top of page

|| శ్రీ ఓంకార వైభవమ్ ||

|| ఇంటిని విడిచి వెళ్ళిపోయి ఓంకారంగా మారిన బాలుడి కథ||

శ్రీ పూర్ణానంద స్వామి వారు ఏనాడు ఎటువంటి ఉపన్యాసాలు ఇవ్వటం జరుగలేదు.1990లో నేను ఆశ్రమం కి వచ్చిన కొత్తల్లో శ్రీ స్వామి వారి గురించి ఎటు వంటి పుస్తకములు అందుబాటులో లేవు. శ్రీ స్వామి వారి ఫోటోలు కూడా ఆశ్రమం లో ఉండేవి కావు. అప్పట్లో ఎవరికైన శ్రీ స్వామి వారి ఫోటోలు కావాలి అంటే మెయిన్ రోడ్ మీద ఉన్న శోభా ఆర్ట్స్ స్టూడియో కి వెళ్ళవలసిందే.


శ్రీ స్వామి వారు ప్రతి క్షణం సాధన పరమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలను వారి భక్తులకు శిష్యులకు వారి వారి అర్హత, స్థాయికి అర్ధమయ్యే విధముగా, కొన్ని సార్లు కథల రూపం లో కూడా బోధించేవారు. శ్రీ స్వామి వారు, వారి తపొస్థానం గురించి, గురుపరంపర గురించి ఎన్నో సార్లు మాతో చెప్పారు. వారు చెప్పిన ప్రతి విషయము లో మేము ఎంతలా లీనమయ్యేవారిమంటే, ఆ సంఘటన స్థలము లో మేము కూడా శ్రీ స్వామి వారి పక్కనే ఉండి ఆ దివ్యానుభూతిని పొందకలిగేంత గొప్ప గా శ్రీ స్వామి వారి వర్ణన ఉండేది. వారు చెప్పే విధానం, విషయం, మాట అదే అయినప్పటికీ వారు ఒక కథ రెండవ సారి చెప్పినప్పుడు అందులో ఒక కొత్త విషయం మాకు స్ఫురించేది. శ్రీ స్వామి వారు మాతో చెప్పిన కథలు మాకు పూర్తిగా అవగతమైందనే భావనలో ఉండి, మాలో మేము అవే కథలు చర్చించుకున్నపుడు, ఆ కథ లో మాకు తెలియని ఒక కొత్త విషయం చర్చకు వచ్చేది. ఆ కథలు ఎన్ని సార్లు స్మరించుకున్నా, ప్రతి సారి అవి ఎంతో కొత్తగానే అనిపించేవి.


1990లలో నాకు, శ్రీ శంకర్ నారాయణ(ఢిల్లీ) గారికి శ్రీ స్వామి వారు ప్రత్యేకంగా ఒక మూడు కథలు వివరించారు. ఆ మూడు కథలలో మొదటిది దివ్య సంగమం(Divine Confluence). శ్రీ స్వామివారి గురువులైన శ్రీ రాఖాడి బాబా వారు, బాణతీర్థ జలపాత సమీపాన ఉన్న వరుణ గుహ లో కఠోరమైన తపస్సులో ఉన్న శ్రీ స్వామి వారి వద్దకు చేరుకొని, వారిని ఏ విధము గా అనుగ్రహించారని ఈ కథ వివరిస్తుంది. రెండవ కథ శ్రీ ఓంకార వైభవమ్(The Rising glory of OM). ఇక్కడ శ్రీ స్వామి వారి గురువులైన రాఖాది బాబా వారు కుటుంబాన్ని త్యజించి, వారి గురువులైన నిత్యానంద భగవాన్ వారిని సేవించుకొని, ఓంకారనందులుగా ఎలా ఆవిర్భవించారో చెప్పే కథ. ఇక మూడవ కథ శ్రీ బ్రహ్మానంద గురవే నమః. శ్రీ స్వామి వారి తాతగారు, నాన్న గారు వారి గురువులను ఎంత గొప్పగా సేవించుకుని ఉన్నతమైన స్థితులను పొందారని చెప్పే కథ.


