top of page

|| యతో వాచో నివర్తంతే || - 4

Writer's picture: Sriswamypoornananda.orgSriswamypoornananda.org

Updated: Apr 21, 2020

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


స్వామి వారి దర్శనం అయిన కొద్ది రోజులకే, స్వామి వారి వివరాలు తెలుసుకోవాలనే కుతూహలంతో, వారితో పాటు ఉంటున్న రమణ బాబా అనే సాధువుతో పరిచయం పెంచుకున్నాను.స్వామి వారి గురించి వారికి తెలిసిన కొన్ని విషయాలతో పాటు, స్వామి వారిని రమణ బాబా గారు ఎలా కలుసుకున్నారనే విషయాలు రమణ బాబా గారు నాతో చెప్పారు.


- బి రాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

కార్తీక పౌర్ణమినాడు శ్రీ రాఖాడీ బాబా వారు(శ్రీ ఓంకారానంద స్వామి), శ్రీ స్వామి వారికి దీక్షను ఇచ్చి, శ్రీ పూర్ణానంద అని నామకరణం చేసారు. ఆలా సన్యాస దీక్షను ఇచ్చిన పిమ్మట, స్వామి వారిని వెంటపెట్టుకొని, శ్రీ రాఖాడీ బాబా వారు, వారి గురువులైన శ్రీ నిత్యానంద భగవాన్ సన్నిధానం,గణేశ్ పూరికి వెళ్లారు. 1968 కార్తీక పౌర్ణమి నుండి 43 రోజుల పాటు బాబా వారితో స్వామి వారు గణేశ్ పూరిలో ఉన్నారు. 43 రోజుల తదుపరి బాబా వారి ఆదేశం మేరకు, కౌపీనధారిగా, కాలి నడకన శ్రీ స్వామి వారు గణేశ్ పూరి నుండి షిరిడీకి బయల్దేరారు.

షిరిడీకి వెళ్ళే దారిలో శ్రీ స్వామివారు కొంత అస్వస్థకు గురయ్యి నడవలేని పరిస్థితిలో, వారికి సమీపంలో కల్వర్ట్ కోసమని తయారు చేసిన సిమెంట్ పైపుల వద్ద విశ్రాంతికి ఆగారు. ఆ పైపులలో నివాసముంటున్న కొంత మంది యాచకులు, స్వామి వారుమహానుభావులు అని గుర్తించి, ఎంతో శ్రద్ధ తో, సుచిగా వంట చేసి,శ్రీ స్వామి వారికి భోజన ఏర్పాట్లు చేశారు. జీవ కోటి పై సమదృష్టి, కరుణ కలిగిన స్వామివారు ఆ యాచకుల భక్తి భావాల్ని మన్నించి, వాళ్ళ దగ్గర భిక్షను స్వీకరించి, కొంత విశ్రాంతి తీసుకొని షిరిడీకి పయనమయ్యారు.

అలా 1969,జనవరి లో శ్రీ స్వామివారు షిరిడీకి చేరుకున్నారు. అప్పుడు షిరిడీ లో ఒక దివ్యమైన సంఘటన చోటు చేసుకుంది. షిరిడీ అప్పటి రోజుల్లో ఇప్పుడు ఉన్నంత రద్దీగా ఉండేది కాదు. స్వామి వారు శ్రీ షిరిడీ సాయి నాథుని సమాధి మందిరంలో, బాబా వారి సమాధికి సమీపముగా చేరగా, అదే సమయంలో మందిరానికి సాయి భక్తులు కొందరు గుంపుగా చేరారు. వారిలో ఒకరు సాయినాథుని విగ్రహం మెడలో పూలమాల వేద్దామని మాలని విసిరారు. ఆ పూలమాల సరాసరి వచ్చి శ్రీ స్వామి వారి మెడలో పడింది. అది చూసిన ఆ భక్తులందరూ ఆశ్చర్యచకితులై, స్వామివారి స్వరూపంలో ఉన్న సాయినాధుని దర్శించుకొని, స్వామిజి చుట్టూ చేరబోయారు. వారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో స్వామి వారు, మందిరానికి సమీపంలో ఉన్న ఒక గది లోకి వెళ్లి తలుపులు వేశారు. అదే గది లో ఒక సాధువు శ్రీ షిరిడీ సాయినాథుని దర్శనం కొరకు దేహ త్యాగానికి కూడా వెరవక, తదేక దీక్షలో ఉన్నారు.


