top of page
Writer's pictureSriswamypoornananda.org

||శ్రీ బ్రహ్మానంద గురవే నమః|| - 2


శ్రీ బ్రహ్మానంద స్వామి వారి ఆదేశం తో శ్రీ భారతి స్వామి వారు కొంత కాలం పీఠాధిపతి గా భాద్యతలు నిర్వర్తించి, పీఠాన్ని విడిచి వెళ్లిన పిమ్మట ఒక 16 ఏళ్ళ యువకుడు పూర్తి శిక్షణ తో ఆ పీఠాన్ని అధిష్టించి, పీఠాధిపతి గా వ్యవహరించారు.


శ్రీ భారతి స్వామి వారు, వారికి శ్రీ బ్రహ్మానంద స్వామి వారు పెళ్లి సమయం లో కానుక గా ఇచ్చిన ఇంటిలో, వారి సతీమణి మీనాక్షి దేవి గారితో నివాసితులయ్యారు.


త్రికాలజ్ఞాని అయినప్పటికీ ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడే శ్రీ భారతి స్వామి వారు చాలా ముక్కుసూటి గా ఉండేవారు. వారి వస్త్రధారణ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. కౌపీన ధారి గా ఒకసారి దర్శనమిస్తే, మరొకసారి జుబ్బా వేసుకొని, తలపాగా కట్టుకొని దర్శనమిచ్చేవారు. వ్యావహారిక విషయాలకు దూరం గా ఉంటూ, తరచూ కాల జ్ఞానం, వేదాంతం, ఉపనిషదులు, గీత బోధించేందుకు సంచరిస్తూ ఉండేవారు. సభ లో భోదించే సమయాలలో ఒక్కొక్క సరి పూర్తి గా శ్రీ బ్రహ్మానంద స్వామి వారి లానే వారి స్వరం లోనే మాట్లాడే శ్రీ భారతి స్వామి వారు, తరచూ సహజ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. భూత, భవిష్యత్తు, వర్తమాన విషయాల గురించి భక్తుల అడిగే ప్రశ్నలకు వారు సమాధానమిచ్చి, ఒక వేళ భక్తులు వారికి తిను బండారాలు ఏవయినా దక్షిణ గా సమర్పించుకుంటే, వారు వాటిని తిరస్కరించేవారు కాదు.


శ్రీ మీనాక్షి దేవి గారు కూడా చాలా నిరాడంబరమైన గృహిణి గా, శ్రీ భారతి స్వామి వారిని సేవించుకుంటూ, ఇంటి వ్యవహారాలను చక్కదిద్దుకునే వారు. ఆరు సార్లు గర్భస్రావం తరువాత, శ్రీ భారతి స్వామి వారితో కలసి తీర్థయాత్రకై రామేశ్వరం వెళ్లిన మీనాక్షి దేవి గారు, వారికి సంతానం కలిగితే అక్కడి అధిష్టాన దేవత అయిన శ్రీ పర్వత వర్ధని అమ్మవారి పేరే వారికి కలిగే సంతానానికి పెట్టుకుంటామని మొక్కుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం చేత కొంత కాలానికి వారికి ఒక ఆడ బిడ్డ జన్మించగా, అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారమే ఆ దంపతులకు కలిగిన ఏకైక సంతానమైన ఆ ఆడ బిడ్డకు పర్వతవర్ధని అని నామకరణం చేశారు.


శ్రీ భారతి స్వామి వారి నిరంతర గురుస్మరణ వారి కుటుంబ సభ్యులను ఒక్కోసారి నిబదాశ్చర్యానికి గురిచేసేది. చివరకు వారు ఏదైనా చిన్న విషయాన్నీ వివరించాలి అన్నా కూడా అక్కడ వారి గురువుదేవులను స్మరించుకుంటూనే వివరించేవారు. అందుకోక ఉదాహరణగా, వారి బంధువులకు ఒకరి రాక గురించి తెలియచేయవలసిన టెలిగ్రాము లో, "శ్రీ బ్రహ్మానంద గురవే నమః, తల్లిగారిని అటు పంపించాము, శ్రీ బ్రహ్మానంద గురవే నమః" అని అక్కడ కూడా వారి గురుదేవుల నామాన్నే వారు చెప్పవలసిన విషయానికి ముందు వెనక జోడించి చెప్పేవారు.