ప్రతి రోజు శ్రీ స్వామి వారు నన్ను, శ్రీ శంకర్ నారాయణ్ గారిని ప్రత్యేకం గా శ్రీ స్వామి వారు వారి సన్నిధి కి పిలిపించి, ఈ కథలు మాతో వివరించేవారు. సాయంత్రానికి మేము శ్రీ స్వామి వారు చెప్పిన విషయాలను రాసుకొని, వాటి మీద చర్చలు, వాదోపవాదాలు జరుపుకున్న తర్వాత మరుసటి రోజు శ్రీ స్వామి వారికి మేము రాసిన విషయాలను చూపించేవారము. వాటిలో చేయవలసిన మార్పులను శ్రీ స్వామి వారే స్వయంగా చేసి ఈ మూడు కథలకు ఒక పుస్తక రూపాన్ని ఇచ్చారు.

ఇది ఆ మూడు కథలలో రెండవదైన శ్రీ ఓంకార వైభవమ్.

- మేరీ ప్రమీల


 

శ్రీ రాఖాడీ బాబా వారు 1925వ సంవత్సరంలో కాంచీపురానికి సమీపాన ఉన్న కలవై అను ఒక చిన్న పల్లె లో భాగమైన అగరం అనే ప్రాంతం లో జన్మించారు. మునిస్వామిగా పిలవబడిన శ్రీ బాబా వారికి ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు. ప్రాథమిక విద్యను కూడా అభ్యసించలేనంత నిరుపేద కుటుంభంలో జన్మించిన శ్రీ బాబా వారు, వారి తల్లి తండ్రులు పస్తున ఉండటం తాళలేక ఆరేళ్ల పసి వయసులోనే తల్లి తండ్రుల బాగోగులు చూసుకోవాలనే కోరికా,పట్టుదలతో పంటపొలాల్లో కస్టపడి పని చేశారు. పని దొరకని నాడు తల్లితండ్రులను పోషించేందుకు శ్రీ బాబా వారు చిన్న చిన్న దొంగతనాలు చేయుటకు వెనుకాడేవారు కాదు. శ్రీ బాబా వారికి తొమ్మిది పదేళ్ల వయసు వచ్చేసరికి, వారు వారి తల్లితండ్రులతో పాటు, వారి సన్నిహితుల ఆకలి తీర్చేందుకు కూడా తస్కరించటం మొదలు పెట్టారు. వారి పోకడను నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు శ్రీ బాబా వారిని తరచూ దండించేవారు కాని శ్రీ బాబా వారిని అదుపు చేయటంలో విఫలమయ్యేవారు. కుటుంబ సభ్యుల నిరసన, దండనలు తాళలేని శ్రీ బాబా వారు, వారికి పన్నెండేళ్ల వయస్సు రాక మునుపే ఇల్లు, ఊరు విడిచి వెళ్లిపోయారు.


అలా కట్టు బట్టలతో ఇల్లు విడిచి బయలుదేరిన ఆ బాలుడు బెంగళూరుకు ఎలా చేరారో, వారి మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురుకున్నారో ఎవరికీ తెలియదు. అలా కట్టుబట్టలతో బెంగళూరుకి చేరుకున్న ఆ బాలుడు ఒక సంవత్సరం పాటు అక్కడే ఒక హోటల్లో క్లీనర్ గా పనిచేసారు. పసితనం నుండే ఎంతో చురుకుగా ఉన్న శ్రీ బాబా వారు, బెంగళూరు లో పని చేసిన రోజుల్లో తెలుగు, మలయాళం భాషలను నేర్చుకున్నారు. మరుసటి సంవత్సరం మైసూర్ కి చేరుకున్న ఆ బాలుడు, మైసూర్ లో ఒక వంటమనిషికి సహాయకునిగా వ్యవహరించారు. మైసూర్ లో ఉన్న రోజుల్లో వారు కన్నడ భాషను కూడా నేర్చుకున్నారు.


