ఓం నమో భగవతే శ్రీ పూర్ణానందాయ
గుంటూరులో మా ఇంట్లో స్వామివారికి మేము చేసుకున్న పాద పూజని చూసి అన్నంరాజు రామకృష్ణ గారు, వారి ఇంట్లో కూడా అదే విధముగా శ్రీ స్వామి వారికి పాద పూజ చేసుకోవాలనుందని, ఆ ఏర్పాట్లు వారి ఇంట్లో కూడా చేయవలసిందిగా అడిగారు. మరుసటి రోజున శ్రీ స్వామివారికి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు పాద పూజ చేసారు.
- బిరాధాకృష్ణమూర్తి (బి.ఆర్.కె)
మరుసటి రోజున రామకృష్ణ గారు, స్వామి వారిని, నన్ను, రమణ బాబాను, వారితో పాటు జిల్లెళ్ళమూడికి తీసుకువెళ్లారు. జిల్లెళ్ళమూడి గుంటూరు జిల్లా, బాపట్ల సమీపంలో ఉన్నది. అమ్మ పేరు 'మాతృశ్రీ అనసూయ దేవి'. అమ్మ 1923లో మన్నవ అనే గ్రామం(గుంటూరు జిల్లా)లో పుట్టారు. 1936లో శ్రీ బ్రహ్మాండం నాగేశ్వర రావు గారితో అమ్మ వివాహం జరిగింది. అనంతరం వారు జిల్లెళ్ళమూడి లో స్థిరపడ్డారు. అలా వారికి జిల్లెళ్ళమూడి అమ్మ అనే పేరు వచ్చింది. దేశ విదేశాల నుండి అమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు, అమ్మని 'విశ్వజననిగా' కీర్తించి కొలిచేవారు.
శ్రీ పూర్ణానంద స్వామివారు, జిల్లెళ్ళమూడి అమ్మ, ఒకరికొకరు ఎదురు పడితే, ఎలా ఉంటుంది? వారిద్దరి మధ్య సంభాషణ ఎలా సాగుతుంది? అనే ఉత్కంఠ భావంతో అందరితో పాటు నేనూ ఎదురు చూసాను. అనుకున్న విధముగా జిల్లెళ్ళమూడి చేరాము. స్వామి వారితో పాటు, నేను రమణ బాబా అమ్మ వద్దకి వెళ్ళాము. శ్రీ స్వామివారు, అమ్మ ఎదురెదురుగా కూర్చున్నారు.వారు ఎం మాట్లాడుకుంటారనే ఉత్కంఠ అంతకంతకు పెరిగింది. కానీ, వారిద్దరూ మౌనంగానే ఉన్నారు. కొద్ది సేపటికి శ్రీ స్వామి వారు మౌనాన్ని వీడి, ఆంగ్లంలో,
“The motherless shiva at last found his mother”
,అని అన్నారు. అలా శ్రీ స్వామివారు, అమ్మ స్థితితో పాటు, వారి స్ధితి గురించి కూడా ఒకే మాటలో చెప్పారు. 4 రోజులు పాటు జిల్లెళ్ళమూడి లో శ్రీ స్వామి వారితో పాటు, నేను, రమణ బాబా ఉన్నాము. అటు నుండి స్వామివారు, వారి తపోస్థానానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తిరిగి శ్రీశైలం వచ్చే ఆలోచన లేదు అని మాతో అన్నారు. ఇంతలో జిల్లెళ్ళమూడి అమ్మ, స్వామి వారితో,
“నాన్నా! మీకు కాషాయ వస్త్రాలు పెడదామనుకున్నాను. వచ్చే నెలలో మళ్ళీ వస్తారుగా! అప్పుడు పెడతానులే!”
, అన్నారు. స్వామివారిని సాగనంపేందుకు బాపట్ల రైల్వే స్టేషన్ దాకా నేను వెళ్లాను. శ్రీ స్వామి వారితో పాటు రమణ బాబా కూడా వెళ్తున్నారు. వారు రైలు ఎక్కే సమయానికి, వారితో, “స్వామీ! మీరు మళ్ళీ తప్పకుండా రండి" అని వేడుకున్నాను. దానికి స్వామి వారు, “సరే చూద్దాం!”, అన్నారు. అప్పుడు నేను రమణ బాబాకి ఒక పదిరూపాయిలు చేతిలో పెట్టి, మీరు మద్రాసు నుండి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయండి, లేకపోతే టెలిగ్రాం ఇవ్వండి. నేను ఒంగోలులో మిమ్మల్ని కలుసుకొని, మీతో పాటు జిల్లెళ్ళమూడికి వస్తాను అని చెప్పాను. అలా శ్రీస్వామివారు వారి తపోస్థానానికి పయనమయ్యారు. వారు వెనక్కి తిరిగిరావాలని మనసులో వేడుకుంటూ శ్రీశైలానికి తిరిగి పయనమయ్యాను.
********సశేషం********
Comments