ఆ గదిలోకి వెళ్ళగానే, అక్కడున్న సాధువుకి శ్రీ పూర్ణానందస్వామి వారు సాక్షాత్తు శ్రీ షిరిడీ సాయినాథులుగా దర్శనం ఇచ్చారు. అలౌకికమైన ఆనందం పొందిన ఆ సాధువే శ్రీ రమణ బాబా. స్వామి వారిని షిరిడీ సాయినాథుని గా భావన చేసుకున్న రమణ బాబా, స్వామి వారిని దిశా నిర్దేశం చేయమని అడగగా, స్వామి వారు,

“ప్రాణం వృధా ప్రయాసలతో పోయేకన్నా, తపస్సు లో పోతే ఉత్తమం”

, అని అన్నారు.


స్వామి వారిని గురువుగా భావించి, వారి తపస్సు చేసుకునేందుకు అనుగుణంగా ఏదైనా తపోస్థానాన్ని చూపాలని స్వామి వారిని రమణ బాబా ప్రాధేయ పడ్డారు. అలా రమణ బాబాను వెంటపెట్టుకొని షిరిడీ నుండి బయలుదేరిన స్వామి వారు ఎన్నో క్షేత్రాలను తపస్సుకి పరిశీలించుకుంటూ మంత్రాలయానికి చేరుకున్నారు. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సన్నిధిలో, స్వామి వారికి శ్రీశైల క్షేత్రం గురించి వారి తండ్రి గారు,శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చెప్పిన మాటలు స్ఫురణలోకి వచ్చాయి. అలా మంత్రాలయం నుండి రమణ బాబాతో స్వామి వారు శ్రీశైలం చేరుకున్నారు.

ఆంధ్ర రాష్ట్ర సుభిక్షత కోసం అదే సంవత్సరం శ్రీశైల దేవస్థానం వారి అద్వర్యంలో యజ్ఞ యాగాలు జరిగాయి.స్వామివారు శ్రీశైలం లో పాదం మోపిన రోజే, ఆ యాగాలు పూర్తయి, పూర్ణాహుతి జరిగింది. అలా ఆ యాగాల సంకల్పమే శ్రీశైల క్షేత్రానికి పూర్ణ పురుషులైన శ్రీ పూర్ణానందస్వామివారి ఆగమనానికి ఆహ్వానం పలికిందని మనం భావించుకోవచ్చు.

ఇలా స్వామి వారితో షిరిడీ నుండి శ్రీశైలం, అటు నుండి హఠకేశ్వరానికి చేరిన రమణ బాబా వారు, వారి జీవితం లో ఒక్కసారైనా పంచాగ్ని తపస్సు చేయాలనే కోరిక ఉందని,వారికి పంచాగ్ని తపస్సుపై ఉన్న ఆసక్తి గురించి స్వామి వారితో విన్నవించుకుని, స్వామి వారి ఆధ్వర్యంలో అది జరిగితే బావుంటుందని కోరారు.

అలా హఠకేశ్వర క్షేత్ర సమీపంలో ఉన్న స్వామి వారి ఆశ్రమం లో పంచాగ్ని తపస్సుకి ఏర్పాట్లు చేయమని శ్రీ స్వామివారు మాతో అన్నారు. సుమారు 1969, ఏప్రిల్ నెలాఖరున ఈ పంచాగ్ని హోమం మొదలయింది. స్వామి వారి ఆధ్వర్యం లో దాదాపు 40 రోజుల పాటు సాగిన ఆ పంచాగ్ని హోమంలో రమణ బాబాతో పాటు, నమః శివాయ స్వామి కూడా పాలుపంచుకున్నారు. 40 రోజుల తర్వాత పూర్ణాహుతి చాలా వైభవంగా జరిగింది. శ్రీశైలం నుండి వచ్చిన అర్చకులతో పాటు, మా ప్రాజెక్ట్ కాలనీ రామాలయ భక్త బృందం రాకతో హఠకేశ్వరం కిక్కిరిసిపోయింది. స్వామివారు పూర్ణాహుతి మంత్రాలు ఉఛ్ఛరిస్తుంటే, మా అందరికీ రోమాలు నిక్కపొడుచుకున్నాయి.


శ్రీ స్వామివారితో రమణ బాబా

పూర్ణాహుతి పూర్తయ్యే సమయానికి, స్వామివారిని వెతుక్కుంటూ గుంటూరు నుండి ఒకరు వచ్చారు. స్వామివారితో వారు సన్నిహితంగా మాట్లాడటం చూసి, వారు ఎవరు ఏంటి అనే వివరాలు తెలుసుకునే లోపల, స్వామివారు వారితో గుంటూరు వెళ్తున్న విషయం మాకు చెప్పారు. ఎవరో వచ్చి స్వామివారిని మా నుండి దూరంగా తీసుకెళ్ళిపోతున్నారు అనే ఆందోళన నాలో మొదలయింది.


 

********సశేషం********


518 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page