బెంగుళూరుకి చేరిన నాటి నుండి వారి కుటుంబ సభ్యులని కలుసుకునేందుకు శ్రీ బాబా వారు తరచూ కలవైకి వెళ్లి వస్తూ ఉండేవారు. అలా వారు కలవై కి వెళ్ళిన ఒక సందర్భంలో వారికి పితృ వియోగం కలగటంతో, జరగవలసిన కార్యక్రమాలను శ్రీ బాబా వారు దగ్గెర ఉండి చూసుకొని కొంతకాలం కలవైలోనే ఉండిపోయారు. వారికి పదమూడు, పద్నాలుగేళ్ల వయసు వచ్చాక, వారు మళ్ళీ ఇంటిని విడిచి మైసూర్ కి పయనమయ్యారు.


మైసూర్ లో కొంత కాలం పని చేసిన తదుపరి, శ్రీ బాబా వారు అటు నుండి శృంగేరికి చేరుకున్నారు. శృంగేరిలో అదే సమయాన తపస్సులో నిమగ్నమై ఉన్న ఒక మహనీయుణ్ణి శ్రీ బాబా వారు గురువులుగా భావించుకుని, ఒక హోటల్లో పని చేస్తూ, వచ్చిన సంపాదనతో వారు వారి గురువుని సేవించుకున్నారు. శ్రీ బాబా వారి భక్తి శ్రద్ధలను గుర్తించిన ఆ మహనీయులు, శ్రీ బాబా వారికి అర్థమయ్యే రీతిలో భగవద్గీతా, ఉపనిషదులను భోదిస్తూ, వారి వద్దకు వచ్చే ఎందరో ధనిక భక్తుల నుండి భిక్షను నిరాకరించి, శ్రీ బాబా వారు కష్టార్జనతో తెచ్చే ఆహరం కోసం ఎదురు చూసేవారు.


అలా ఆరు నెలల పాటు ఆ మహనీయుని సేవించుకున్న తదుపరి, శ్రీ బాబా వారు శృంగేరి నుండి గోవా కు వెళ్లి, కొంత కాలం అక్కడ గడిపి, మరలా వారు శృంగేరికి చేరుకున్నారు. గోవాలో ఉన్న అనతి కాలంలోనే కొంకణి భాష కూడా శ్రీ బాబా వారి భాషా బాండాగారానికి చేరింది. అలా శ్రీ బాబా వారు గోవా నుండి తిరిగొచ్చిన కొంత కాలానికే ధ్యాననికై అరణ్య ప్రవేశం చేశారు. అరణ్యంలో ప్రణవ జపం, పంచాక్షరి జపం చేసిన శ్రీ బాబా వారు, శృంగేరిలోని వారి గురువులు వారికి ఉపనిషదుల నుండి ఉపదేశించిన విధముగా భావ సాధన చేశారు.


భావ సాధన:


అన్ని దిక్కులు గురువుగా, మరియు శ్రవణం గురువుగా


అన్ని రూపాలు గురువుగా, మరియు చక్షువులు గురువుగా


జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బ్రహ్మగా


అహం బ్రహ్మగా,


అహం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బ్రహ్మగా,


జపము, ధ్యానము గురు భావనతో సాధనగా చేపట్టారు. అదే పద్ధతిలో వారు ప్రణవ(ఓంకారం) జప సాధన కూడా చేసేవారు.


ప్రణవ జపంలో,


అహంలో అ-కారాన్ని,

ఇంద్రియాలలో (జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు) ఉ-కారాన్ని,

బాహ్య ప్రపంచంలో మ-కారాన్ని ధ్యానించేవారు.


అలాగే కొన్ని సార్లు,


బాహ్య ప్రపంచంలో అ-కారాన్ని,

ఇంద్రియాలలో(జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు) ఉ-కారాన్ని,

అహంలో మ-కారాన్ని ధ్యానించేవారు.


శ్రీ బాబా వారు ఆ తర్వాతి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రాంతాలలో సంచరించారని, ఆ వివరములు శ్రీ స్వామి వారు ఈ తెలియపరిచారు.