పర్వతవర్ధిని (మాతాజీ)

అన్ని వేళల శ్రీ బ్రహ్మానంద స్వామి వారి స్మరణలో ఉన్న శ్రీ భారతి స్వామి వారికి , మీనాక్షి దేవి గారు, కుమార్తె పెళ్లి భాద్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారు. "కుమార్తె పెళ్లి భాద్యత ఇప్పుడు మనపై ఉన్నది, ఆమెకు తగిన వరుడ్ని సత్వరగా మీరు తీసుకురవాలి." అని మీనాక్షి దేవి గారు శ్రీ భారతి స్వామి వారితో అంటూ ఉండేవారు. కానీ శ్రీ భారతి స్వామి వారు మాత్రం ఆ మాటలను విని విననట్టే ఊరుకునేవారు. అలాంటిది ఒకరోజు శ్రీ భారతి స్వామి వారు హఠాత్తుగా ఇంటి నుండి బయలుదేరుతూ, మీనాక్షి దేవి గారితో, " మన అమ్మాయికి పెళ్లి సంబంధం చూడటానికి వెళుతున్నాను. తగిన వరుడిని తీస్కొని వస్తాను." అని చేతిలో రూపాయి కూడా లేకుండా మధురై రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.







మధురై స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి వద్దకు వెళ్లిన శ్రీ భారతి స్వామి వారు, "నువ్వు ఈ రైలు టిక్కెట్టు కొన్నది నీ ప్రయాణం కోసం కాదు, నా ప్రయాణం కోసం. నువ్వు ఉన్నపళంగా ఇప్పుడు నీ ఊరికి తిరిగి వెళ్ళిపో. పది రోజుల తరువాత వచ్చి నన్ను కలవు. బ్రహ్మానంద గురవే నమః." అని చెప్పగా ఆ వ్యక్తి తన ప్రయాణం కొరకు కొనుక్కున్న రైలు టిక్కెట్టును శ్రీ భారతి స్వామి వారికి ఇచ్చి వెంటనే తన ఊరికి తిరుగు పయనమయ్యారు. శ్రీ భారతి స్వామి వారి దివ్య దృష్ఠి తో, ఆ వ్యక్తి కూతురుకి వారి ఊరిలో ఒక అగ్ని ప్రమాదం జరగబోతుంది అని చూసి సకాలం లో ఆ వ్యక్తి తన ఊరికి చేరుకునేలా చేశారు.

ఆ వికతి సకాలం లో ఇంటికి చేరుకొని అతని కూతురిని రక్షించుకొని, శ్రీ భారతి స్వామి వారి ఆదేశం మేరకు పది రోజుల తరువాత వచ్చి వారిని మళ్ళి దర్శించుకొని శ్రీ భారతి స్వామి వారికి ఒక గొప్ప భక్తుడయ్యారు. వృత్తి రిత్యా వస్త్ర వ్యాపారి అయినా ఆ వ్యక్తి అప్పటి నుండి శ్రీ భారతి స్వామి వారి కుటంబానికి కావలసిన వస్త్రాలను కృతజ్ఞత భావం తో, భక్తి తో దక్షిణగా ఇస్తూ వచ్చారు.


అలా ఆ వ్యక్తి చేతిలో నుండి రైలు టికెట్ తీసుకొని ఒక ప్రాణం కాపాడి, మద్రాసు వెళ్లే ఆ రైలు ఎక్కినా శ్రీ భారతి స్వామి వారు ఎంతో సౌకర్యవంతం గా ప్రయాణించి మద్రాసు కి చేరుకున్నారు. ఆ రైలు లో కూడా శ్రీ భారతి స్వామి వారి త్రికాలజ్ఞానంతో వారి తోటి ప్రయాణికులు ఎందరో ఎన్నో అద్భుతానుభవాలు పొంది శ్రీ భారతి స్వామి వారికి భక్తులయ్యారు.


వారి కుమార్తెకు తగిన వరుడిని తీసుకొచ్చే పనిలో మద్రాసుకు చేరుకున్న శ్రీ భారతి స్వామి వారు, ఎగ్మోర్ రైల్వేస్టేషన్ బయటకు వచ్చి రాగానే సరాసరి ఒక రిక్షా నడిపే వ్యక్తిని, "ఓ ముత్తయ్య! ఇటు రా!" అని పిలిచారు. ఒక అపరిచితుడు అలా పేరు పెట్టి పిలవటంతో ఆ రిక్షా నడిపే వ్యక్తి ఎంతో ఆశ్చర్యంతో శ్రీ భారతి స్వామి వారి వద్దకు రాగా, శ్రీ భారతి స్వామి వారు అతనితో, "నీ జీవితం లో ఇవాళ ఎంతో ప్రత్యేకమైనది. ఒక త్రికాలజ్ఞాని నీ రిక్షాలో ప్రయాణం చేయబోతున్నారు. పురసవాకం కి తీసుకెళ్ళు." అని శ్రీ భారతి స్వామి వారు ఆ రిక్షా లో ఆసీనులయ్యారు. ఎగ్మోర్ కు ఎంతో సమీపం లో ఉన్న పుసరవాకం లో వెళ్ళేల వీధిలోకి తీసుకువెళ్లవలసిందిగా శ్రీ భారతి స్వామి వారు ఆ రిక్షా అతనిని ఆదేశించారు. "అలానే ముందుకు తీసుకువెళ్లి 44వ అంకె గల ఇంటి ముందు ఆపు.", అని శ్రీ భారతి స్వామి వారు చెప్పగా, ఆ రిక్షా అతను శ్రీ భారతి స్వామి వారు చెప్పిన విధముగానే, ఒక రిక్షా కూడా అతి కష్టం మీద పట్టేంత ఇరుకు వీధిలో 44వ అంకె గల ఇంటి ముందు అతను రిక్షా ఆపాడు. శ్రీ భారతి స్వామి వారు రిక్షా నుండి దిగి సరాసరి ఆ ఇంటి తలుపు కొడుతూ, " హరి హరన్ అయ్యర్! హరి హరన్ అయ్యర్!", అని పిలవసాగారు.


