top of page

|| యతో వాచో నివర్తంతే || - 8

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


హఠకేశ్వర ప్రాంతం అప్పట్లో ఒక కీకారణ్యం. సూర్యాస్తమయం తర్వాత ఆ ప్రాంతమంతా చాలా నిర్మానుష్యంగా ఉండేది.జనసంచారం లేని ప్రాంతం అవ్వటం వలన, ఎలుగుబంట్లు, పులులు, భయంకరమైన విష సర్పాలు చీకటి పడ్డాక అక్కడ సంచరిస్తూ ఉండేవి. అక్కడి అడవిలో నివాసం ఉండే చెంచు వాళ్ళు కూడా సూర్యాస్తమయం దాటాక సాధారణంగా బయటకు రారు. మా ఉద్యోగాల రీత్యా, స్వామి వారి దర్శనానికి హఠకేశ్వరం వెళ్ళాలి అంటే సాయంత్రాలే వీలుపడేది. అలా స్వామి వారి దర్శనమయ్యాక, ఆ అడవి లో నుండే నడుచుకుంటూ ప్రాజెక్ట్ కాలనీ కి చేరుకునే వాళ్ళం. 1969లో హఠకేశ్వరం లో శ్రీ స్వామి వారి దర్శనం చేసుకున్న వారిలో స్వామి రంగయ్య గారు ఒకరు. ఒక్కోసారి మేము వారితో పాటు వారి జీప్ లో హఠకేశ్వరం నుండి ప్రాజెక్ట్ కాలనీకి చేరుకునేవాళ్ళం.


 

అలా ఒకరోజు సాయంత్రం హఠకేశ్వర ఆశ్రమానికి స్వామివారి దర్శనార్థం వెళ్లాను. సూర్యాస్తమయం తర్వాత పొదల్లోనుంచి ఒక ఎలుగుబంటి వచ్చినట్లు చప్పుడు చేసుకుంటూ ఒక ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం సమీపానికొచ్చాక, మనిషే అని తెలిసింది. దిగంబరంగా, పొడవైన గోళ్లు, జటాజూటాలతో ఉన్నారు. వారు నేరుగా స్వామివారి వద్దకు వచ్చి స్వామివారిని చూస్తూ కూర్చున్నారు.స్వామివారు కూడా వారిని చూస్తూ కూర్చున్నారు.వీళ్ళు ఏ భాష మాట్లాడుకుంటారా? అని నేను చూస్తూ కూర్చున్నాను. కానీ ఎన్ని గంటలు గడిచినా వారి మధ్య మాటా - పలుకు అనేది లేదు. మౌనంగా ఉండిపోయారు. ఈ సంఘటనను మిత్రులంతా చూస్తే బాగుండు కదా అని, నేను ఉన్నపళాన సున్నిపెంటకు సెరవేగంగా వచ్చి,వాళ్ళకు విషయం తెలియ చేసాను. అదే సమయంలో ఆ ప్రాంతమంతా ఒక పెద్ద గాలి వానొచ్చింది. ఆ గాలి వాన కారణంగా వారెవరూ హఠకేశ్వరం రాలేకపోయారు.ఆ వర్షం ఆగాక నేను తిరిగి హఠకేశ్వరం వెళ్లాను. మరుసటి రోజున, ఆ వచ్చిన అవధూత తిరిగి అడవిలోకి వెళ్లిపోయారు. ఎప్పుడో పురాణాలలో వివరించినట్లు, అడవుల్లో అవధూతలు ఉంటారని వినడమే కానీ నేను నా కళ్ళతో చూచింది లేదు. ఆలా ఆ రోజు శ్రీ స్వామి వారి అనుగ్రహం వలన, నాకు అడవి లో ఉండే ఒక అవధూత దర్శన భాగ్యం కలిగినిది.