ఒక సంవత్సరం పాటు అరణ్యంలో ధ్యానం చేసిన శ్రీ బాబా వారు, అనంతరం ఒక సంవత్సరం ఉజ్జయినిలో, ఒక సంవత్సరం రిషికేష్ లో, మరొక సంవత్సరం కాంగ్రాలోని జ్వాలా ముఖి క్షేత్రంలో గడిపి, ఆ తర్వాత ఒక మూడు సంవత్సరాలు కులు లోయలో సంచరించారు. ఆ పిదప శ్రీ బాబా వారు, వారికి ఇరవయ్యేళ్లు రాకముందే తపస్సునారంభించి, ఆ తరువాతి పన్నెందుకు సంవత్సరాలు తపస్సులో, సంచారంలో గడిపారు. ఆ తర్వాత హిమాలయ పర్వతాల నుండి గిరినార్ అడవులకు చేరిన శ్రీ బాబా వారు, ఒక సంవత్సర కాలం పాటు అక్కడే గడిపారు. శ్రీ దత్తాత్రేయుల వారి సన్నిధిగా పేరొందిన గిరినర్ అడవుల్లో దత్త సాక్షాత్కారం పొందిన శ్రీ బాబా వారు మొదటిసారిగా శ్రీ నిత్యానంద భగవాన్ వారి పేరు విన్నారు. ఆ క్షణం నుండే నిత్యానంద భగవానులను కలవాలని, వారితో సంభాషించాలనే భావనలో శ్రీ బాబా వారు ఉన్నారు.శ్రీ నిత్యానంద భగవాన్ వారు శ్రీ బాబా వారితో సంభాషించడం ఎంతో కీలకంగా శ్రీ బాబా వారు భావించుకున్నారు.


భగవాన్ శ్రీ నిత్యానంద

గిరినారు నుండి గణేశపురి చేరేందుకు బయలుదేరిన శ్రీ బాబా వారు, ముందు గణేశపురి సమీపాన ఉన్న వజ్రేశ్వరి క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీ నిత్యానంద భగవాన్ శ్రీ బాబా వారితో సంభాషించాలని వజ్రేశ్వరి అమ్మ వారి అనుగ్రహం కోరుతూ, వజ్రేశ్వరి క్షేత్రాన ఉన్న శ్రీ దోగారి బాబా వారి సమాధి వద్ద శ్రీ బాబా వారు మూడు రోజులు బిక్ష స్వీకరిస్తూ గడిపారు.


శ్రీ నిత్యానంద భగవాన్ వారి సన్నిధికి చేరుకున్న శ్రీ బాబా వారికి, అక్కడ ఉన్న భక్తుల రద్దీ వలన సంభాషించేందుకు సాధ్యం కాకపోవడంతో, వచ్చిన భక్తులందరు వెళ్లేందుకు బాబా వారు ఎదురు చూడగా, ఇంతలోపే మరో భక్త బృందంతో శ్రీ నిత్యానంద భగవాన్ వారి సన్నిధి కిక్కిరిసిపోయింది. కాని ఈ సారి శ్రీ నిత్యానంద భగవాన్ వారు, ఆ భక్తుల గుంపులో ఉన్న శ్రీ బాబా వారిని ప్రత్యేకంగా గుర్తించి, హిందీ లో, “ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని అడిగారు.



అందుకు శ్రీ బాబా వారు, ”నేను పదార్థమును, సాగరంలో సంగమించేందుకు ఇక్కడికి వచ్చాను”.


శ్రీ బాబా మరియు శ్రీ నిత్యానంద భగవాన్ వారి మధ్య జరిగిన సంభాషణను అక్షరం పోకుండా వివరించిన శ్రీ స్వామి వారు(శ్రీ శ్రీ శ్రీ పూర్ణానంద స్వామి వారు),”మీరు అనంతమైన ఒక బ్రహ్మ సాగరం,నేను ఆ సాగరంలో సంగమించేందుకు ఇక్కడికి వచ్చాను. నేను ఏ విషయం తెలియని ఒక వస్తువును. మీరు సర్వ విషయా సంపన్నులు”,అన్న శ్రీ బాబా వారి ఉద్దేశాన్ని వివరిస్తూనే, శ్రీ బాబా వారు నిత్యానంద భగవాన్ వారిని ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడలేదని, ఆ తర్వాత సాగిన సంభాషణను కూడా శ్రీ స్వామి వారు వివరించారు:


భగవాన్ నిత్యానంద: ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు?


శ్రీ రాఖాడీ బాబా: నేనొక వస్తువుని, సాగరం లో సంగమించేందుకు ఇక్కడికి వచ్చాను.


