top of page

||శ్రీ బ్రహ్మానంద గురవే నమః|| - 1


శ్రీ మహావిష్ణువుని నిరంతరం భక్తి పారవశ్యం తో కీర్తిస్తూ ఎంతో గొప్ప సాహిత్యం, గొప్ప కీర్తనలు విరచించిన 10 మంది ఆళ్వార్ ల లో ఒకరైన ఆండాళ్ అమ్మ వారు జన్మించిన ఊరు శ్రీవిల్లిపుత్తూర్, తమిళ నాడు. శ్రీ ఆండాళ్ అమ్మ వారి జీవన ప్రస్తానం వేయి సంవత్సరాలకి ముందుది అయినప్పిటికి, 19వ శతాబ్దంలో కూడా వేలాది విష్ణు భక్తులు ఆ ఊరికి వచ్చేవారంటే, అదే ఆవిడ భక్తికి నిదర్శనం. ప్రతి ఏడాది జరిగే రధోత్సవ వేడుకలలో శ్రీ మహా విష్ణు విగ్రహంతో పాటుగా, శ్రీ ఆండాళ్ అమ్మ వారు, వారి తండ్రి(మరో ఆళ్వార్) వారి విగ్రహాలను కూడా అభిషేకించి రధం లో పురవీధులలో ఊరేగించడం ఇప్పటికి అక్కడి ఆనవాయితీ . ఈ వేడుకకు లక్షల్లో భక్తులు శ్రీవిల్లిపుత్తూర్ కి విచ్చేసేవారు. అక్కడ ఒకప్పుడు ఒక మహారాజు నిర్మాణం చేసిన పెద్ద చెరువుల వలన ఆ ప్రాంతానికి ముక్కుళం, తిరు ముక్కుళం అను పేరులు వచ్చాయి. ఒకప్పుడు ఆ చెరువులు నిండు కుండల్లా ఉండటం వలన ఆ చుట్టూ పక్కల ప్రదేశమంతా ఎంతో చల్లగా ఆహ్లదకరం గా ఉండేది. కాలంతో పాటు ఆ చెరువులు ఇంకిపోవటం తో చివరకు ఇప్పుడు అక్కడ ఏడు మైళ్ళ వరకు ఒక పెద్ద గుంత మాత్రమే మిగిలింది. అదే ప్రాంతంలో ఒక చిన్న పెంకుటింట్లో ఒక నిండు గర్భిణీ కాన్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆవిడ పేరు కానీ, వారి భర్త పేరు కానీ ఎవరికి తెలియకపోయినప్పటికీ, వారికి జన్మించిన మహనీయులు రాబోయే కాలంలో భారతి స్వామిగా కీర్తికెక్కిన శ్రీ శంకర్ నారాయణన్ గారు. (శ్రీ శ్రీ శ్రీ పూర్ణానంద స్వామి వారి తాతగారు.)


తొలుత శ్రీ శంకర్ నారాయణన్ గారి కుటుంబం ఉత్తర సంబందపూర్ అగ్రహారం లో నివాసం ఉండేవారు. పూర్వపు రోజులలో వేద పఠనం, ఆధ్యాత్మిక చింతన, నిత్యానుష్ఠానం చేసుకునే బ్రాహ్మణులకు రాజులు మాన్యం భూములు గా ఇచ్చిన వాటిలలో ఈ అగ్రహారం కూడా ఒకటి. ఇక్కడ శ్రీ శంకర్ నారాయణన్ గారి కుటుంబానికి ఒక ఏడు ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిని ఆధారం చేసుకొని వారు అక్కడ కొంత కాలం జీవనం సాగించి, అక్కడి నుండి శ్రీవెల్లిపుత్తూరి కి వచ్చేసారు. .


