top of page

|| యతో వాచో నివర్తంతే || - 5

Updated: Apr 21, 2020

ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ


పంచాగ్ని హోమం పూర్ణాహుతి రోజున, జిల్లెళ్ళమూడి(గుంటూరు జిల్లా) నుండి స్వామి వారిని వెతుక్కుంటూ వచ్చిన వారి పేరు అన్నంరాజు రామకృష్ణ గారు అని, శ్రీ స్వామివారు హఠకేశ్వానికి రాక మునుపే, శ్రీశైలంలో తిరుపతి సత్రం లో మా అందరికన్నా ముందే వారికి శ్రీ స్వామి వారి దర్శనం అయ్యింది అని, అమ్మవారి కటాక్షం కోసం స్వామివారు రామకృష్ణ గారికి మంత్రోపదేశం చేశారని తెలిసింది. అలా స్వామి వారు ఉపదేశించిన మంత్రాన్ని క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో రామకృష్ణ గారు సాధన చేయగా, ఒక రోజు వారికి జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గర నుండి పిలుపు వచ్చింది. జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధి లో ఉంటున్న రామ కృష్ణ గారిని ఒక రోజు అమ్మ, స్వామి వారి వివరాలు అడిగి, స్వామివారిని జిల్లెళ్ళమూడికి తీసుకురమ్మని అడిగారు. రామకృష్ణ గారు జరిగిన విషయం అంత శ్రీ స్వామి వారికి చెప్పి, స్వామి వారు జిల్లెళ్ళమూడికి రావాల్సిందిగా కోరారు.

- బిరాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)


 