భగవాన్ శ్రీ నిత్యానంద: ‘నేను’ పై నీ అభిప్రాయమేంటి?


శ్రీ రాఖాడీ బాబా: కరుడుగట్టిన అహంకారమే 'నేను'.


భగవాన్ శ్రీ నిత్యానంద: సాగరం ఎవరు?


శ్రీ రాఖాడీ బాబా: గురువు సాగరం.


భగవాన్ శ్రీ నిత్యానంద: గురువు ఆకారుడా? నిరాకారుడా?


శ్రీ రాఖాడీ బాబా: గురువు ఆకారుడు.


భగవాన్ శ్రీ నిత్యానంద: మరి నిరాకారమంటే ఏంటి?


శ్రీ రాఖాడీ బాబా: నిరాకారమంటే బ్రహ్మ.


భగవాన్ శ్రీ నిత్యానంద: మరి ఆకారమంటే?


శ్రీ రాఖాడీ బాబా: ఆకారమంటే ప్రపంచం. కానీ ఆకారం తీసుకున్న నిరాకారం గురువు.


ఇక్కడ గురువు గురించి శ్రీ బాబా వారి నిర్వచనాన్ని వివరిస్తూ శ్రీ స్వామి వారు, " భగవంతుని వద్దకు గురువు మాత్రమే చేర్చగలడు. సామీప్యంగా ఉన్న భగవంతుని స్వరూపమే గురువు", అని అన్నారు. శ్రీ రాఖాడీ బాబా, నిత్యానంద భగవాన్ల మధ్య సంభాషణ అలాగే ముందుకు సాగింది.


భగవాన్ శ్రీ నిత్యానంద: మరి నువ్వు నీ గురువుని కలుసుకున్నవా?


శ్రీ రాఖాడీ బాబా: గురు రూపం తీసుకున్న నిరాకారుడు గురించి విని, వారిని కలుసుకునేందుకు గిరినార్ అడవుల నుండి ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు వారి కరుణకు పాత్రుడనయ్యె అదృష్టాన్ని పొందాను.


శ్రీ రాఖాడీ బాబా వారు సంభాషణ పూర్తయింది అని అక్కడ నుండి లేచి వెళ్లబోగా, నిత్యానంద భగవాన్ వారు సంభాషణను కొనసాగించారు,


భగవాన్ శ్రీ నిత్యానంద: ఎక్కడికి వెళ్తున్నావు?


శ్రీ రాఖాడీ బాబా: ఏదైనా మండపం లేదా చెట్టు నీడకి.


భగవాన్ శ్రీ నిత్యానంద: వర్షం పడితే?


శ్రీ రాఖాడీ బాబా: ఏదైనా కుటీరం లేదా నివాసానికి చేరుకుంటాను.


భగవాన్ శ్రీ నిత్యానంద: నీకు ఏదైనా కళలో ప్రావీణ్యత ఉందా?


శ్రీ రాఖాడీ బాబా: నాకు రెండు కళలు తెలుసు. ఒకటి పోరాడటం, మరొకటి వండటం.


శ్రీ స్వామి వారు నవ్వుతూ, బాబా వారి ఉద్దేశాన్ని ఈ విధము గా వివరించారు,


"నేను తినటం కోసం పోరాటం చేస్తాను, పోరాటం చేయటం కోసం తింటాను".

శ్రీ బాబా వారి కళల గురించి విన్న శ్రీ నిత్యానంద భగవాన్ వారి కళ్ళు ప్రకాశవంతంగా మెరిసాయి.


భగవాన్ శ్రీ నిత్యానంద: మేము ఇక్కడ వంట చేసే వారి కోసం చూస్తున్నాము. మూడు నెలలకు ముందు ఇక్కడొక వంటశాల ప్రారంభమయ్యింది. కానీ అక్కడ వంట చేసి పెట్టెవారే లేరు. ఆ వంటశాలలో వంట చేస్తూ నువ్వు నీ గురువుకి సేవ చేసుకో.