ఆ ప్రాంతంలో ఎంతో గౌరవ మర్యాదలను పొందుతున్న శ్రీ హరి హరన్ అయ్యర్ గారికి అలా ఒకరు పేరు పెట్టి పిలవటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. వచ్చింది ఎవరని తెలుసుకునే ఉబలాటం తో తలుపు తెరిచిన శ్రీ హరి హరన్ అయ్యర్ గారి కళ్ళకు ఒక గొప్ప కాంతి స్వరూపం దర్శనమిచ్చింది. ఆ వెలుగు లో వారు అక్కడ మనిషిని పోల్చుకోలేకపోయారు. ఆ వెలుగును చూసి నివ్వెరపోయి శ్రీ హరి హరన్ అయ్యర్ గారు అక్కడే శ్రీ భారతి స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. వచ్చిన ఆ మహనీయులు ఎవరని అడిగేలోగా శ్రీ భారతి స్వామి వారు, "నేను శ్రీ బ్రహ్మానంద స్వామి వారి శిష్యుడను, భారతి స్వామిగా నన్ను పోల్చుకోవచ్చు. సేదతీరేందుకు నాకొక గదిని ఏర్పాటు చేసి, వేడి గా నాకొక కాఫీ తీసుకురా.", అని శ్రీ భారతి స్వామి వారే శ్రీ హరి హరన్ అయ్యర్ గారిని ఇంట్లోకి తీసుకు వెళ్లి, ఒక గదిలో సేద తీరుతూ, రిక్షా అతనికి రెండు రూపాయలు ఇవ్వవలసిందిగా శ్రీ హరి హరన్ అయ్యర్ గారిని ఆదేశించారు.


"నీ సోదరుని కుమారుడు, శ్రీ సుబ్రమణ్య శాస్త్రీ గారు ఇక్కడ మైలాపూర్ సంస్కృత కళాశాల లో చదువుతున్నారని తెలుసుకొని ఇటు వచ్చాను.రాబోయే కాలం లో వారు ఒక గొప్ప జ్ఞానిగా అవతరించనున్నారు. కల్లడైకురిచ్చి లో ఒక మహాత్ములు శ్రీ సుబ్రమణ్య శాస్త్రీ గారికి గురువర్యులు కానున్నారు. వారి నుండే శ్రీ సుబ్రమణ్య శాస్త్రీ గారు ఉపదేశం పొందనున్నారు. మా కుమార్తెకు వారితో వివాహము నిశ్చయమైనది. ఇది దైవ సంకల్పము. దీన్ని ఆపే ప్రయత్నం కానీ, దీనికి అడ్డు పడే పనులు కానీ చేయకుండా, నా ఆదేశాన్ని పాటించు. వెళ్లి స్నానానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. బ్రహ్మానంద గురవే నమః."

అని శ్రీ భారతి స్వామి వారు శ్రీ హరిహరన్ అయ్యర్ గారికి కాలజ్ఞానాన్ని బోధించి, స్నానానికి వెళ్లిపోయారు. శ్రీ హరిహరన్ అయ్యర్ గారు శ్రీ భారతి స్వామి వారి త్రికాలజ్ఞానానికి ఆశ్చర్యచకితులయ్యారు.


