top of page

|| యతో వాచో నివర్తంతే ||

Updated: Apr 21, 2020

ఓం నమో భగవతే పూర్ణానందాయ


ఒక మహాత్ముని గురించి చెప్పడం చాలా దుర్లభం.ఎందుకంటే శాస్త్రాలు కూడా ఆ పరబ్రహ్మ తత్వాని గురించి చెప్పమంటే అవి "యతో వాచో నివర్తంతే" అన్నాయి.ఎందుకంటే పరబ్రహ్మ తత్వాన్ని గురించి చెప్పడం అనేది వాక్కుకు అతీతమైనది. అటువంటి వాక్కుకు అతీతమైన స్వరూపం ఒక రూపం ధరించి ఈ లోకంలో కి వస్తే మాయామోహితులైనటువంటి మానవులు వారిని గుర్తించటం చాలా కష్టం.ఎందుకంటే వారు మానవ రూపంలో ఉంటారు మనలాగే జ్ఞానేంద్రియాలు,కర్మేంద్రియాలు శరీరం అన్నీ ఉంటాయి.అందుకని మనం వారిని సామాన్య మానవుడు అని అనుకుంటాం కానీ, వారిని మహాత్మునిగా చూడటం చాలా కష్టం. వారి యొక్క తత్వాన్ని మనకు బోధపరచెట్టుగా వారు చేస్తేనే మనం వారిని గుర్తించగలం.వారు చేయవలసిందే కానీ మనంతట మనం వారిని గుర్తించటం చాలా దుర్లభం.

- బి రాధా కృష్ణ మూర్తి (బి.ఆర్.కె)


 

పైన చెప్పిన విధంగానే నేను కూడా 1962సం"లో ఉద్యోగ నిమిత్తం శ్రీశైలానికి వచ్చాను.వచ్చిన దగ్గర నుంచీ కీకారణ్యం మధ్యలో ఆఫీస్ లు ఉన్నాయి.అందరూ బిక్కు బిక్కు మంటూ అడవుల్లో ఉన్నాం.అప్పుడే ఆఫీస్ లు కొత్తగా ఒపెన్ చేశారు.అందుకని ఉన్న నలుగురం కలసి ఐకమత్యంగా ఉండి,ఒకల్లకు ఒక్కలం చాలా ఆప్యాయంగా ఉన్నటువంటి రోజులు.అటువంటి రోజులో రేడియో టివి ల వంటివి లేవు.కాబట్టి కాలక్షేపం కోసం ఏదో ఒక సత్సంగం లాంటి కార్యక్రమం చేసుకుంటే బావుంటుందని ప్రతి శనివరం ఒక్కళ్ళ ఇంట్లో అందరం కలిసి రామ భజన చేసుకుంటూ కూర్చున్నాం. 1962 నుంచి 1969 వరకు 7 సంవత్సరాలు అలా సత్సంగాలు నడిచాయి. ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఉత్సవాలు జరుపుతూ వుండేవాళ్ళం. శ్రీ రామచంద్రుని సేవ లో నిమగ్నమై ఉన్నటువంటి నాలాంటి అల్పజీవి కి ఒక రోజు మా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ గారు అనే వారు మా సత్సంగానికి వచ్చారు."నేను శ్రీశైలం లో ఒక మహానుభావుని చూచాను.వారిని దర్శించగానే నాకు ఏదో ఒక ఆప్యయమైన భావం కలిగి,శరీరం రోమాంచితం అయినది.నేను వారిని తిరుపతి సత్రంలో పైభాగంలో చూచాను.నేను రోడ్డు మీద నుండే వారిని దర్శించుకున్నాను. కానీ మళ్ళీ నా ప్రారబ్ధవశాత్తు వెనక్కి రావలసి వచ్చింది.అయితే ఆ మహానుభావుడినీ గురించి మాటలలో చెప్పటం చాలా కష్టం", అని చెప్పారు. అటువంటి మహానుభావులు శ్రీశైలం లో ఉన్నారు అంటే వారిని చూద్దాం అని ప్రయత్నం చేస్తే వారు తిరుపతి సత్రం లో లేరు. విషయం తెలుసుకుందామని తిరుపతి సత్రంలో అడిగితే వారు ఉన్నమాట వాస్తవమే కానీ ఇప్పుడు ఇక్కడ లేరు, రెండు రోజుల క్రితమే వెళ్లిపోయారు అని చెప్పారు. అక్కడి నుంచి మేము తిరిగి వచ్చేశాము.

ఒక రోజు సాయంత్రం హటకేశ్వరం లో నలుగురు మిత్రులతో వస్తుండగా ఒక చెట్టు క్రింద మహా శివ స్వరూపాన్ని దర్శించుకునాన్ను. కౌపీనధారి,జటాధారి అయినటువంటి ఆ మహానుభావుని చూడగానే,

"ఇక్కడ ఈ శివుని విగ్రహాన్ని పెట్టింది ఎవరు?", అని అనుకున్నాను. మొదట ఆ స్వరూపాన్ని చూచి నేను విగ్రహం అనుకున్నాను.ఆ రూపము సదాశివుడు కూర్చుని తపస్సు లో ఉన్నట్లు గా ఉన్నది.

ఆ రూపాన్ని చూచి ముందుకు పోవడానికి ధైర్యం చాలక, అక్కడినుంచే నమస్కారం చేసుకొని సుమారు రాత్రి 7గంటలకు నడుచుకుంటూ ఇల్లు చేరుకున్నాము. రాత్రంతా, "అక్కడ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించి ఉండవచ్చు?", అని ఆలోచించాను. "పోని వారు నిజంగా మానవరూపంలో ఉన్నటువంటి మహానుభావులు ఏమో?", అన్న ఆలోచన కూడా కలిగింది.


