top of page

|| యతో వాచో నివర్తంతే || - 2

Updated: Apr 21, 2020


శ్రీ పూర్ణానంద స్వామి వారు 1968, డిసెంబర్ 25వ తేదీన, పరమ గురువులైన శ్రీ రాఖాడీ బాబా ( ఓంకారానంద స్వామి) వారి ఆదేశం మేరకు, పరమేష్ఠి గురువులు శ్రీ నిత్యానంద స్వామి వారి సన్నిధానమైన గణేశ్ పూరి నుండి బయలుదేరి, మొదట షిరిడీ చేరుకున్నారు. 1969, జనవరి 14వ తేదీన షిరిడీ నుండి కాలినడకన బయలుదేరిన స్వామివారు త్ర్యంబకేశ్వర్,గాన్గాపూర్, మంత్రాలయం, కర్నూలు, ఆత్మకూరు, బయర్లూటి మీదుగా 1969, ఫిబ్రవరి 26న శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలంలో ౩౩ రోజులు గడిపిన తదుపరి, అక్కడ నుండి హఠకేశ్వరం చేరుకున్నారు. అప్పట్లో హఠకేశ్వరం ఒక కీకారణ్యం. అక్కడికి వెళ్ళటానికి ఇప్పుడున్నంత సౌకర్యవంతంగా అప్పట్లో ఉండేది కాదు. హఠకేశ్వర స్వామి దేవాలయానికి సమీపాన ఉన్న పాలధార-పంచధార వద్ద శ్రీ ఆది శంకరాచార్యులు శివానంద లహరి విరచించారని చరిత్ర చెబుతుంది. అటువంటి ఎన్నో చారిత్రక విశిష్టతలు కలిగిన హఠకేశ్వరానికి శ్రీ స్వామి వారు ఏప్రిల్ 2వ తేదీన చేరుకున్నారు.

- బి రాధా కృష్ణ మూర్తి (బి.ఆర్.కె)


 

ఇప్పుడు నేను చెప్పేదంతా 50 సంవత్సరాల పూర్వపు చరిత్ర. మా పూర్వపుణ్య విశేషం వల్ల, స్వామి వారి అనుగ్రహం చేత 1969వ సంవత్సరం, ఏప్రిల్ నెలలో, నేను(బి.ఆర్.కే గారు), కారంగి కృష్ణమూర్తి గారు, నందికొట్కూరు వెంకట రామరాజు గారు, చక్రపాణి గారు మొదలగు వారం స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి వారి స్వరూపానికే ముగ్ధులైనవారము మేము. మాకు ఆధ్యాత్మిక విషయాలు అప్పటికి తెలియవు, మనో దౌర్బల్యం చాలా ఎక్కువ. అప్పటి మా జీవన ప్రమాణాలు చెప్పాలంటే, అప్పుడు మా జీతాలు చాలా తక్కువ. ఇల్లు గడవాలంటేనే అంతంతమాత్రంగా ఉండే రోజులవి. స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటె నడిచి పోవాలి,లేదా బస్ఎక్కి జంక్షన్ లో దిగి అక్కడినుంచి నడిచి వెళ్ళాలి, లేదా గవర్నమెంట్ జీపులు ఏవైనా పట్టుకొని వెళ్ళాలి. ఏదో విధంగా రోజూ సాయంత్రం స్వామివారి దర్శనం కోసం వెళ్ళేవాళ్ళం.

స్వామివారి స్వరూపానికి ముగ్ధులమై దర్శనానికి వెళ్ళే మమ్మల్ని, స్వామివారు మెల్లగా సాధనా మార్గం వైపు నడిపించారు. జపాలు, తర్పణాలు, హోమాలు,ధ్యానాలు లాంటివేవీ మాకు అప్పట్లో తెలియవు. అయితే స్వామివారి దివ్య మంగళ స్వరూపం చూస్తేనే ఆనందం కలిగేది. అప్పుడు స్వామివారు మొట్టమొదటిసారి "సర్వమంగళ మాంగళ్యే" అనే శ్లోకాన్ని అందరికీ ఉపదేశించారు.

అప్పటి మా జీవన ప్రమాణాలు కొంత విచిత్రంగా ఉండేవి. వంద రూపాయలని చాలా గొప్పగా చూసుకున్న రోజులవి.అయితే నెలకి 30-40 రుపాయిలతో అప్పటి ఆశ్రమ నిర్వహణ బాధ్యతను స్వయంగా నాకు నేనుగా స్వీకరించాను.అలా వారికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటూ ఉండగా, స్వామివారి సౌకర్యార్థం,వారి వద్ద ఏదైనా దుప్పటో, వస్తువో ఉంచామా! అది అక్కడ నిలువదు. మూడోనాటికి వేరేవారి వద్ద ఉంటుంది.

స్వామివారి వద్ద రమణ బాబా, నమఃశివాయ అనే ఇద్దరు సాధువులు ఉండేవారు. వారికి భోజన సదుపాయం చేస్తే బాగుండు అన్న ఉద్దేశంతో మేము నలుగురం కూడబలుక్కొని, నాలుగు సత్తు గిన్నెలు,కొంత బియ్యం,పప్పులు కొని తీసుకెళ్ళాము. స్వామివారు అప్పుడప్పుడు బ్లాక్ కాఫీగాని , టీ కానీ తాగడం తప్ప, భోజనం చేయరని తెలుసుకొని టీ పొడి,కాఫీ పొడి, పంచదార కూడా కొనిపెట్టాము. అవి చూసిన స్వామి వారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అక్కడున్న రమణ బాబా గారిని నమఃశివాయ గారిని వంట చేసుకోమని చెప్పి వెళ్ళాము. అయితే మరుసటి రోజున వెళ్లి చూస్తే గిన్నెలు, తెచ్చిన సరుకులు అక్కడ లేవు. ఏమయ్యాయని కనుక్కుంటే,

"సన్యాసులు వంట చేసుకోకూడదు, బిక్షాటన మీద బ్రతకాలని స్వామి వారు అన్నారు. తెచ్చిన గిన్నెలు, సరుకులు స్వామి వారు చెంచువాళ్ళకి ఇచ్చేసారు."

, అని రమణ బాబా మాతో అన్నారు. అయ్యో!ఇంతా కష్టపడి తెచ్చినవి అలా చెంచు వాళ్లకి వెళ్లిపోయాయని మా అందరికీ నిస్పృహ కలిగింది.


ఓం నమ: శివాయ స్వామి, గజానన్ స్వామి, స్వామిజీ, రమణ బాబా

అలా స్వామివారు అన్నిటినీ దానమిచ్చేవారు. అన్నీ ఇవ్వటమే తప్ప, తమకోసం అట్టిపెట్టుకునే గుణం కాదు వారిది. ఒక చిన్న కుటీరం వంటి గుడిసలో ఉంటున్న స్వామి వారి వద్ద రెండు కౌపీనాలు, ఒక తుండు గుడ్డ(towel), ఒక విభూతి డబ్బా, ఒక కుంకుమ డబ్బా ఉండేవి. అవే వారికంటూ ఉన్న సొంత వస్తువులు. అంతకు మించి వారి వద్ద ప్రత్యేకించి వేరే వస్త్రాలు కూడా ఉండేవి కావు.


 

********సశేషం********


787 views0 comments

               Sri Swamy Poornananda Ashram

                          P-4, Contractors Colony, Srisailam Dam East,

                      Kurnool District-518 102.  Phone :  9494561339

Picture1.png
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page