శ్రీ శంకర్ నారాయణన్ వారు జన్మించినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. వారి తల్లి వారు గర్భము దాల్చిన సమయాన ఒక సర్పము ఆవిడ సేద తీరే సమయాన ఆవిడ గర్భానికి చుట్టుకుని ఉండేది. వారి ఎదురు ఇంటిలో అప్పటిలో ఒక గరుడ ఉపాసకులు ఉండేవారు. వారు వచ్చి ఆ సర్పాన్ని జాగ్రత్తగా ఒక మట్టి కుండలోకి తీసుకొని దూరం గా వదిలేసి రాగ, మరలా ఆ సర్పం అదే రీతిలో వచ్చి ఆవిడ గర్భానికి చుట్టుకు పడుకునేది. అలా మూడు సార్లు ఆ గరుడ ఉపాసకులు వచ్చి ఒక మంత్రం వేసి ఆ సర్పాన్ని అక్కడినుండి తీసుకువెళ్లి దూర ప్రాంతం లో వదిలి వచ్చారు. కొంత కాలానికి ఆవిడ ఒక మగ శిశువు తో పాటుగా ఒక పాముకు కూడా ఒకటే కాన్పు లో జన్మను ఇచ్చారు . ఆ సర్పమును తప్పించి శ్రీ శంకర్ నారాయణన్ వారికి వేరే తోబుట్టువులు ఎవరు లేరు. ఆ సర్పము కూడా వారి కుటుంబం తో పాటుగా అదే ఇంటిలో నివాసం ఉండినది. శ్రీ శంకర్ నారాయణన్ గారి తల్లి వారు, శంకర్ నారాయణన్ వారితో పాటు సమానంగా ఆ సర్పమును కూడా కన్న బిడ్డలా చూసుకున్నారు.


ఒకరోజు వారి ఇంటికి వచ్చిన ఒక అతిథి, ఈ సర్పాన్ని చూసి బెదిరి, ఒక ఇత్తడి బిందెను ఆ సర్పం పై ప్రమాద వశాత్తు జార విడువగా, ఆ సర్పము అక్కడికక్కడే ప్రాణం విడిచింది. తోబుట్టువు మరణం తో పసి వారైనా శ్రీ శంకర్ నారాయణన్ వారు రాత్రంతా గుక్క పట్టి ఏడ్చారు.


కొంత కాలానికి శ్రీ శంకర్ నారాయణన్ గారి కుటుంబం మధురై కి 50 మైళ్ళ దూరాన ఉన్న రాజపాళయంకి చేరుకొని అక్కడే స్థిరపడ్డారు.రాజపాళయం లోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన శ్రీ శంకర్ నారాయణన్ గారు మెట్రిక్యూలేషన్ పూర్తి చేసుకున్నారు. వారికి పదహారేళ్ళ వయసు వచ్చినప్పుడు మధురై లోని త్రికాలజ్ఞాని అయిన శ్రీ బ్రహ్మానంద స్వామి వారి గురించి విని వారిని దర్శించుకోవాలని తపనతో శ్రీ శంకర్ నారాయణన్ వారు ఇంటిని, ఊరిని విడిచి మధురై కి చేరుకున్నారు. మొదటి దర్శనంలోనే శ్రీ శంకర్ నారాయణన్ గారిని ఆదరించిన శ్రీ బ్రహ్మానంద స్వామి వారు, వారి మఠం లోనే శ్రీ శంకర్ నారాయణన్ వారికి ఆశ్రయం కలిపించి, సేవ చేసుకునే అవకాశాన్ని ప్రసాదించారు . శ్రీ బ్రహ్మానంద స్వామి వారి వద్ద వేదాలు, శాస్త్రాలు, గీతోపనిషదులు అభ్యసించేందుకు ఎందరో పండిత జిజ్ఞాసులు దూర ప్రదేశాల నుండి వారి మఠం కి వాస్తు ఉండేవారు. కానీ అదే మఠం లో శ్రీ బ్రహ్మానంద స్వామి వారిని గురుదేవులుగా భావించుకుని జీవనం సాగిస్తున్న శ్రీ శంకర్ నారాయణన్ గారు మాత్రం వేదోపనిషదులను అభ్యసించేందుకు ఎన్నడూ ఎటువంటి ఆసక్తిని కనుబరచలేదు. శ్రీ బ్రహ్మానంద స్వామి వారికి వంట చేసే అవకాశం పొందిన శ్రీ శంకర్ నారాయణన్ గారు, వంట చేస్తూ, వారి వస్త్రాలను, మఠాన్ని శుభ్రపరుస్తూ శ్రీ బ్రహ్మానంద స్వామి వారి సేవలోనే నిమగ్నులై ఉండేవారు. గురువుని సేవించుకోవటం లో పరమానందం పొందిన శ్రీ శంకర్ నారాయణన్ గారికి ధ్యానం, తపస్సు వంటి వాటిపై ఎటువంటి ఆసక్తి లేదు. అలా నాలుగేళ్ల పాటు గురుదేవుల సేవలో కాలం సాగించిన శ్రీ శంకర్ నారాయణన్ గారిని ఒక రోజు శ్రీ బ్రహ్మానంద స్వామి పిలిచి వారిని ఉన్నపళంగా రాజపాళయం పంపించి, అక్కడ ఒక పదిహేను రోజుల పాటు కుటుంబంతో గడిపి రావలసింది గా ఆజ్ఞాపించారు. గురుదేవుల ఈ ఆజ్ఞకు కారణం తెలియని శ్రీ శంకర్ నారాయణన్ గారు వెంటనే బయలుదేరి రాజపాళయంకి చేరుకున్నారు. శంకర్ నారాయణన్ గారు అక్కడికి చేరుకున్న నాలుగు రోజులకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీ శంకర్ నారాయణన్ గారి తండ్రిగారు తుది శ్వాస విడిచారు.ఆ సమయానికి శ్రీ శంకర్ నారాయణన్ గారు అక్కడే ఉండటం వలన, జరగవలసిన కార్యక్రమములను వారు దగ్గెరుండి శాస్త్రోక్తంగా నిర్వర్తించారు. శ్రీ బ్రహ్మానంద స్వామి వారి ఆజ్ఞకు గల కారణం శ్రీ శంకర్ నారాయణన్ గారు చేసుకున్నారు.


