top of page
Writer's pictureSriswamypoornananda.org

|| యతో వాచో నివర్తంతే || - 7

Updated: Apr 22, 2020

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


శ్రీ పూర్ణానంద స్వామి వారు, జిల్లెళ్ళమూడి నుండి వారి తపోస్థానానికి వెళ్ళాక, వారు మళ్ళీ వెనక్కి వస్తారో లేదో తెలియని సందిగ్దతతో నేను శ్రీశైలం చేరుకున్నాను. ఇది ఇలా ఉండగా, స్వామి వారు ఇంక వెనక్కి తిరిగి రారు అనే ప్రచారం జోరందుకుంది. హఠకేశ్వరంలో, స్వామి వారి ఆశ్రమంలో, శ్రీ స్వామి వారి కోసం ఏర్పరిచిన చిన్న చిన్న వస్తువులు ఒకొక్కటిగా ఎవరికీ వారు తీసుకెళ్లిపోయారు. కొంతమంది హఠకేశ్వరం వైపు రావటం కూడా మానేసారు. నాతో పాటు, ఇంకొంతమంది స్వామి వారు వెనక్కి వస్తారనే ఆశ తో ఎదురుచూస్తున్నాం. అలా ఒక రోజు రమణ బాబా దగ్గర నుండి టెలిగ్రామ్ అందింది.శ్రీ స్వామి వారితో కలిసి, వారు మద్రాసు నుండి బాపట్లకు రైలు ఎక్కుతున్నట్టు సమాచారం ఇచ్చారు. ఇంకేముంది! స్వామి వారిని మళ్ళీ దర్శించుకోబోతున్నాను, అనే ఆనందంతో ఆగమేఘాలపై ఒంగోలు చేరుకున్నాను. ఒంగోలు రైల్వే స్టేషన్ లో మళ్ళీ స్వామి వారి దర్శనం చేసుకున్నాను. అటు నుండి స్వామివారితో పాటు, నేను కూడా జిల్లెళ్ళమూడికి పయనమయ్యాను.


- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)

 

అప్పట్లో జిల్లెళ్ళమూడి అమ్మ గురించి మాసపత్రిక నడుపుతూ, శ్రీ సాయిబాబా భక్తుడైన, శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు జిల్లెళ్ళమూడిలోనే ఉండేవారు. ఆయన మొట్టమొదటి సారి స్వామివారి దర్శనం అక్కడే చేసుకున్నారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపానికి ఆకర్షితులైన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తర్వాతి రోజుల్లో, ఎన్నోసార్లు స్వామివారి దర్శనం కొరకు సున్నిపెంట ఆశ్రమానికి కూడా వచ్చారు. అయితే రమణ బాబా కూడా షిరిడీ నుంచి రావడం, సాయి భక్తులు కావటం చేత,రమణ బాబా గారు,మరియు భరద్వాజ మాస్టర్ గారు ఇద్దరు కలిసి సాయంత్రాలు సాయి భజనలు చేయటం, సాయి చరిత్రకు సంబంధించిన విశేషాలు మాట్లాడుకునేవారు.రమణ బాబా అంతటితో ఆగక అమ్మ అంతరంగీకులకు కూడా బోధ చేయటం మొదలు పెట్టారు.స్వామివారు ఇదంతా చూసీ,


"ఇది అమ్మ స్థానము. ఇక్కడ మనం మన విశ్వాసాల గురించి బోధ చెయ్యకూడదు. మనం ఏ సన్నిధిలో ఉంటే, ఆ సన్నిధిని గౌరవిస్తూ, అక్కడి విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకోవాలి.

వీడు(రమణ బాబా) ఎక్కువగా మాట్లాడుతున్నాడు, వీడి తలకాయ పగులుతుంది.",అన్నారు.

స్వామి వారు అన్నట్టుగానే, ఒక సంవత్సరం తరువాత శ్రీరామనవమి పండుగ కోసమని రమణ బాబా షిరిడీ చేరుకున్నారు. అక్కడ వీధిలో కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. అదే సమయానికి అటు వైపుగా నడుచుకుంటూ వెళ్తున్న రమణ బాబా తలకు, క్రికెట్ బంతి గట్టిగా తగిలి, పెద్ద గాయం అయ్యింది.



జిల్లెళ్ళమూడి లో శ్రీ స్వామి వారి తో రమణ బాబా, BRK గారు. 1969

జిల్లెళ్ళమూడిలో అమ్మకి పూజ అంటే, పూజారితో పని లేకుండా, ఎవరికి వారే అమ్మ పాదాలకు, అమ్మ నామం చెబుతూ పూలను సమర్పించుకోవడం. ఆఖరుగా అమ్మకి హారతి ఇచ్చేవారు. ఇలా ఉండగా ఒకరోజు జిల్లెళ్ళమూడి ఆశ్రమ సెక్రెటరీ రామకృష్ణ గారు స్వామి వారి దగ్గెరికొచ్చి, “మీరొకవేళ అమ్మ పూజ చేసుకోవాలనుకుంటే, రేపు చేసుకోవచ్చని అమ్మ మీతో చెప్పమన్నారు. పూజకు కావలసిన లిస్ట్ ఇస్తే రేపటికి తెప్పిస్తాము.", అన్నారు. స్వామివారు అలంకరణ సామాగ్రితో సహా పూజా సామాగ్రి లిస్ట్ రాసి ఇచ్చారు.