1969లో శ్రీ స్వామీజీ

మరుసటిరోజు ఉదయం 9గంటలకు బయలుదేరి అక్కడికి వెళ్లి చూస్తే విగ్రహం లాగానే ఉన్నారు, కానీ మనిషే అని అర్థం అయింది! వారు కూర్చున్న చోట నుంచి కదలకుండా అదే విధంగా కూర్చుని ఉండటం చూచి ఆశ్చర్యం చెందాను.కొద్దిసేపు వారినలా పరీక్షగా చూచి నా ఆఫీసుకు సమయం కావటం తో నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ సాయంత్రం అక్కడకు వెళ్ళాను.వారిని మళ్ళీ అదే విధంగా గా కూర్చుని ఉండటం చూచాను! కాస్త వారికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించాను! వారి ముఖచ్చాయలో నా కదలిక వల్ల ఎటువంటి మార్పు కనబడలేదు. వారు ఏదో క్రింగట చూస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో నిశ్చలం గా వున్నారు. నేను వారికి దగ్గరగా వెళ్ళతున్నపటికి వారిలో ఏ విధమైనటువంటి కదలికా కనబడక పోవడంతో నాకు భయం కలిగింది.


అట్లా కొద్ది కోద్ధిగా ఒక వారం రోజుల పాటు వారిని అతి సమీపం నుండి చూడటానికి ప్రయత్నించాను. ఇలా పగలూ రాత్రి జరుగుతుండగా, ఒకరోజు వారు లేచి ఫాలధార వైపుకు స్నానానికి వెళ్ళడం నేను గమనించాను. వారి వెనకాలే వెళ్ళే ప్రయత్నం చేశాను. కానీ అప్పుడు కూడా వారు నన్ను గమనించినట్లుగా అనిపించలేదు.వారు ఎప్పుడూ నన్ను, "ఎందుకు వచ్చావు?, ఏమిటి?", అని అడగకపోవటం నాకు కొంచం వింతగానే అనిపించింది. .బంగారు వర్ణంలో ఉన్న ఆ రూపానికి నేను ముగ్ధుణయ్యాను. వారు నన్ను పలకరించడం లేదు అన్న భావన నాకు అంతకంతకూ పెరగసాగింది. వారు ఫాలదార లో స్నానం చేస్తున్నప్పుడు వారి శరీరం నుండి ఒక విధమైన కాంతి బయటకు రావడం నేను దర్శించాను. వారు నన్ను ఆ విధం గా అనుగ్రహించారని అనుకున్నాను.


ఈ విధంగా వారికి దగ్గర అవ్వటానికి ప్రయత్నిస్తూ, కొంతకాలం గడిచాక గానీ నాకు వారు పూర్తిగా మానవులే అన్న నమ్మకం కలుగలేదు. "బహుశా వారు మౌన స్వామి అయ్యిఉంటారు", అని నేను భావించాను.అప్పటికే కొంతమంది మౌన స్వాముల గురించి విని,చూచి ఉండటం వలన నాకు ఆ భావన కలిగింది. వారి దృష్టి నాపై పడకపోవడంతో వారి దృష్టిని నాపైకి మరలించుకోవాలి అన్న ఒక దుష్ట భావంతో వారి చేతిని కదిలించాను. అప్పుడు వారు చిన్నగా ఆంగ్లంలో


"what for you are coming? ( నీవు దేనికి వస్తున్నావు?), life is very short(జీవితం చాలా చిన్నది), Do some sadhana(ఏదైనా సాధన చేయి)." అని అన్నారు.

వారు అలా ఆంగ్లం లో మాట్లాడటం వినేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.వెంటనే భయభ్రాంతుడనై ఫాలధార వద్దకు వెళ్ళిపోయాను.అక్కడ కొంత భయం తగ్గిన తర్వాత వారు మామూలుగాసంభాషిస్తారని తెలుసుకొని మరుసటిరోజు వారి దర్శనానికి వెళ్ళాను.అక్కడ నేను వారిని క్షమాపణలు కోరుతూ," స్వామీ!చాలా మర్కట చేష్టలు చేసిన మాట వాస్తవమే. కానీ,మీరెవరో తెలుసుకుందాం అని అట్లా ప్రవర్తించాను", అని చెప్పాను. వారు కూడా ఏమీ ఫర్వాలేదు అన్నారు. అప్పటి నుండి వారి వద్ద ఉండి, అసలు వారు ఏమి చేస్తుంటారా? అని చూచాను. వారు అక్కడ ఉన్నటువంటి చిన్న గుడిసె వంటి కుటీరం యొక్క ముందు భాగం లో కూర్చుని ఉంటారు. అక్కడ వారు చదవటానికి పుస్తకాలు గానీ, వస్తువులు గాని ఏమీ లేవు. వారి సన్నిధానం లో నేను ఒక సాధువుని కూడా చూచాను.వారిని నేను ప్రశ్నించగా వారు, ఈ స్వామి వారితో కలిసి షిరిడీ నుండి వచ్చారని,వారి పేరు రమణ బాబా అని, ఈ స్వామి వారు వారికి మంత్రోపదేశం చేశారని చెప్పారు.


శ్రీ స్వామీజీతో సత్యనారాయణ గారు

 

********సశేషం********
1,073 views0 comments

Comments


bottom of page