శ్రీ బ్రహ్మానంద స్వామి

కార్యక్రమములన్ని పూర్తి చేసుకొని మధురై కి బయలుదేరాలనుకున్న శ్రీ శంకర్ నారాయణన్ గారిని వారి తల్లిగారు, శ్రీ శంకర్ నారాయణన్ గారికి 14వ ఏటనే, దక్షిణ సంబందపూర్ అగ్రహారం లో నివాసముంటున్న 6 ఏళ్ళ మీనాక్షి అనే బాలికతో వివాహము నిశ్చయమైనది అని, వారి మాట విని ఆ బాలికను పెళ్లాడవలసిందిగా, ఆ వివాహము ఎంతో అంగరంగ వైభవం గా జరిపించి, ఆవిడ చేస్తున్న అప్పడాల వ్యాపారంతో శ్రీ శంకర్ నారాయణన్ గారి సంసారానికి ఆర్థికపరమైన తోడ్పాటుని ఇస్తానని అభయమివ్వగా, మొండివారైనా శ్రీ శంకర్ నారాయణన్ గారు, "దయ చేసి నా జీవితాన్ని ఒక అప్పడం గా మార్చవద్దు", అని తేల్చి చెప్పి మధురై కి బయలుదేరి శ్రీ బ్రహ్మానంద స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు.


ఆధ్యాత్మిక విద్యల పైన, ప్రాపంచికమైన జీవితం పైన ఎటువంటి ఆసక్తి కనబర్చని శ్రీ శంకర్ నారాయణన్ గారు దాదాపు పదేళ్ల పాటు శ్రీ బ్రహ్మానంద స్వామి వారి సేవలో కాలం గడిపారు.గురుసేవ, గురు సన్నిధి తప్ప అన్యమైనవి వారికి ఏది లేదు.


భూత వర్తమాన భవిష్యత్తును చూడగల త్రికాలజ్ఞాని అయినా శ్రీ బ్రహ్మానంద స్వామి వారు శ్రీ శంకర్ నారాయణన్ గారి జీవిత పరమార్థాన్ని గ్రహించి ఒక రోజు శ్రీ శంకర్ నారాయణన్ గారి తల్లి గారికి, దక్షిణ సమందపూర్ అగ్రహారం లో నివాసముంటున్న శ్రీ మీనాక్షి దేవి గారి కుటుంబానికి కబురు పెట్టి మధురై పిలిపించి, వారితో శ్రీ బ్రహ్మానంద స్వామి వారే స్వయంగా చర్చా సంప్రదింపులు జరిపి శ్రీ శంకర్ నారాయణన్ గారి పెళ్లిని నిశ్చయించారు. ఒక రోజు శ్రీ బ్రహ్మానంద స్వామి వారు, శ్రీ శంకర్ నారాయణన్ గారి తో, "మనం ఇప్పుడు గుడికి వెళ్ళాలి, పద." అని శ్రీ శంకర్ నారాయణన్ గారిని వెంట పెట్టుకొని మీనాక్షి అమ్మవారి గుడికి తీసుకువెళ్లారు. వారి జీవితానికి ఒక కొత్త ముడి పడబోతోంది అని గ్రహించని శ్రీ శంకర్ నారాయణన్ గారు వారి గురువుగారి వెంట బయల్దేరారు.


