే సన్నిహిత శిష్యుడిగా మారిన నా స్నేహితుడు కె బి వి జి కృష్ణ మూర్తి గారు కూడా వారి ఉద్యోగాన్ని వదిలేసి శ్రీ స్వామి వారిని సేవించుకునేందుకు పోచంపాడు ప్రాజెక్ట్ కాలనీకి చేరుకున్నారు. శ్రీ స్వామి వారు, గురుమాతకి సుచిగా, రుచిగా వంట చేసిపెడతారనే ఉద్దేశంతో శ్రీ స్వామి వారి చిన్ననాటి స్నేహితులు శ్రీ కృష్ణ శంకర్ గారిని కూడా పోచంపాడుకి పిలిపించటం జరిగింది. పోచంపాడులో కూడా శ్రీ స్వామి వారికి భక్తబృందం తక్కువ వ్యవధిలోనే ఏర్పడింది. రోజూ రాత్రి శ్రీ స్వామి వారు ప్రాజెక్ట్ కాలనీ నుండి నది తీరం వెంట నడుచుకుంటూ వెళ్లేవారు. మా ప్రాజెక్ట్ కాలనీ గోదావరి తీరానికి సమీపాన ఉండటం వలన, సూర్యాస్తమయమయ్యేసరికి అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండేది. అటువంటి వాతావరణంలో శ్రీ స్వామి వారు రాత్రులు గోదావరి తీరాన సంచారానికి వెళ్లి వచ్చేవారు. తీరానికి సమీపంలో ఉన్న ఒక మహా వృక్షం కింద శ్రీ స్వామి వారు ఆసీనులయ్యేవారు. ఒక్కోసారి వారి వెంట మమ్మల్ని కూడా తీసుకువెళ్ళేవారు.


- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

అలా ఒక పౌర్ణమి రాత్రి శ్రీ స్వామివారు వారితో పాటు కొంతమందిని ఆ మహా వృక్షం వద్దకు తీసుకువెళ్లారు. గోదావరి తీరాన, ఆ పౌర్ణమి రాత్రి, శ్రీ స్వామి వారి సన్నిధి లో మేము పొందిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. “పౌర్ణమి రాత్రి శ్రీసూక్త పఠనం ఎంతో విశేషం”, అని శ్రీ స్వామి వారు అనటంతో నేను శ్రీసూక్త పఠనం మొదలుపెట్టాను. అలా శ్రీ స్వామి వారి సన్నిధి లో వారిని చూస్తూ, శ్రీసూక్త పఠనం చేస్తూ ఉండటంతో నాకు సమయం తెలియలేదు. కొద్ది సేపటికి మా అందరిమీద ఏదో పూల వర్షం కురిసినట్టుగా చిరుజల్లు కురిసింది. ఆశ్చర్యం ఏమిటంటే, శ్రీ స్వామి వారు, మేము అంత కూర్చున్న ఆ మహా వృక్షం దాటి ఆ చుట్టుపక్కల ఎక్కడా ఒక్క చినుకు కూడా కురవలేదు. ఆ చిరుజల్లు ఆ మహా వృక్షం నుండి కురిసిందేమో అనే భావన మా అందరికీ కలిగింది. ఇటువంటి మహిమను చేసిన మహిమాన్వితులైన శ్రీ స్వామి వారు మాత్రం అమాయకంగా వారికేమి తెలియదు అన్నట్లుగా చిరునవ్వు తో మా వైపు చూసారు. శ్రీ స్వామి వారు శ్రీసూక్తం గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు.

“శ్రీ సూక్తమేకమేకంతే సర్వాభీష్టం ప్రయచ్ఛతి”

, అని శ్రీ స్వామి వారు ఎప్పుడూ చెప్పేవారు.