మరుసటి రోజు ఉదయం మంగళవాయిద్యాల నడుమ స్వామివారు అమ్మ వద్దకు బయల్దేరారు. నేను వారిని అనుసరిస్తూ నడుస్తున్నాను. స్వామివారు క్రింద గదిలో ఉండేవారు, అమ్మ మేడ మీద ఉండేవారు. కొన్ని మెట్లు ఎక్కాక స్వామివారు నా వేలు గట్టిగ పట్టుకొని, నాతో, "You conduct the puja.", అన్నారు. "అయ్యో స్వామీ! ఇంతవరకు నేను ఎటువంటి పూజాదికాలు చేసి ఎరుగను. నేను ఎలా చేయగలను?" అన్నాను. స్వామివారు, ”లేదు పూజ నువ్వే చెయ్యాలి”, అన్నారు. ఆ సమయంలో నాకు చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ సంస్కృత పండితులు,వేద పండితులు ఎందరో ఉన్నారు.వారంతా అచ్చంగా సంస్కృతంలోనే మాట్లాడుకునేవారు. నేనేమో పూజ,మంత్రం ఎరుగను.ఇంక అక్కడి నుండి పారిపోవటమే ఉత్తమమనుకొని, అవకాశం కోసం చూస్తూ ఉన్నాను. కానీ ఇదంతా స్వామివారు గమనించి నా చేతిని గట్టిగా పట్టుకున్నారు.

మేడ మీద పూజకి అన్ని ఏర్పాట్లూ చేశారు. అమ్మకి పూజ జరుగుతుందని, భక్తులందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ జనం, ఆర్భాటం చూసి, నాకు చాలా భయమేసింది. పైనుండి కిందకి దూకేసి పారిపోదామా! అనే ఆలోచన వచ్చింది. కానీ అమ్మకి స్వామివారికి మధ్యలో నేనున్నాను. ఇక పారిపోవడానికి కూడా వీలులేని పరిస్థితి. స్వామి వారేమో,”You conduct.”, అంటున్నారు. నాకేమో ఏమి రాదు.అప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన తట్టింది. రమణ బాబా పాటలు బాగా పాడుతారు కదా అని, వారిని పాటలు పాడమన్నాను. ఒక రెండు పాటలు పాడి వారు కూడా ఆపేయటంతో, అందరు నావైపు చూడటం మొదలుపెట్టారు. ఇక తప్పదు అనుకోని, గట్టిగా కళ్ళు మూసుకొని నాకు వచ్చిన నాలుగు ‘గురుబ్రహ్మాధి' శ్లోకాలను గట్టిగా చదివేసాను. మెల్లగా 'ఆధారశక్తి కమలసనాయ నమః', అంటూ స్వామివారి గొంతు నా చెవిలో వినిపించింది. నేను బిగ్గరగా అదే మంత్రం అరిచాను. తరువాత 'అనంతాసనాయ నమః' అని వినిపించింది. మళ్లీ గట్టిగా నేను అదే మంత్రాన్ని అరిచాను. ఇలా స్వామివారి గొంతులో చిన్నగా వినిపించిన ప్రతీ మంత్రాన్నీ బిగ్గరగా అరుస్తూ పూజ పూర్తిచేశాను. మధ్యలో ఒకసారి మాత్రం కళ్ళు తెరిచి అమ్మ వైపు చూసాను. అమనన్ను చూసి నవ్వుతున్నారు.అది గమనించి మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకున్నాను. హారతితో సహా పూజ మొత్తం పూర్తయ్యాక, స్వామివారితో కలసి క్రింద గదికి వచ్చేసాను.

ఇంతలో అక్కడికి కొంత మంది వేద పండితులు వచ్చి, "పూజ బ్రహ్మాండంగా చేయించారండి! చాల బావుంది!", అంటూ నన్ను మెచ్చుకున్నారు."నాదేమి లేదండీ. అంతా స్వామి వారు చేయించారు, వారి అనుగ్రహం", అని ఎంత చప్తున్నా వినకుండా, "పెద్దలు అంతా గురు అనుగ్రహం అనే అంటారు.", అని అంటూ వారంతా నాకు నమస్కారాలు పెట్టి వెళ్లారు.

ఇక నేను ఆగలేక,"స్వామి, మంత్రాలు ఎందుకంత మెల్లగా చెప్పారు? మీరే స్వయంగా పూజంతా నిర్వహించవచ్చు కదా!",అని స్వామివారితో అన్నాను. అందుకు స్వామివారు, "లేదే! నేనెప్పుడు చెప్పాను?", అంటూ నన్ను ఆశ్చర్యపరిచారు. అలా పూజావిధానం మొత్తం మొదటిసారిగా నేను జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధిలో, స్వామి వారు నా చెవిలో చెప్తుండగా,వింటూ పూజ నిర్వహించటం జరిగింది.


మరుసటి రోజున అమ్మ వారు, శ్రీ స్వామి వారికి కాషాయ వస్త్రాలు ఇచ్చాక, జిల్లెళ్ళమూడి నుండి స్వామి వారితో పాటు, నేను రమణ బాబా శ్రీశైలం పయనమయ్యాము.


 

********సశేషం********


622 views0 comments

Commenti


bottom of page