'నీ' గురువు అన్న మాట విన్న వెంటనే శ్రీ బాబా వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు, ఆ మాటతో శ్రీ బాబా వారి గురువులు శ్రీ నిత్యానంద భగవాన్ అనే విషయం చెప్పకనే నిత్యానంద భగవాన్ వారు చెప్పారు”, అని శ్రీ స్వామి వారు వివరించారు.


శ్రీ రాఖాడీ బాబా

శ్రీ బాబా వారు ఆలస్యం చేయక అక్కడ ఉన్న శ్రీ నిత్యానంద భగవాన్ వారి శిష్యులొకరిని శ్రీ భగవాన్ వారు చెప్పిన వంటశాలకు వెళ్లే మార్గం కనుక్కొని, వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ వంటశాల కుట్టి బాబు అనే పేరుతో పిలవబడే ఒక కన్నడీకులది. శ్రీ బాబా వారు వెంటనే అక్కడ వంట చేయటం ఆరంభించి, మొదటి నెల రోజులు అదే వంటశాలలో పని చేస్తూ అక్కడే బస చేశారు. వారికి దొరికిన అవకాశాన్ని మహాభాగ్యంగా భావించిన శ్రీ బాబా వారు పగటి పూట వంట చేస్తూ రాత్రి సమయాలు ధ్యానంలో గడుపుతూ అనునిత్యం దివ్యానుభూతిని పొందారు.

వారి అంతర్నిశబ్దాన్నిపరిరక్షించుకునేందుకు ఎంతో ఉబలాట పడిన శ్రీ బాబా వారికి, వంటశాలకు తరచూ వచ్చే భక్తుల తాకిడికి అది సాధ్య పడదని గ్రహించిన శ్రీ బాబా వారు వారి సాధన నిమిత్తం వేరొక ప్రదేశాన్ని ఎంచుకున్నారు.


తాన్సా నదీ తీరాన ఉన్న గణేశపురిలో ఏర్పాటైన శ్రీ నిత్యానంద భగవాన్ వారి ఆశ్రమం, ఆ వంటశాల ఎప్పుడు భక్తుల తాకిడి తో కిటకిటలాడుతూ ఉండటం వలన శ్రీ రాఖాడీ బాబా వారు నదిని దాటుకొని అవతల తీరాన ఉన్న ఒక మామిడి చెట్టు కిందకి చేరుకున్నారు. అక్కడ వారొక కుటీరాన్ని ఏర్పరుచుకొని రాత్రులు ఆ కుటీరంలో గడపసాగారు.


ప్రతి రోజు సాయంత్ర కాలంలో శ్రీ నిత్యానంద భగవాన్ వారిని దర్శించుకోవటం ఒక విదిగా పెట్టుకున్న శ్రీ బాబా వారు, వంటశాలలో పని పూర్తి అవ్వగానే స్నానమాచరించి, శ్రీ నిత్యానంద భగవాన్ వారి సన్నిధికి చేరుకునే వారు. శ్రీ నిత్యానంద భగవాన్ వారితో అరుదుగా సంభవించే మిత సంభాషణ తప్పించి శ్రీ బాబా వారు ఎప్పుడు తదేక ధ్యాసతో మౌనాన్ని పాటిస్తూ ఉండేవారు. శ్రీ నిత్యానంద భగవాన్ వారు శ్రీ బాబా వారికి ఒక్కోసారి మిఠాయి పొట్లాలు, ఇతర తిను బండారాలను, ప్లేట్లను ప్రసాదంగా ఇచ్చేవారు. ప్రతి వారం పదిరోజులకు శ్రీ నిత్యానంద భగవానుల నుండి ప్లేట్లు, కప్పులు శ్రీ బాబా వారికి ప్రసాదంగా వచ్చేవి.


ఒక రోజు తెల్లవారు ఝామున శ్రీ బాబా వారు స్నానమాచరించి వంటశాలకు బయల్దేరబోగా అదే సమయానికి శ్రీ నిత్యానంద భగవాన్ వారు నది దాటి శ్రీ బాబా వారి వైపుకు నడుచుకు వస్తూ దర్శనమిచ్చారు.


భగవాన్ శ్రీ నిత్యానంద: నీవు ఇక్కడ ఉన్నావా!