శ్రీ మీనాక్షి అమ్మవారి సన్నిధి లో శ్రీ శంకర్ నారాయణన్ గారికి మీనాక్షి దేవి గారితో వివాహమును జరిపించిన శ్రీ బ్రహ్మానంద స్వామి వారు, వధువు పేరు మీద మధురై లోనే ఒక ఇంటిని బహూకరించి, శ్రీ శంకర్ నారాయణన్ గారిని ఆ రోజు నుండి మీనాక్షి దేవి గారితో కలిసి ఆ ఇంట్లోనే ఉండవలసిందిగా ఆజ్ఞాపించారు.


రోజంతా శ్రీ బ్రహ్మానంద స్వామి వారిని సేవించుకున్న శ్రీ శంకర్ నారాయణన్ గారిని రాత్రికి ఇంటికి వెళ్ళవలసింది గా శ్రీ బ్రహ్మానంద స్వామి వారు ఆదేశించేవారు."ఇప్పుడు నీవు సంసారివి, నీకు సంతాన ప్రాప్తి కలగవలసి ఉంది కావున నీవు ఇంటి వద్దనే భార్య తో ఉండాలి." అని శ్రీ బ్రహ్మానంద స్వామి వారు శ్రీ శంకర్ నారాయణన్ గారితో అంటూ ఉండేవారు.గురుదేవులను వదిలి క్షణమైనా ఉండలేని శ్రీ శంకర్ నారాయణన్ గారికి రాత్రులు గురుదేవులకు దూరం గా ఉండటం ఎంతగానో బాధించే విషయం. శ్రీ బ్రహ్మానంద స్వామి వారి ముఖ్య శిష్యులు, భక్తులు కొందరు శ్రీ శంకర్ నారాయణన్ గారిని ఎప్పుడు చులకన భావం తో చూసేవారు. గురుదేవుల సన్నిధి లో పదేళ్లకు పైగా గడిపి కూడా వారి నుండి ఎటువంటి జ్ఞానం పొందలేదని, మంద బుద్ధి కలిగిన వారని, శ్రీ శంకర్ నారాయణన్ గారిని ఎగతాళి చేసిమాట్లాడేవారు. ఒక్కో సారి శ్రీ శంకర్ నారాయణన్ గారు కూడా గురుదేవులతో ఇంతకాలం ఉండి కూడా కనీసం చిన్న పూజ చేయటం కూడా నేర్చుకోలేదని విచారించేవారు. ఈ లోగా శ్రీ బ్రహ్మానంద స్వామి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అలా 7 రోజుల పాటు అనారోగ్యంతో బాధపడ్డ శ్రీ బ్రహ్మానంద స్వామి వారు శ్రీ శంకర్ నారాయణన్ గారితో, " ఈ శరీరాన్ని ఇంకెంత కాలం నిలుపుకోవాలి? త్వరలోనే ఈ శరీరాన్ని నేను వదిలేయాలనుకుంటున్నాను." అనగా,ఆ మాటలకి మనస్తాపంచెందిన శ్రీ శంకర్ నారాయణన్ గారు, "స్వామి మీరు జ్ఞాన సిద్ధులు, సర్వ శక్తివంతులు. నేను నా జీవితాన్ని, శరీరాన్ని మీకు సమర్పణ చేసుకుంటాను. మీ సిద్ధులతో మీరు నా శరీరం లో కి ప్రవేశించండి. నేనొక అఙ్ఞానిని, నా వలన ఈ ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనం లేదు." అని శ్రీ శంకర్ నారాయణన్ గారు వారి బాధను వెళ్లబుచ్చారు. దానికి బ్రహ్మానంద స్వామి వారు "సమయం దగ్గెర పడుతుంది. నా అంతిమ ప్రయాణానికి నేను సిద్ధమవుతున్నాను." అని బదులిచ్చారు.