స్వామివారు రామకృష్ణ గారి ఆహ్వానం మన్నించి, రమణబాబాని వెంటపెట్టుకొని జిల్లెళ్ళమూడి కి బయల్దేరారు. అటు నుండి స్వామివారి “తపోస్థానమైనకారియర్ కూడా వెళ్తున్నట్టు మాతో అన్నారు. ఒకసారి వారి “తపోస్తానానికి” వెళ్ళాక, వారు మళ్ళీ వెనక్కి రారేమో అనే భయంతో నేనూ వారిని అనుసరించాను.నేను వాళ్ళ ముగ్గురికీ తెలియకుండా వారు వెళ్లే బస్సు లోనే ఎక్కి వెనుక సీట్ లో కూర్చున్నాను. అది శ్రీశైలం నుండి గుంటూరు వెళ్లే బస్సు. మార్గ మధ్యలో స్వామి వారు వెనక సీట్ లో కూర్చున్న నన్ను చూసారు, కానీ ముందు కి రమ్మని చెప్పలేదు. నేను కూడా ముందుకు వెళ్లలేదు.అలా గుంటూరు లో వారు బస్సు దిగి, బ్రాడీపేట 5వ లైన్ లో నివాసముంటున్న అన్నంరాజు మాధవరావు గారి ఇంటికి వెళ్లారు. వారి ఇంటికి సమీపం లోనే మా పెద్ద అన్నయ్య, బి. ఆంజనేయులు గారి ఇల్లు, తమ్ముడు, బి. గురునాథ రావు గారి ఇల్లు కూడా ఉన్నాయి. స్వామి వారు నన్ను లోపలికి పిలుస్తారేమో అని, నేను మాధవరావు గారి ఇంటి బయట ఒక గట్టు మీద కూర్చొని ఉన్నాను. రాత్రయినా స్వామివారి నుండి ఎటు వంటి పిలుపు రాకపోయేసరికి, సమీపం లో ఉన్న మా అన్న గారి ఇంటికి వెళ్లి, ఉదయాన్నే మళ్ళి వద్దామని అనుకున్నాను. ఇంతలో స్వామి వారి నుండి పిలుపు వచ్చింది. లోపలికి వెళ్లగా స్వామివారు నాతో, "ఇక్కడ మీ ఇల్లుందన్నావు కదా! పద మీ ఇంటికి పోదాం", అన్నారు. వారు కొంత ఏకాంతతని కోరుకుంటున్నారని అర్ధమయ్యి, మా తమ్ముడు ఇంటికి తీసుకువెళ్లాను. అప్పట్లో మా తమ్ముడు వాళ్ళు, మా రెండవ అన్నయ, బి.కాశీ విశ్వేశ్వర రావు గారి ఇంటి వద్ద ఉండటం వల్లనా, వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంది. అది తడికల గోడలతో తలుపు కూడా లేని పూరిల్లు. అలా స్వామివారు అన్నంరాజు మాధవరావు గారి ఇంట్లో అందరికీ, మళ్లీ రేపు ఉదయం వస్తాము అని చెప్పి నాతో బయల్దేరి మా ఇంటికి నడుచుకుంటూ వచ్చారు. తలుపులు కూడా లేని ఆ ఇంట్లో మంచి గాలి వస్తుంది.వారు పడుకోవటానికి నాలుగు పట్టాలను మాత్రం క్రింద పరవగలిగాను. "అబ్బా!ఎంత హాయిగా ఉంది", అంటూ వారు ఆ పట్టాలమీదనే పడుకున్నారు. ఉదయాన్నే స్నానాదికాలు అయ్యాక మా అన్నదమ్ములందరికి కబురు చేయగా, వారందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇంతలో ఇంటి వెనుక ఉంటున్న ఒక పురోహితుడిని ఇంటికి పిలిపించి, మా నాన్నగారిని కూడా పిలిపించి, సకుటుంబ సపరివారముగా అన్నాతమ్ములందరం స్వామివారికి పాదపూజ చేసుకొని, స్వామివారికి వస్త్ర సమర్పణ చేసుకున్నాము. మేము పాదపూజ చేసుకున్నాక స్వామివారు లేచి, ప్రక్కగదిలో మంచం మీద లేవలేక ఉన్న మా నాన్న గారి వద్ధకు వెళ్లి, వారి మంచం మీదనే కూర్చుని కొద్ది సేపు వారితో మాట్లాడారు. నా గురించి మా నాన్నగారు, "మా వాడిని మీ చేతిలో పెడుతున్నాను స్వామీ", అన్నారు. స్వామివారు, "మరేం భయం లేదు",అని నాన్నగారికి అభయం ఇచ్చారు. ఇలా 26th June 1969న స్వామివారి దర్శనం చేసుకున్న మా నాన్నగారు 9th September 1969 అంటే మూడునెలకు స్వర్గస్తులైనారు. పాద పూజ తర్వాత, నైవేద్యం కోసమని చేసిన పాయసం, నివేదనానంతరం, స్వామివారే స్వయంగా మా కుటుంబం మొత్తానికి వడ్డించారు. అప్పట్లో మా కుటుంబం చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండేది. తిండికి గడవక పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజు మా కుటుంబం స్వామివారికి స్వయంగా చేసుకున్న గురుపూజ మహిమ వల్లనో, స్వామి వారు స్వయంగా ప్రసాదం మా అందరికీ వడ్డించటం వల్లనో, మళ్ళి మా అన్నదమ్ముల కుటుంబాలలో అటువంటి పరిస్థుతులు, తిండికి ఇబ్బంది పడిన రోజులు రాలేదు, ఇక రావు కూడా!


శ్రీ పూర్ణానంద స్వామి వారి కరుణ అటువంటిది. ఒకసారి మనం వారి శరణు కోరితే, వారు మనతో పాటూ, మన ముందు తరాలను కూడా తరింపచేస్తారు. వారి అనుగ్రహం కోసం మనం ఒక్క అడుగు వేస్తే, వారు మన మీద అనుగ్రహ వర్షం కురిపించేందుకు మన కోసం పది అడుగులు వేస్తారు.

శ్రీ పూర్ణానంద స్వామి, 1969


|| శ్రీ పూర్ణానంద చరణం శరణం ||


 

********సశేషం********


538 views0 comments

Commentaires


bottom of page