శ్రీ స్వామివారు ఏకాంత ప్రియులు అవ్వటం వలన, సంసారిని అయిన నా నివాసమున ఉండేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారేమో అనే భావన నాకు కలిగింది. శ్రీ స్వామి వారు ఏకాంతంగా సమయం గడిపేందుకు, వారి కొరకు ఒక చిన్న ఆశ్రమం లాంటిది ఏర్పాటు చేయకలిగితే బావుంటుంది కదా అని అనుకున్నాను. మా ప్రాజెక్ట్ లో నా పై ఆఫీసర్లకు కూడా శ్రీ స్వామి వారి దర్శన భాగ్యం కలగటం వలన, నా ఆలోచన కార్య రూపం దాల్చడం సులభమయ్యింది. మా పై ఆఫీసర్ తో మాట్లాడి, శ్రీ స్వామి వారి చిన్ననాటి స్నేహితులైన కృష్ణ శంకర్ గారి పేరు మీద కొంత స్థలం మంజూరు చేయించాను. అక్కడ పని చేసే కాంట్రాక్టర్లు, కొందరు భక్తుల సహకారంతో శ్రీ స్వామి వారి కొరకు ఒక చిన్న ఆశ్రమ నిర్మాణం జరిగింది. ఆ ఆశ్రమం లో గృహ ప్రవేశం, గురు ప్రవేశం మేళ తాళాలతో, వేద పఠనంతో అంగరంగ వైభవంగా జరిగింది. పోచంపాడు భక్త బృందంతో పాటుగా, శ్రీశైలం నుండి, హైదరాబాద్ నుండి శ్రీ స్వామి వారి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ స్వామి వారితో పాటుగా, గురుమాత, కృష్ణ శంకర్ గారు ఆ ఆశ్రమంలో నివాసితులయ్యారు. నా స్నేహితుడు కే బి వ్ జి కృష్ణ మూర్తి గారు కూడా హైదరాబాద్ లో కొన్ని రోజులు, శ్రీ స్వామి వారి సేవలో కొన్ని రోజులు గడుపుతూ ఆశ్రమానికి తరచూ వచ్చి వెళుతూ ఉండేవారు.


హఠకేశ్వరంలో ఉన్న రోజుల్లో ఒకరోజు శ్రీ స్వామివారు మాతో కొంచం చనువుగా ఉన్న సమయంలో మేము, "స్వామీ ఈ మంత్రాలు, తంత్రాలు మాకు ఏమీ రావు.అయితే తొందరగా కార్యసిద్ధి జరిగే మార్గం ఏదైనా ఉందా?" అని అడిగాము. దానికి స్వామివారు, "దీనికి అగస్త్య మహర్షి ఇచ్చిన శాస్త్రం ఉందిరా.", అన్నారు. అక్కడే ఉన్న కే బి వ్ జి కృష్ణ మూర్తి గారు స్వామివారిని వివరములు అడగసాగారు. శ్రీ స్వామివారు కొన్ని శ్లోకాలు చెప్పారప్పుడు. మాకు అవి అర్థం కాలేదు. శ్రీ స్వామివారు దాని గురించి వివరిస్తూ, "అది ఒక యంత్రం. భువనేశ్వరీ కక్ష్యపుటికి సంబంధించినది. చిన్నప్పుడు మా నాన్న గారు మాకు ఆ విద్యను అనుగ్రహించారు. అది మేము మనస్సులో పదిలం చేసుకున్నాము." అని చెప్పారు. ” ఆ యంత్రం వేయటం ఎలాగా?”, అని మేము అనుకుంటున్న సమయంలో శ్రీ స్వామివారు ఆ యంత్రాన్ని కాగితం మీద వేశారు. అయితే కాగితం మీద ఉన్న ఈ యంత్రం ఒక రాగి రేకు మీద వేస్తే శక్తివంతంగా ఉంటుంది అని శ్రీ స్వామి వారు మాతో అన్నారు. ఈ విషయం పోచంపాడులో అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్న నారాయణరావు గారికి మేము చెప్పాము. ఆయన అప్పుడు ఒక మంచి రాగి రేకు సంపాదించారు.


రాగి రేకు సంపాదించాము కానీ, ఈ యంత్రం ఇప్పుడు రాగి రేకు మీద ఎవరు వేస్తారు? అని నా మనసులో ఒక ప్రశ్న మొదలయ్యింది. అప్పుడు ఈ నారాయణ రావు గారు రాగి రేకు మీద గీయటానికి ఎంగ్రేవర్స్ ఉంటారు అని మాతో చెప్పి, ఆ ఎంగ్రేవర్స్ ని కూడా ఆయనే పిలిపించారు. వచ్చిన ఎంగ్రేవర్స్ కాగితం మీద గీసి ఉన్న యంత్రం చూసి, ఇది రాగి రేకు మీద గీయటం మాకు సాధ్యపడదు, ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే వారు ఇంగ్రేవ్ చేయటానికి వాడే ఎలక్ట్రిక్ పెన్ మేము వారి వద్ద నుండి కొని పెట్టుకున్నాము.