శ్రీ భారతి స్వామి వారి త్రికాలజ్ఞానంతో చెప్పిన విధముగానే, శ్రీ హరిహరన్ అయ్యర్ గారి సోదరుని కుమారులైన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు మైలాపూర్ సంస్కృత కళాశాలలో చదువుతున్నారు. వారు తిరునెల్వేలి కి ఇరవై మైళ్ళ దూరాన ఉన్న పిల్లయర్కులం అనే ఒక చిన్న గ్రామం. తమిళం లో పిల్లయర్ అంటే గణపతి, కుళం అంటే కొలను . ఆ ఊరిలో వెలసిన అతి పవిత్రమైన కొలను లో గణపతి విగ్రహం వెలసి ఉన్నందువలన ఆ ఊరికి పిళ్ళయార్కులం అనే పేరు వచ్చింది. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తల్లి తండ్రులు ముత్తులక్ష్మి అమ్మ గారు, పిచుమని అయ్యర్ గారు. ఈ దంపతులకు కలిగిన సంతానమే సుబ్బులక్ష్మి గారు , కాశీ శంకర్నారాయణన్ అయ్యర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, పార్వతి గారు. వీరిలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి రెండవ కుమారులు. శ్రీ పిచుమని అయ్యర్ గారు ఎన్నో దేవతా సంకీర్తనలను సొంతంగా విరచించారు. ఉన్నఫలంగా భగవంతుని ప్రార్థిస్తూ అలా వారు ఎన్నో కీర్తనలు రచించారు. వారు రచించిన ప్రతి కీర్తన బహుదృక్పదాలు కలిగి ఉండేవి. వారికి 'కవిరాయ' అనే బిరుదు కూడా కలదు.


పిళ్ళయార్కులం నుండి వ్యాపార నిమిత్తం శ్రీ పిచుమని అయ్యర్ గారి కుటుంబం త్రివేండ్రం కి చేరుకోగా, 1906లో శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు త్రివేండ్రంలో జన్మించారు. శ్రీ పిచుమని అయ్యర్ గారు, వారి సొంత ఓడ లో రంగూన్ బియ్యం బర్మా నుండి, అలాగే మలేసియా నుండి కూడా బియ్యం త్రివేండ్రంకు దిగుమతి చేసి వర్తకులకు అమ్మేవారు. అలా వారు అనాది కాలంలోనే సంపన్నులై త్రివేండ్రం లో ఒక పెద్ద వ్యాపారిగా పేరు తెచ్చుకున్నారు. అక్కడ సత్సంగాలు, భజనల కోరకు ఒక పెద్ద మండపాన్ని కూడా వారు నిర్మించారు.




అలా అంతా సజావుగా సాగుతున్న వారి కుటుంబం ఒక పెద్ద సంక్షోభాన్ని చూసింది. శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు 7 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, బర్మా నుండి ఎప్పటిలానే శ్రీ పిచుమని అయ్యర్ గారి ఓడ బియ్యం తో త్రివేండ్రం కి బయలుదేరింది. సముద్ర ఆధిపత్యం కోసం జపాన్ దేశం చేస్తున్న దాడిలో, మార్గమధ్యం లో ఆ ఓడ సముద్రం లో మునిగిపోయింది. ఆ సంఘటన శ్రీ పిచుమని అయ్యర్ గారికి ఎంతో నష్టాన్ని తెచ్చి పెట్టింది. వారికి ఉన్నదంతా అమ్మేసి ఉన్న బాకీలు అన్ని తీర్చి, శ్రీ పిచుమని అయ్యర్ గారు మళ్ళీ పిళ్ళయార్కులంకు చేరుకున్నారు. శ్రీ పిచుమని అయ్యర్ గారి పెద్ద కుమారులైన శ్రీ కాశీ శంకర్నారాయణన్ అయ్యర్ గారిని శ్రీ పిచుమని అయ్యర్ గారి సోదరులైన శ్రీ హరిహరన్ అయ్యర్ గారు ప్రాధమిక విద్య నిమిత్తం వారితో మద్రాసుకు తీసుకు వెళ్లగా, శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారిని తిరునెల్వేలికి సమీపం లో ఉన్న తిరుచందూర్ లో సంస్కృత పాఠశాల లో శ్రీ పిచుమని అయ్యర్ గారు చేర్చారు. శ్రీ సుబ్రమణ్య స్వామి వారి అతి ముఖ్యమైన క్షేత్రాలలో ఒకటైన తిరుచందూర్ లో శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు సంస్కృత పాఠాలతో పాటుగా వేదాలను వల్లెవేస్తూ సంసృత భాషలో ప్రావీణ్యత సంపాదించటమే కాక, సంసృత ప్రాథమిక పరీక్షలో ఉతీర్ణత సాధించారు.


కుమారుల విద్యాభ్యాస భాద్యతలను నిర్వర్తించే పనిలో రెండేళ్లపాటు పిళ్ళయార్కులం లో ఉన్న శ్రీ పిచుమని అయ్యర్ గారు, ఆ తరువాత సింగపూర్ కి, అక్కడి నుండి పెనంగ్ వెళ్లి చివరికి ఇప్పో లో స్థిరపడ్డారు.


 

********సశేషం********



249 views0 comments

Comments


bottom of page