top of page

|| యతో వాచో నివర్తంతే || - 9

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ

కర్మభూమిగా, వేద భూమిగా పిలవబడే మన భారత దేశంలో ఎన్నో ప్రాముఖ్యత సంతరించుకున్న దేవాలయాలు, క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటిలో శ్రీశైలం అతి ముఖ్యమైనదిగా, పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు.సుమారు 2వ శతాబ్దము నుండే ఈ క్షేత్రం ప్రాచుర్యం లో ఉన్నదీ ఈ శ్రీశైల క్షేత్రానికి గల విశిష్టత గురించి చెప్పాలంటే, శ్రీ భ్రమరాంబ దేవీ సమేత మల్లికార్జున స్వామి వారు మహిమాన్వితులై ఈ క్షేత్రం లో కొలువై ఉన్నారని స్థలపురాణం చెప్తుంది. శ్రీశైల క్షేత్రానికి గల మరో విశిష్టత ఏమిటంటే ఇది ఒక శక్తి పీఠం ఇంకా జ్యోతిర్లింగం. కృష్ణా నది ఉత్తర పరివాహక ప్రాంతమైన ఈ క్షేత్రానికి ఉన్న మరో విశేషమేమిటంటే, ఇది ఒక అరణ్య ప్రాంతం లో గిరి మీద ఉన్న క్షేత్రం. ఇలా, జ్యోతిర్లింగం, శక్తిపీఠం, నది పరివాహక ప్రాంతమై గిరి పై అరణ్యంలో ఉండటం వలన శ్రీశైలం మన దేశం లోనే ఎంతో అరుదైన శివ శాక్తేయ క్షేత్రమయ్యింది. ఎందరో యోగులు, సిద్ధ పురుషులు ఈ క్షేత్రం లో ఉండి తపస్సు గావించారని చరిత్ర చెబుతుంది.ఒకానొక సందర్భం లో, శ్రీ పూర్ణానంద స్వామి వారు ఈ క్షేత్ర విశిష్టత గురించి చెబుతూ, ఇది అష్టావక్ర మహర్హి, అగస్త్యుల వారు, దత్తాత్రేయులు వారు వంటి ఎందరో మహాత్ములు సంచరించిన ఒక దివ్య క్షేత్రమని చెప్పారు. ఈ క్షేత్రానికి సమీపం లో ఉన్న పాలధార, పంచధార ప్రాంతంలో శ్రీ ఆది శంకరాచార్యులు వారు శివానంద లహరి రచించారు. అందులో కొన్ని శ్లోకాలలో శ్రీశైల క్షేత్ర విశిష్టత గురించి కూడా వివరించారు. శ్రీ స్వామి వారు మన ఆశ్రమం యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ, ఒక సాధకుడు ఒక క్షేత్రం లో కానీ, నదితీరం లో కానీ, మహా అరణ్యంలో కానీ, గిరిపై లేదా గురు సన్నిధి లో సాధన చేస్తే, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితి కి చేరుకోవచ్చు అన్నారు.మన ఆశ్రమానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇవన్నీ కలిసి ఒకే చోట ఉండటం.అంతే కాకుండ ఇదే మన పరమ గురు సన్నిధి(శ్రీ ఓంకారానంద స్వామి వారి పాదుకా క్షేత్రం) కూడా కావటం, మనకు మాత్రమే లభించిన ఒక గొప్ప అవకాశం. అటువంటి ఈ శ్రీశైల క్షేత్ర దర్శనార్ధం ప్రతి రోజు దేశ నలుమూలల నుంచి ఎందరో యాత్రికులు, భక్తులు వస్తూ ఉంటారు.


 

ఒక రోజు అలా ఒక యాత్రికుడు శ్రీశైలం తో పాటు చుట్టుపక్కల ఉన్న ఎన్నో దేవాలయాలు దర్శించుకుంటూ హఠకేశ్వరం చేరుకున్నారు. అదే సమయానికి నాతో పాటూ అప్పటి కొంతమంది భక్తులు శ్రీ స్వామి వారితో ఉన్నారు. స్వామి వారిని చూడటం తోనే ఒక గొప్ప అనుభూతి పొందిన ఆ యాత్రికుడు, స్వామివారి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, స్వామివారు ఎవరని, వారినే స్వయంగా విచారించారు. అందుకు శ్రీ స్వామి వారు, ఒక స్తుతి రూపంలో బదులిచ్చారు.





ఆ రోజు శ్రీ స్వామి వారు ఆలా స్తుతించటం విన్న మా అందరి హృదయాలు అలౌకికమైన ఆనందంతో నిండిపోయాయి. ఆ యాత్రికుడు కూడా ఆనందానుభూతి తో శ్రీ స్వామి వారికీ నమస్కారం చేసుకొని, తిరుగు పయనమయ్యారు.శ్రీ పూర్ణానంద స్వామి వారు ఆ రోజున స్తుతించిన, ఆత్మస్తుతిని సీనియర్ సత్యనారాయణ గారు రాసుకోవటం జరిగించి. వారి నుండి మేము, మరి కొంత మంది భక్తులు ఈ ఆత్మస్తుతి ని రాసుకున్నాము. శ్రీ స్వామి వారి చిన్ననాటి స్నేహితులైన శ్రీ కృష్ణ శంకర్ గారికి స్వామి వారే ఆత్మస్తుతిని స్వయంగా తమిళ ప్రతిలో రాసి ఇచ్చారు.



శ్రీ స్వామి వారు స్తుతించిన ఆత్మ స్తుతి:


  • అహం బ్రహ్మ రూపి,బ్రహ్మ స్వరూపి|

  • అహం శివ రూపి, శివ స్వరూపి||


  • అహం సర్వ రూపి, సర్వ స్వరూపి|

  • అహం సర్వ వ్యాపి, అహం సర్వ సాక్షి||


  • అహం ఆనంద రూపి, మంగళ స్వరూపి|

  • అహం విశ్వ రూపి,అహం విరాట్ రూపి||


  • అహం నిత్య రూపి, నిర్మల స్వరూపి|

  • అహం నిర్వికల్పి,అహం నిర్వికారి||


 

*******సశేషం********




578 views0 comments
bottom of page