top of page

|| యతో వాచో నివర్తంతే || - 3

Updated: Apr 21, 2020

ఓం నమో భగవతే పూర్ణానందాయ

     

శ్రీ స్వామి వారు హఠకేశ్వరానికి రాక మునుపు, అక్కడొక యోగిని మాత ఉండేవారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటు హఠకేశ్వరంలో ఒక చిన్న కుటీరం లాంటి గుడిసె లో ఆవిడ ఉన్నారు. స్వామి వారు హఠకేశ్వరానికి రాక మునుపే, స్వామివారి రాక గురించి ఆవిడ, “రాబోయే రోజుల్లో ఇక్కడికి ఒక సిద్ధ పురుషులు రాబోతున్నారు”,అని దొరై స్వామి నాయుడు (స్వామి వారి ప్రథమ భక్తులలో ఒకరు) గారితో అన్నారు.ఆవిడ హఠకేశ్వరం వదిలి వెళ్ళిన కొన్ని నెలలకే స్వామి వారు హఠకేశ్వరానికి విచ్చేసారు. ఆ యోగిని మాత ఉండి వెళ్లిన కుటీరాన్ని స్వామివారు నివాసంగా చేసుకున్నారు.

- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

మహాత్ములైన శ్రీ పూర్ణానంద స్వామి వారు, తమకున్న శక్తులను ప్రదర్శన చేయకుండా నిరాడంబరంగా ఉండేవారు.ఆ కాలం లో మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులలో ఉండేవాళ్ళం. స్వామి వారి కోసం ఏదైనా చేస్తే, వారేమో దానం ఇచ్చేస్తూ ఉండేవారు.నా ప్రక్కన ఉండే కారంకి కృష్ణమూర్తి గారు, రాజుగారు, చక్రపాణి, నాగభూషణం, రమణయ్య, గోపాలం వంటి వారందరూ స్వామివారి దగ్గర ఏమీ మాట్లాడేవారు కాదు.ఏదైనా విషయం వస్తే, "స్వామివారిని నువ్వడుగు", అంటూ నా చేత అడిగించే వారు,నన్ను ముందుకు నెట్టేవారు.


ఒకరోజు స్వామివారు మాతో ఆనందంగా మాట్లాడుతున్న సమయంలో " స్వామి! మీరు ఇన్ని మంత్రాల గురించి చెబుతుంటారు కదా! చాలా మంది దేవతల గురించి మీరు చెప్పగా విన్నాము.అందులో ధనానికి అధిపతి కుబేరుడని మీరు చెప్పగా విన్నాం.అటువంటి కుబేరుని అనుగ్రహం దొరికితే బాగుంటుంది కదా! దాని వల్ల మేమందరం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతాము" అని అడిగాను.

"ఐతే కుబేరుని అనుగ్రహం కావాలా?" అన్నారు స్వామివారు.

"అవును స్వామి! ఎక్కువ ధనముంటే ఇక్కడికి వచ్చే మీ భక్తులకి ఎక్కువ సేవ చేసుకోగలుగుతాము.", అని అన్నాం.

                

స్వామివారు,

"మంత్రాలు నిజంగానే ఫలిస్తాయి. కుబేరుని అనుగ్రహమౌతుంది. అయితే రేపు లేదు ఎల్లుండి పౌర్ణిమ వస్తుంది. కుబేరుడు అంటే యక్షుడు. యక్షులకు రాత్రి పూట పూజ చేయాలి. అందుకని పౌర్ణమి రోజు రాత్రి ఒక కిలో బియ్యంతో అన్నం వండండి. దానితో హోమం చేయాలి. మంత్రం నేను చెప్తాను, మీరు హోమం చేయండి."

అన్నారు.


పౌర్ణమి రోజు రాత్రి 8"గం" సమయానికల్లా అన్నం వండాము.మంచి వెన్నల,చంద్రుడు విపరీతమైన వెలుగు ఇచ్చాడా అన్నట్లు,అడవంతా పెద్ద ఫోకస్ లైట్లేమన్నా పెట్టారేమో అన్నంత వెలుగు.ఆ దృశ్యాన్ని చూసి అందరం ఆశ్చర్యపోయాము.ఇక అందరం స్నానాలవీ కానిచ్చి,విభూతి పెట్టుకుని,విడిచిన బట్టలు మడిచేసి ఆశ్రమంలో పెట్టాము.(ఆశ్రమం అంటున్నాం కానీ, అది ఒక 'cone shaped' చిన్న గుడిసె.)