కొన్నాళ్ళకి స్వామి వారి వద్దకు మరొక అవధూత వచ్చారు. వారు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. వారు శ్రీ స్వామి వారి ఆశ్రమ సమీపంలో , ఈ లోకం తో ఎటువంటి సంబంధం లేనట్టుగా ఏదో పరధ్యాసలో వారిలో వారే నవ్వుకుంటూ కూర్చున్నారు. ఈ అవధూతను నాతో పాటూ, అప్పటి భక్తులు కోందరు దర్శించుకున్నారు. వీరి వంటి మీద కొన్ని వందల ఎర్రటి కొండచీమలు పాకుతూనే ఉన్నా,వారు అలా నవ్వుతూనే కూర్చున్నారే తప్ప ఉలుకూ పలుకూ లేదు. ఇలా వారు స్వామివారి సన్నిధిలో కొంత సమయం గడిపి, అక్కడి నుండి వెళ్లిపోయారు. వారిని మేము ఆశ్రమం వద్దకు వచ్చాక చూసామే కాని, వారు అక్కడికి రావటం, అక్కడినుండి వెళ్ళటం ఎవరమూ చూడలేదు. అలాగే ఒక రోజు ఒక యోగిని మాత స్వామి వారి దర్శనానికి వచ్చారు.

ఆవిడ స్వామి వారు సాక్షాత్తూ అమ్మవారి స్వరూపం అని, స్వామి వారి వద్ద మేమందరం, భక్తి శ్రద్దలతో, జాగ్రత్తగా ఉండాలని మమ్మల్ని హెచ్చరించి వెళ్లారు.

అప్పట్లో శ్రీ స్వామి వారు రోజు స్నానం కోసం పాలధారకి వెళ్లేవారు. అక్కడే శుభ్రమైన జలం ఉండేది.కోనేరు నీరు అంత మంచిగా ఉండేవి కావు. 1969 లో పాలధార వద్ద గాజానన్ మహరాజ్ అనే సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయన దత్త ఉపాసకులు, గిరినార్ నుండి తపోసాధనకై, శ్రీశైలం వచ్చారు. ఆయనకు స్వామివారిమీద సద్భావన ఉండేదికాదు. “ఈ స్వామివారు ఏమిటో ఎప్పుడూ శిష్యులను వెంటబెట్టుకొని తిరుగుతుంటారు”, అని స్వామివారి గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడేవారు.


ఒకనాడు స్వామివారు ఫాలాధారలో స్నానానికి వెళ్ళినప్పుడు ఈ సాధువుని ఒక పాము కరిచింది. స్వామివారు వెంటనే ఆయనను భుజాలపై వేసుకుని మెట్లన్నీ ఎక్కి, పైకి తీసుకొచ్చి స్వామి రంగయ్య గారికి అప్పగించి,ఆసుపత్రిలో చూపించమని చెప్పారు. స్వామీ వారి చేతి స్పర్శ తో పాము కాటేసిన చోట నుండి రక్తానికి బదులు గా నీరు వచ్చింది. వారికి వైద్యం అందించిన వైద్యులకు కూడా అది ఒక పెద్ద అద్భుతం గా గోచరించింది.

ఆ సాధువుకు కొంత నయమైన తరువాత కూడా స్వామివారు ఆయనకు అనేకమైన పరిచర్యలు చేశారు. అప్పట్లో స్వామి వారి కోసం అని మేమొక మంచం ఏర్పాటు చేసాము.ఆ మంచాన్ని కూడా ఆ సాధువుకు ఇచ్చేసి, స్వామివారు నేల పై పడుకునేవారు.

ఇలా ఎన్నెనో ఉపచారాలు స్వామివారు చేస్తుంటే ఆ సాధువు కన్నీళ్లు పెట్టుకొని, "మహా అపచారం చేశాను స్వామి! మీ మీద మంచి భావం పెట్టుకోలేదు." అని అన్నారు. అలా ఆ సాధువు పాలధార వద్ద కొంత కాలం గడిపి, అడవుల్లోకి వెళ్లిపోయారు. వారిని మేము మళ్ళీ చూడలేదు.


కరుణా స్వరూపులైన శ్రీ స్వామివారు, వారిని కించ పరిచిన వాళ్ళని కూడా యెల్లప్పుడు సమదృష్టి తో చూస్తూ, ఆపధబాంధవుడై ఆదుకుంటారని చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.


నమఃశివాయా స్వామి తో గజానన స్వామి

 

********సశేషం********


595 views4 comments

4 Comments


bottom of page