కొంతకాలానికి ఆ రాగి రేకు ఆశ్రమం లో ఒక మూలకు చేరుకుంది, ఆ యంత్రం గురించి మేమందరం మరిచిపోయాము. కొన్ని నెలలు గడిచాక, ఒక రోజు తెల్లవారే సమయానికి నేను శ్రీ స్వామి వారి దర్శనం చేసుకునేందుకు ఆశ్రమానికి వెళ్లాను. అదే సమయానికి అక్కడికి ఒక 5 ఏళ్ళ పాప వచ్చింది. ఆ పాప ఎవరో మాకు తెలియదు. ఆ కాలనీ లో మేము ఎప్పుడు ఆ పాపని చూడలేదు. ఆ పాప శ్రీ స్వామి వారి వద్దనే కూర్చొని దిక్కులు చూస్తూ, అక్కడ మూలన పెట్టి ఉన్న రాగి రేకుని చూపిస్తూ, ”అదేంటి?”, అని అడిగింది. వెంటనే శ్రీ స్వామి వారు ఆ పాపని, “ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి?” అని అడిగారు. చిరునవ్వుతో ఆ పాప, “నా పేరు భువనేశ్వరి.”, అని బదులిచ్చింది. ఆ రాగి రేకుని చూపిస్తూ శ్రీ స్వామి వారు, “అక్కడ నీ బొమ్మ వేస్తాను, ఉంటావా?”, అని అడిగారు. ఆ పాప ఎంతో హుషారుగా, “వెయ్యండి చూస్తాను!” అంది. ఇంతలో ఆ పాప తల్లి తండ్రులు వెతుక్కుంటూ వచ్చి ఆ పాపని అక్కడ నుండి తీసుకువెళ్లారు.


వెంటనే శ్రీ స్వామి వారు నన్ను ఎంగ్రేవర్స్ వద్ద కొన్న పెన్ తీసుకురమ్మని చెప్పారు. ఇంక సమయం వృధా కానివ్వకుండా శ్రీ స్వామి వారు ఆ రాగి రేకుపై భువనేశ్వరీ యంత్రాన్ని గీయటం ఆరంభించారు. ఆ మహత్కార్యానికి మా కాలనీలో నివాసముంటున్న శ్రీ స్వామి వారి భక్తులైన గీతా మాత-కిషన్ రావు దంపతుల ఇంటిని శ్రీ స్వామి వారు ఎంచుకున్నారు. ఆ యంత్రం గీసే సమయంలో మాత-కిషన్ రావు వారి ఇంట్లో ఎన్నో అద్భుత సంఘటనలు చోటు చేసుకున్నాయి. యంత్రం పూర్తయ్యే సమయానికి శ్రీ స్వామి వారి కళ్లలో నెత్తురు గడ్డలొచ్చాయన్నంతగా ఎర్రబడ్డాయి. అప్పటి నుండి శ్రీ స్వామి వారు, ఎవరికి ఏ కష్టం వచ్చిన, కోరిక ఉన్నా, బాబా పాదుకల వద్ద, భువనేశ్వరి అమ్మ వారి యంత్రం వద్ద చెప్పుకోమనేవారు.

అలా సాక్షాత్తు శ్రీ పూర్ణానంద స్వామి వారి స్వహస్తాలతో గీయబడ్డ ఆ మహా యంత్రం, నిస్సందేహముగా సాక్షాత్తు అనంతకోటి బ్రహ్మాండాలను పాలించే జగన్మాత శ్రీ భువనేశ్వరి స్వరూపమే. ఇప్పుడు సున్నిపెంటలో శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశ్రమంలో, బాబా హాలులో బాబా పాదుకలతో పాటుగా, యంత్ర రూపములో ఉన్న భువనేశ్వరి అమ్మవారు కొలువుతీరారు.

పోచంపాడు ఆశ్రమంలో శ్రీ స్వామి వారు


శ్రీ భువనేశ్వరి యంత్రం తో గురుమాత

శ్రీ స్వామి వారితో ముఖ్య భక్తులలో ఒకరైన దొరై స్వామి గారు
 

********సశేషం********

733 views0 comments

Recent Posts

See All

Comments


               Sri Swamy Poornananda Ashram

                          P-4, Contractors Colony, Srisailam Dam East,

                      Kurnool District-518 102.  Phone :  9494561339

Picture1.png
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page