ఆ మాటలు విన్న శ్రీ శంకర్ నారాయణన్ గారు నిద్రాహారాలు మానేసి విచారంగా మఠం లో ఒక మూలాన బోరున విలపిస్తూ ఉండిపోయారు. ఇలా మూడు రోజులు గడిచాక, గురుదేవులతో ఎడబాటుని కలలో కూడా భరించలేని శ్రీ శంకర్ నారాయణన్ గారు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో వారిని వారు ఒక గది లో నిర్బందించుకున్నారు.


ఆత్మహత్య చేసుకునే సమయానికి శ్రీ బ్రహ్మానంద స్వామి వారు స్వయం గా వచ్చి తలుపు తట్టారు. శ్రీ శంకర్ నారాయణన్ గారు ఆలోచించుకునేలోపల, ఆ తలుపులు వాటంతట అవీ తెరుచుకొని శ్రీ బ్రహ్మానంద స్వామి వారు ఆ గదిలో కి ప్రవేశించారు. గురుదేవులను చూసి శ్రీ శంకర్ నారాయణన్ గారు దుఃఖం ఆపుకోలేక వారి పాదాలమీద పడి భోరున విలపించారు. శ్రీ బ్రహ్మానంద స్వామి వారు శ్రీ శంకర్ నారాయణన్ వారిని పైకి లేపి, దగ్గెరికి తీసుకొని వెన్ను తట్టి ఓదార్చారు.


అనారోగ్యం తో బాధ పడుతున్నప్పటికీ శ్రీ బ్రహ్మానంద స్వామి వారు సభకు వచ్చి దర్శనాలు ఇచ్చేవారు. అలా ఒక రోజు వారు సభ లో ఉన్న సమయం లో, శ్రీ శంకర్ నారాయణన్ గారు రోజూ లానే శ్రీ బ్రహ్మానంద స్వామి వారి వస్త్రాలను ఆరవేస్తూ, గురుదేవులు కాలం చేశాక ఇలా రోజూ వారికి సేవ చేసుకునే భాగ్యం నాకింక ఉండదు కదా అని. ఆ ఆలోచనకి వారు ఎంతో దిగ్బ్రాంతి చెంది, దుఃఖం తో శ్రీ బ్రహ్మానంద స్వామి వారి సభకు వచ్చి బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టారు..వెంటనే శ్రీ బ్రహ్మానంద స్వామి వారు, శ్రీ శంకర్ నారాయణన్ గారిని దగ్గెరికి పిలిచి, వారి పీఠం పై శ్రీ శంకర్ నారాయణన్ గారిని కూర్చోపెట్టి, ఆ సభలో ఉన్న వారందరికీ, శ్రీ శంకర్ నారాయణన్ గారు శ్రీ బ్రహ్మానంద స్వామి వారి తదనంతరం ఈ పీఠాన్ని అధిష్టిస్తారని ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన శ్రీ బ్రహ్మానంద స్వామీ వారి సభలో ఉన్న పండితులను ,శిష్యులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.


శ్రీ బ్రహ్మానంద స్వామి వారి సేవలో దాదాపుగా 14 ఏళ్ళు గడిపిన శ్రీ శంకర్ నారాయణన్ గారికి, గురుదేవుల సేవ తప్ప వేరే వాటి పై ఎప్పుడు ధ్యాస లేదు. గురు వాక్కుని ఎన్నడూ జవదాటని శ్రీ శంకర్ నారాయణన్ గారు, సంసార జీవితం పై ఎటువంటి ఆసక్తి లేకున్నప్పటికీ గురువు ఆజ్ఞతోనే పెళ్లి చేసుకున్నారు. అలాంటిది, గురుదేవులు పీఠాన్ని అధిష్టించామని ఆజ్ఞాపించినప్పుడు మాత్రం, "నేను ఒక సాధారణ మనిషిని, ఇది నేను చేయలేను." అని నిరాకరించగా, శ్రీ బ్రహ్మానంద స్వామి వారు, "నువ్వు ఈ పీఠాన్ని అధిష్టించి తీరవలసిందే." అని బదులిచ్చి, వారి రెండు చేతులను శ్రీ శంకర్ నారాయణన్ గారి చేతులపై పెట్టి, వారి కళ్ళల్లోకి చూడవలసింది గా శ్రీ శంకర్ నారాయణన్ గారికి చెప్పి,