శ్రీ రాఖాడీ బాబా: లేదు.(నిత్యానంద భగవాన్ వారు ప్రశ్న దృష్టి తో బాబా వారిని చూస్తూ ఉండగా) నేను అన్ని చోట్లా ఉన్నాను.


భగవాన్ శ్రీ నిత్యానంద: ఎలా?


శ్రీ రాఖాడీ బాబా: సర్వాంతర్యామి అయిన నా గురువులో నేను ఉండటం వలన.


భగవాన్ శ్రీ నిత్యానంద: ఎక్కడికి వెళ్ళటానికి తయారవుతున్నావు?


శ్రీ రాఖాడీ బాబా: నా తపోస్తానానికి.


భగవాన్ శ్రీ నిత్యానంద: అదెక్కడా?


శ్రీ రాఖాడీ బాబా: నా గురువు నన్ను ఉండమని చెప్పిన మందిరము


భగవాన్ శ్రీ నిత్యానంద: ఏ దేవతనైనా ఆరాధించుటకా?


శ్రీ రాఖాడీ బాబా: నా గురుదేవులకు భోజన ఏర్పాట్లను చేయుటకు. (ఒక క్షణం తర్వాత) ఎందరో భక్తుల రూపంలో

భుజించేందుకు వచ్చే నా గురుదేవులకు భోజన ఏర్పాట్లను చేయుటకు.


భగవాన్ శ్రీ నిత్యానంద: నీ తపస్సుకి ఈ సంభాషణ ఆటంకం కలుగచేస్తుందా?


శ్రీ రాఖాడీ బాబా: లేదు, ఈ సంభాషణ అమృతం వంటిది. ఇది నా గురుదేవుల సేవకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది.


ఇలా సాగుతున్న ఈ సంభాషణ మధ్యలో శ్రీ నిత్యానంద భగవాన్ వారు ఆకస్మికం గా నడుచుకుంటూ వెళ్లిపోయారు.


అలా వంటశాలకు వచ్చిన భక్తులకు వండి పెడుతూ, సాయంత్రాలు శ్రీ నిత్యానందులవారిని దర్శించుకుంటూ, రాత్రులు ధ్యానం చేస్తూ శ్రీ బాబా వారు మూడేళ్ళ పాటు గడిపారు.


ఈ మూడేళ్ళ కాలం మధ్యలో శ్రీ నిత్యానంద భగవాన్ వారు, నది కి అవతల వడ్డున ఉన్న మామిడి వృక్షానికి సమీపంలో అందరికి దూరంగా శ్రీ బాబా వారు నివసించేందుకు కొంత స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్థలానికి దగ్గెర గా మూడు ఉష్ణ కుండలాలు సహజంగా ఏర్పాటై ఉన్నవి. అగ్నికుండ, సూర్యకుండ, సోమకుండ గా వాటిని పిలిచేవారు. వాటిల్లో అగ్నికుండం అన్నిటికన్నా ఎక్కువ వృష్ణోగ్రత కలిగి ఉన్నది. అగ్ని కుండలం లో నీరు ని చేయి తో కూడా తాకలేనంత వేడిగా ఉంటాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు సంజీవిని గా పని చేసే ఆ ఉష్ణ కుండలు కాలం తో పాటు మరుగున పడిపోయాయి. ఆ కుండల చుట్టూ పేరుకుపోయిన రాళ్లు, రప్పలను శ్రీ నిత్యానంద భగవాన్ వారే స్వయంగా తొలగించి, స్నానాలు ఆచరించేందుకు వీలుగా వాటిని పునర్నిర్మాణం చేశారు. దీని తర్వాత శ్రీ నిత్యానంద భగవాన్ వారు పెంకుల కప్పు తో కూడిన రెండు గదులు, ఒక వరండా తో ఒక రాతి కట్టడాన్ని నిర్మాణం చేయించారు. వరండా నుండి రెండు గదులకు వెళ్లాలంటే రెండు మెట్లు ఎక్కి లోపలకు వెళ్లే విధంగా అక్కడి నెల హెచ్చు తగ్గులతో ఉన్నదీ. గురుదేవులు ప్రసాదించిన ఆ నివాసానికి చేరుకున్న శ్రీ బాబా వారు వరండా లో నిత్యాగ్ని తో ఒక హోమగుండాన్ని ఏర్పరుచుకున్నారు. వారు వంటశాలలో పని చేసిన రోజుల్లో, రాత్రులు ధ్యాన నిమిత్తం అక్కడ బస చేసిన శ్రీ బాబా వారు క్రమంగా వంటశాలలో పని కూడా వదిలేసి రోజంతా ఆ కుటీరం లోనే ధ్యానం లో నిమగ్నులై ఉన్నారు.