అందరూ స్వామివారు మంత్రదీక్ష ఇస్తారు కదా అని, చాలా ఉత్సాహంగా హోమగుండం చుట్టూ కూర్చున్నారు . స్వామివారు నాతో, " మంత్రం నువు చెప్పు", అన్నారు."స్వామి! నాకు ఏ కుబేర మంత్రం తెలీదు!", అన్నాను. "సరే.నేను నీకు చెబుతాను, నువు వాళ్లకు చెప్పు." అన్నారు స్వామివారు. ఉపదేశం ముందు నాకే అవుతుంది అని ఆనందపడ్డాను. స్వామివారు నాతో ఒక మంత్రం చెప్పారు.నేను వెళ్ళి వాళ్ళకుమంత్రం చెప్పాను.ఇంతలో స్వామివారు వాళ్ళలో కొంతమందిని అన్నంతో, కొంత మందిని నువ్వులతో హోమం చేయమని చెప్పి, నన్ను వారితో రమ్మన్నారు. పౌర్ణమి రోజు రాత్రి ఆ మంచి వెన్నెలలో, నన్ను తీసుకొని కైలాస ద్వారం వైపు చాలా దూరం సంచారానికి వెళ్లారు.చాలాసేపు అడవిలో తిరిగి, మళ్లీ ఆశ్రమానికి దగ్గర లో ఒక చెట్టు క్రింద కూర్చున్నాం. అప్పుడు సమయం తెల్లవారు ఝామున 3:30 అలా అయ్యింది.స్వామివారు నాతో, "రాత్రంతా వాళ్ళు చాలా శ్రమపడి హోమం చేస్తున్నారు.వాళ్ళు ఏ మంత్రంతో హోమం చేస్తున్నారో చూసి రా!", అన్నారు. వెళ్లి చూచి వచ్చాను కానీ, నేనుకూడ మంత్రం మర్చిపోయాను. హోమం చూసి వచ్చి, వారు చేస్తున్న మంత్రం స్వామి వారి తో చెప్పాను. వెంటనే స్వామివారు, " అయ్యో అది అగ్నిదేవుని మంత్రం.", అన్నారు. అలా కుబేర మంత్రం కాస్తా అగ్ని మంత్రంగా మారింది. అగ్ని మంత్రంతో తెల్లవార్లూ వీళ్లంతా హోమం చేశారు. "సరే! ఏదోకటి చేసార్లే", అన్నారు స్వామివారు.ఇంతలో వీళ్ళు హోమం చేసే హోమగుండం నుండి ఒక అగ్గిరవ్వ పోయి కుటీరం మీద పడింది. అది చూసుకోకుండా వీళ్లంతా అత్యుత్సాహంతో గట్టిగా మంత్రం చదువుతూ హోమం చేస్తూనే ఉన్నారు. ఇంతలో ఆ గుడిసె అంటుకుంది. మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. గబగబా అందరం అక్కడికి చేరుకొని చూసేటప్పటికి స్వామివారు ఉంటున్న ఆ గుడిసె, అందులో వీళ్ళందరూ ముందురోజు రాత్రి పెట్టిన బట్టలు, అన్నీ తగలబడి పోయినాయి. ఒక్క స్వామివారి కౌపీనం,  విభూతి డబ్బా, కుంకుమ డబ్బాని మాత్రం అగ్నిదేవుడు ముట్టుకోలేదు. అదో పెద్ద ఆశ్చర్యం మా అందరికీ. మొత్తానికి మనం చేసిన హోమంతో గురువుగారి నివాసానికే నిప్పు పెట్టిన వాళ్ళమైనామే అనే పశ్చాతాపం కలిగింది మా అందరిలో.


"దేనికైనా ప్రాప్తం ఉండలిరా!", అన్నారు స్వామివారు. తెల్లవారాక ఆ శిధిలాలను తొలగించాము. చక్రపాణి పరుగెత్తుకుంటూ వెళ్ళి సున్నిపెంట నుండీ వీళ్ళ బట్టలు తెచ్చి ఇచ్చాడు. అవి ధరించి వీళ్ళంతా ఇళ్లకు వెళ్లారు. మంత్రాక్షరాలు గురువు ఇచ్చినది కాక  మర్పుచేసి హోమం చేసినందుకు ఇలా జరిగిందే, అని అందరూ పశ్చాత్తాప్పడ్డాము. వెంటనే గురవయ్య,రామయ్య అనే ఇద్దరు కాంట్రాక్టర్లు స్వామివారి దర్శనానికై వచ్చారు. ఇక్కడ నాలుగు రేకులతో షేడ్ వేస్తామని చెప్పారు వాళ్ళు. ఇక అక్కడి శిధిలాలను తీసేసి ఒక వారం రోజులలో బేస్మెంట్ కట్టి, పైన 6-8 రేకులతో 3 భాగాలతో చిన్న షెడ్ ఒకటి వేశారు. కొయ్య స్తంభాలతో, చుట్టూరా తాడికలతో, పైన రేకులు కప్పి ఈ షెడ్ వేశారు. అందులో 3  భాగాలు. 9×9 ఒక భాగం, 9×9 ఇంకొక గది ,9×18 ఒక హాల్ లాగా కట్టారు. స్వామివారు దర్శనాలు ఇవ్వాలన్నా అదే హాల్. 9×9  గదిలో స్వామివారు ఉండటానికి, మరో 9×9 గదిలో వంటకి ఏర్పాట్లు చేశాం. బేస్మెంట్ ఎత్తు పైన ఈ గదులు చూసి

" ఓహో! ఇప్పుడు మనం "up" లోకి వచ్చామన్నమాట"

,ఆని సరదాగా స్వామి వారు అన్నారు. ఆ విధంగా ఆశ్రమం మరో రూపం తీసుకుంది. కుబేర మంత్రంతో కాక పోయినా అగ్నిమంత్రంతో ఈ విధంగా స్వామివారి "సేవ" చేయడం జరిగింది.


కుబేర హోమానికి ముందు కుటీరము వద్ద శ్రీ స్వామి వారు

 

********సశేషం********


534 views0 comments

コメント


bottom of page