"గురువే బ్రహ్మ, గురువే చైతన్య శక్తి. ఆ చైత్యన్య శక్తి కుడి చక్షువు లో ఆసీనమై ఉంటుంది. నా కుడి చక్షువు పైనే పూర్తి గా నీ ద్రుష్టిని పెట్టు. నాలో ఉన్న సకల విద్యలూ, జ్ఞానం నీలోకి ప్రవహించి నిన్ను ఈ పరంపర లో నా తదనంతరం నా వారసుడిని చేస్తుంది. నేను(బ్రహ్మానంద స్వామి వారు) ఆనందామృతాన్ని, నన్ను పూర్తి గా సేవించు."

అని చెప్పారు.


("నేను గురుదేవులు చెప్పిన విధంగానే వారి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. పది, పదిహేను నిమిషాలలో ఆ మొత్తం ప్రక్రియ పూర్తయ్యింది. అక్కడ ఆ రోజు ఏం జరిగిందో నాకు ఎటువంటి అవగాహన లేదు." అని శ్రీ శంకర్ నారాయణన్ గారు ఆ సంఘటనని ఎన్నో సార్లు జ్ఞప్తి చేసుకున్నారు.)


ఆ పది, పెదిహేను నిమిషాలలో పూర్తి నిశ్శబ్దం మధ్య గురువు నుండి శిష్యునకు సకల విద్యలు, జ్ఞానం ప్రవహించింది. అది పూర్తయ్యాక శ్రీ బ్రహ్మానంద స్వామి వారు,

" సకల విద్యలు, జ్ఞానం నీలోకి ప్రవహించింది. రానున్న మూడు రోజులలో నేను శరీరాన్ని వదిలేయబోతున్నాను."

అని శ్రీ బ్రహ్మానంద స్వామి వారు శ్రీ శంకర్ నారాయణన్ గారితో చెప్పారు.


గురుదేవుల ఆజ్ఞను శిరసావహించి వారి కళ్ళల్లోకి చుసిన శ్రీ శంకర్ నారాయణన్ గారు వారి బృకూటి లో(రెండు కళ్ళ మధ్య ఉన్న స్థానం) ఒక వెలుగుని దర్శించుకున్నారు. ఆ వెలుగు దర్శనం తో వారు నిశ్చలమైన అనుభూతితో "కేవల కుంభక స్థితిని" పొందారు. అది ఉశ్వాస, నిశ్వాసలకు అతీతమైన ఒక స్థితి.


ఆ స్థితిలో ఉన్న శ్రీ శంకర్ నారాయణన్ గారితో శ్రీ బ్రహ్మానంద స్వామి వారు,

"బాహ్యం గా కనిపించేది వెలుగు కాదు. నిజమైన వెలుగు నీలోనే ఉన్నదీ. ఆ వెలుగుని ఒక్కసారి దర్శించుకుంటే ఇక అజ్ఞానానందకారములు ఉండవు. అంతరంగమై ఉన్న చైతన్య శక్తి పై ఎల్లప్పుడూ స్పృహ కలిగి ఉండటమే సహజ సమాధి స్థితి."

అని చెప్పారు.


ఇలా గురువు తన పూర్ణ జ్ఞానాన్ని సంస్కారాలకు అతీతముగా శిష్యునకు చక్షువుల ద్వారా ప్రసాదించటం "నయన దీక్షోపదేశమ్" అంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత శ్రీ శంకర్ నారాయణన్ గారు వారి గురుదేవులను వారిలోనే దర్శించుకుని, వారే స్వయంగా వారికి గురువులయ్యారనే భావన వారికి కలిగింది.