ఆ కుటీరానికి చుట్టూ పరిసరాలలో ఉన్న అడవి ప్రాంతాన్ని శ్రీ నిత్యానంద భగవాన్ వారు తొలగింపచేసి శ్రీ బాబా వారి కోసం అక్కడ ఒక మండపం నిర్మాణం చేయించి అందులో ఒక శివ లింగాన్ని శ్రీ నిత్యానందులవారే స్వయం గా ప్రతిష్ట చేశారు. ఆ మండపం, ఆశ్రమ నిర్వహణకై శ్రీ నిత్యానంద భగవాన్ వారు శ్రీ బాబా వారికి ఆ చుట్టూ ఒక పదకండు ఎకరాల భూమిని ఇచ్చారు. అక్కడ ఒక గ్రామస్థునికి శ్రీ బాబా వారు ఆ భూమిని అప్పజెప్పి వ్యవసాయం చేసుకోమని చెప్పి, ప్రతి సోమవారం శ్రీ బాబా వారు అతని నుండి భిక్షను స్వీకరించేవారు.


ఒకానొక కార్తీక పౌర్ణమి రోజున అర్దరాత్రి శ్రీ నిత్యానంద భగవానులవారు గణేశపురి లో వారి ఆశ్రమం నుండి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బయలుదేరి, ఎంతో వేగంతో కొండ రాళ్ళ మీదుగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ప్రవహిస్తున్న నదిని దాటి శ్రీ బాబా వారి కుటీరానికి చేరుకున్నారు. కుటీరంలో హోమకుండం ముందు ధ్యానం లో కూర్చున్న శ్రీ రాఖాది బాబా వారిని సమీపించిన శ్రీ నిత్యానంద భగవాన్ వారు శ్రీ బాబా వారిని అక్కడ నుండి అగ్ని కుండం వద్దకు తీసుకు వెళ్లి ఏమి మాట్లాడకుండా అగ్ని కుండంలో మరుగుతున్న వేడి నీళ్ళలోకి శ్రీ బాబా వారిని విసిరేశారు. ఆ తరువాత శ్రీ బాబా వారి చెవిలో ‘ప్రణవోపదేశం (ఓంకార ఉపదేశం)’ చేసి


'ఇప్పుడు నీలో ‘ఓంకారం’ ఉద్భవించి నీవు ‘ఓంకార’ స్వరూపుడవయ్యావు. కావున నీకు ‘ఓంకారానంద’ అను నామ దీక్షను ప్రసాదిస్తున్నాను.'

అని శ్రీ నిత్యానంద భగవాన్ వారు మరు క్షణమే అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోసాగారు. శ్రీ బాబా వారు కూడా శ్రీ నిత్యానందుల వారి వెనకే నడుచుకుంటూ వెళ్లబోగా, శ్రీ నిత్యానందుల వారు, "నా మార్గాన్ని అనుసరించు, నన్ను కాదు" అని శ్రీ బాబా వారికి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు.


శ్రీ నిత్యానందులవారి అనుగ్రహంతో శ్రీ బాబా వారు 'ఓంకారానంద' అను దీక్షా నామము పూర్ణత్వం తో నిండి ఉన్న కార్తీక పౌర్ణమి నాడు పొందారు.


ఇలా ఒక సామాన్య బాలుడు ఇంటిని విడిచి ఓంకారనందునిగా అవతరించి, మన అందరికి ఎంతో వాత్సల్యముతో పూర్ణానందాన్ని అనుగ్రహించారు.


|| ఓం రుద్ర రూపాయ విద్మహే, భక్త వాత్సల్యాయ ధీమహి

తన్నో త్యాగీ ప్రచోదయాత్ ||

 





























628 views0 comments

Comments


bottom of page