శ్రీ శంకర్ నారాయణన్ గారికి వారి గురుదేవులు "భారతానంద స్వామి" అను దీక్షా నామాన్ని ప్రసాదించినప్పటికీ వారు భారతీ స్వామి గానే అందరికి పరిచయస్తులు. బృకూటి లో వెలుగుని దర్శించుకున్న క్షణం నుండి శ్రీ భారతి స్వామి వారికి కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా ఆ వెలుగే కనిపించటం తో, వారికి మూడు రోజుల పాటు నిద్ర కూడా పట్టలేదు. ఆ వెలుగు వారిలో ప్రతిష్ట కావటానికి ఏడు రోజుల సమయం పడుతుందని శ్రీ బ్రహ్మానంద స్వామి వారు శ్రీ భారతి స్వామి వారికి చెప్పగా, ఆ ఏడు రోజులు గడవక ముందే శ్రీ బ్రహ్మానంద స్వామి వారు మహా సమాధిని పొందారు.


ప్రత్యేకమైన విధి విధానాలతో వారి సమాధి కార్యక్రమములు ఆ మఠం లో ఉన్న వారి అద్వర్యం లో జరగగా, శ్రీ బ్రహ్మానంద స్వామి వారిని చివరి సారిగా దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి ఎందరో భక్తులు, జ్ఞానులు, పండితులు మఠానికి చేరుకున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కావటానికి దాదాపు రెండు వారాల సమయం పట్టింది. తండోపతండాలు గా దేరుదేవులను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు క్రమక్రమంగా వారి వారి ఊర్లకు వెళ్ళిపోయాక, మఠం లో మళ్ళీ రోజూ వారీ కార్యక్రమములు మొదలయ్యాయి. మఠం లో ఉన్న వారందరు పీఠాన్ని అదీష్టించవలసిందిగా శ్రీ భారతి స్వామి వారిని కోరగా అయిష్టంతో, దుఃఖం తో గురుదేవులకు ఇచ్చిన మాటకు విలువిచ్చి శ్రీ భారతి స్వామి వారు ఆ పీఠాన్ని అధిష్టించారు. గురుదేవులను స్మరించుకుంటూ ఆ పీఠాన్ని మూడు రోజులు అధిష్టించిన తరువాత నాలుగవ రోజు నుండి వేద-వేదాంతాలు, గీతోపనిషదులు, బ్రహ్మసూత్రాలు వారు బోధించటం మొదలు పెట్టారు.

"బ్రహ్మానందమే వెలుగుతుంది! ముందూ, వెనకా అంతా ఉన్న బ్రహ్మానందులే నా ద్వారా పలుకుతున్నారు."

అని శ్రీ భారతి స్వామి వారు, సర్వం వారి గురుదేవులకు ఆపాదిస్తూ, అన్ని వేళల గురుభావం లోనే ఉండేవారు.


"నేను పలికితే అది శబ్దం, నా గురుదేవులు పలికితే అది స్వరం."

అని శ్రీ భారతి స్వామి వారు అంటూ ఉండేవారు.


ప్రతి రోజు ఉపన్యాసం ఇచ్చే ముందు శ్రీ భారతి స్వామి వారు శ్రీ బ్రహ్మానంద స్వామి వారిని ధ్యానించుకుని, పీఠానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి, "శ్రీ బ్రహ్మానంద స్వామి వారు ఇప్పుడు పలుకబోతున్నారు, మనమందరం భక్తి శ్రద్ధలతో వారిని విందాం." అని వారి బోధనలను వారే ఎంతో శ్రద్ద తో గురుదేవుల బోధనలుగా భావించుకుంటూ చెప్పేవారు. ఆ మహనీయుని గురుభావం అటువంటిది.


శ్రీ భారతి స్వామి

అలా ఒక సంవత్సర కాలం పాటు ఆ పీఠాన్ని అధిష్టించిన శ్రీ భారతి స్వామి వారు ఒక రోజున ఎంతో ఆకస్మికం గా ఆ పీఠాన్ని, ఆశ్రమాన్ని విడిచి, " నేను ఒక సంసారిని, బ్రహ్మచారిని కాను. ఈ పీఠాన్ని ఎవరు అధిష్టించాలనే విషయం శ్రీ బ్రహ్మానంద స్వామి వారే నిర్ణయిస్తారు. వారినే ప్రార్థిద్దాము." అని శ్రీ బ్రహ్మానంద స్వామి వారు వారికి ప్రసాదించిన ఇంటికి శ్రీ భారతి స్వామి వారు వెళ్లిపోయారు.


 

********సశేషం********

408 views0 comments

Comentários


bottom of page